• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెంగీ ఫీవర్: వర్షాలు, వరదలు కాదు...ఈ దోమ మహా ప్రమాదకరం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
డెంగ్యూ

చినుకుల కాలం మొదలవగానే చెట్టూచేమతో పాటు మనమూ ఎండల గుండంలోంచి బయటపడ్డామని కాస్త ఊపిరి పీల్చుకుంటాము. వానలు తెచ్చే వరదా బురద సంగతి ఎలా ఉన్నా "వానల్లు కురవాలి వరిచేలు నిండాలి" అని సంతోషంగా పాడుకుంటాము.

ఒక పక్క పచ్చదనం కొత్త ప్రాణం పోసుకుంటున్నా, పొంచి ఉండి మనల్ని ముంచే రోగాల కాలమూ ఇదే. ఎంత కాపాడుకున్నా బడికెళ్లే పిల్లల్లో రొంప, ఫ్లూ జ్వరాలు వచ్చే తీరతాయి. ప్రాణాంతకం కాకపోయినా ఓ వారం పది రోజులు పిల్లల్ని అతలాకుతలం చేస్తాయి.

ఇవి కాకుండా కొత్త నీరు వల్ల, ఆరని తేమతో ముసిరే కీటకాల వల్ల టైఫాయిడ్- అతిసారం వంటి రోగాలూ ఈ కాలంలో సర్వసాధారణం. ఈరోజుల్లో సకాలంలో దొరికే వైద్యం, అందుబాటులో ఉన్న రోగనిర్ధారణ పరీక్షలు, అత్యవసర మందుల పట్ల మనందరికీ ఉన్న అవగాహన వల్ల ఈ జబ్బులకు కూడా అంతా భయపడాల్సిన పనిలేదు.

ఇకపోతే, ముఖ్యమైనది గ్రామీణ-పట్టణ ప్రాంతాలన్న తేడా లేకుండా చిన్న-పెద్ద అందరిని భయపెట్టేది 'దోమ...చిన్న దోమ…అది తెచ్చే పెద్దతంటా' అదే డెంగీ జ్వరం.

డెంగీ అంటే నిజంగానే అంత భయపడాలా?!.. అంటే ఒక విధంగా అవుననే చెప్పాలి. ఏడీస్ అనే ఒక రకమైన దోమల వల్ల వ్యాప్తి చెందే వైరల్ ఇన్ఫెక్షన్ ఈ డెంగీ.

డెంగ్యూ

ఓ ఇరవై పాతికేళ్ల క్రితం డెంగీ గురించి పెద్దగా విన్నదే లేదు. మరి, ఇప్పుడేంటి ఏ జ్వరం వచ్చినా డెంగీ ఏమో అని అనుకునే పరిస్థితి వచ్చింది?! ఎందుకలా?!.. వేగంగా జరుగుతున్న ప్రపంచీకరణ, పెరుగుతున్న జనాభా వల్ల ఎన్నో అడవులు కాంక్రీట్ జంగిల్స్ లా రూపాంతరం చెందుతున్నాయి. దానితో ఎన్నో పేరు తెలియని వైరస్ లు, వాటిని మోసుకొచ్చే దోమలు-పురుగులు అడవులూ-పల్లెలూ దాటి పట్టణాలకూ వ్యాపించాయి.

ఒకప్పుడు పేరు తెలియని 'విష జ్వరాలు' అని సరిపెట్టుకునే మనకు ఇప్పుడు ఏది ఏమిటో ఎందుకొస్తుందో అని తెలిసేంత విజ్ఞానం అందుబాటులో ఉంది.

డెంగీ వైరస్‌లో 1,2,3&4 అని ఉపరకాలు కూడా ఉన్నాయి. రేపు, ఇంకా కొన్ని ఉన్నాయి అని కనుగొన్నా ఆశ్చర్యం లేదు. ఈ రకాలన్నీ కూడా ఏడిస్ అనే దోమ కాటు వల్లే మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి, ఒక మనిషి నుండి మరొకరికి వ్యాపిస్తాయి. ఎవరికైనా ఒకసారి ఒక రకం డెంగీ ఇన్ఫెక్షనే వస్తుంది. రెండోసారి కూడా డెంగీ జ్వరం రావచ్చు, అదీ ఇంకో ఉపరకం డెంగీ వైరస్ అయి ఉండవచ్చు. ఏ ఉపరకం వల్ల డెంగీ వచ్చిందో తెలియజెప్పే పరీక్షలు మామూలు ల్యాబ్స్ లో అందుబాటులో ఉండవు.

ఏడీస్ దోమలు చిన్నవిగానూ, తేలికగానూ ఉంటాయి. శరీరంపై నలుపు-తెలుపు చారలు ఉంటాయి. వర్షాకాలంలో నిలిచి ఉన్న నీటిలో ఇవి వేగంగా వృద్ధి చెందుతాయి. ఇళ్ల చుట్టూ ఉండే నీళ్ల తొట్లు, పాత కుండలు, నీళ్లు నిలిచి ఉన్న బకెట్లు, కొబ్బరి చిప్పలు వంటివి ఈ దోమల స్థావరాలు.

ఇవి ఎక్కువ దూరం ఎగర లేవు. కొంచెం కదిలినా పసిగట్టి, ఎగిరి వెళ్లి మరొక చోట కుడతాయి. అందువల్ల ఒకే వ్యక్తిని పలుమార్లు లేదా ఒక్కరోజులోనే అనేకమందిని కుట్టగలవు ఈ ఏడీస్ దోమలు. వీటిలో మరో ప్రత్యేకత ఏమిటంటే పగటిపూట మాత్రమే కుడతాయివి.

అందువల్ల ఇంటా- బయటా, ప్రయాణాల్లో, బడుల్లో, ఆఫీసుల్లో ఎక్కడైనా ఈ దోమల బారిన పడే అవకాశముంది. ఏడీస్ దోమలు డెంగీనే కాకుండా ఎన్నో ఇతర వైరస్ లనూ వ్యాప్తి చేస్తాయి. ఉదా:- ఎల్లో ఫీవర్, చికెన్ గున్యా..

పైన చెప్పిన కారణాలవల్లనే డెంగీ జ్వరాలు వర్షాకాలంలో వందల వేల సంఖ్యలో ప్రబలుతాయి. ఒకే ఊరు లేదా వాడ నుండి పుట్టలు పుట్టలుగా జనాలు ఈ జ్వరం బారిన పడతారు. డెంగీ జ్వరం వచ్చిన రోగి ద్వారా డైరెక్ట్ గా వైరస్ (కరోనా లాగా) మరొక వ్యక్తికి సోకదు.

కానీ, రోగిని కుట్టిన దోమ ఒక్కరోజులోనే మరింత మందిని కుట్టి వైరస్ వ్యాప్తికి కారణమవుతుంది.

డెంగీ వైరస్ సోకిన వ్యక్తి సుమారు 1-7 రోజుల వరకు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండడు. దీన్నే మనం వైద్య పరిభాషలో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము.

డెంగీ ఒక సాధారణ జ్వరంలా రావచ్చు, లేదా తీవ్ర రక్తస్రావం అయ్యి ప్రాణాంతకం కావచ్చు, లేదా మెదడువాపు వంటి ఏదైనా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ శరీర అవయవాలపై ప్రభావం చూపి తద్వారా తీవ్రవ్యాధి వచ్చి మృత్యువాత పడవచ్చు.

డెంగ్యూ

జ్వరమైతే:

ఉన్నట్లుండి విపరీతమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, వెన్నులో నొప్పి మొదలవుతాయి. విపరీతమైన తలనొప్పి, ముఖ్యంగా కనుగుడ్లు తిప్పినా నొప్పి కలుగుతుంది. మొదటి ఒకటి రెండు రోజుల్లో శరీరమంతా ఎర్రబడటం, కళ్ళు మంట-ఎరుపు ఉండవచ్చు.

పిల్లల్లో నోరు పొక్కడం, గొంతు నొప్పి, పొడి దగ్గు లాంటి లక్షణాలు కూడా ఉంటాయి.

జ్వరం వచ్చిన రెండో రోజు లేదా ఆపైన చర్మం ఎరుపు తగ్గినా చిటపటలాడినట్లుగా, మంటగా ఉండొచ్చు. కడుపు నొప్పి, వాంతి వచ్చినట్లు ఉండడం సాధారణమే. అస్సలు ఆకలి పుట్టదు. రుచి తెలియనట్లుంటుంది.

వారాంతంలో జ్వరం తగ్గుముఖం పడుతుంది. ఆ సమయంలో శరీరమంతా మళ్లీ ర్యాష్ రావచ్చు. ఇది ఎర్రగా చుక్కలు చుక్కలుగా ఉండి అక్కడక్కడ తెల్లని ర్యాష్ లేని భాగాలు కొన్ని ఉంటాయి. దురద కూడా ఉంటుంది.

డెంగ్యూ

తీవ్ర డెంగీ వ్యాధి & రక్తస్రావం - షాక్

మొదట జ్వరంలాగే మొదలయినా, కొందరిలో మొదటి రెండు మూడు రోజుల జ్వరం తర్వాత, జ్వరం తగ్గినా రోగి పరిస్థితి గంటల నుండి- రెండు మూడు రోజుల్లోనే విషమిస్తుంది. మొండెం వేడిగా ఉన్నా కాళ్లు చేతులు చల్లబడి పోతాయి. విపరీతమైన నీరసం, చెమటలు, కడుపులో నొప్పి, తూలి పడిపోయినట్లుండటం- పడిపోవడం లాంటివి ఉంటాయి.

చిన్న చుక్కలంత మొదలుకొని పెద్దపెద్ద సైజుల్లో ఎర్రని ర్యాష్‌, లేదా కమిలిన నల్లని మచ్చలు ఏర్పడవచ్చు. కొంచెం ఒత్తిడి తగిలినా చర్మం కమిలి నల్లని మచ్చలు ఏర్పడతాయి. మూత్రం ఎర్రగా రావచ్చు. విసర్జించిన మలం రంగు కూడా నల్లగా ఉండొచ్చు.

తెల్లని వారికైతే చేతి వేళ్లు ,నోటి చుట్టూ నీలిరంగులో మారుతుంది చర్మం. మూత్రం తక్కువగా రావడం లేదా అసలు రాకపోవడం గమనించవచ్చు. ముఖం శరీరం కొంచెం ఉబ్బినట్లు ఉంటాయి. బి.పి. పడిపోతుంది. సూది గుచ్చిన చోటు నుండి సైతం సన్నగా రక్తస్రావం అవుతూ ఉంటుంది.

ఈ పరిస్థితి తీవ్ర రూపం దాలిస్తే ఎక్కడపడితే అక్కడినుండి తీవ్ర రక్తస్రావం, గుండె పనితీరు మందగించడం, మెదడు మొద్దు బారి కోమాలోకి వెళ్లడం, కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడం వంటివి జరుగుతాయి.

జ్వరం వచ్చిన వారిలో కొద్దిశాతం మందికే ఇలా ఒక మాదిరి రక్తస్రావం, బి.పి. పడిపోవడం లాంటివి జరుగుతాయి. అందులో అతికొద్ది మందికి తీవ్రస్థాయి రోగ లక్షణాలు కనిపిస్తాయి.

అందుకే ఈ వర్షాకాలంలో జ్వరం అనగానే అంతా తేలికగా తీసుకోకండి. అలా అని హైరానా పడమనీ కాదు. జ్వరం తీరు, ఇతరత్రా లక్షణాలు ఏమి ఉన్నాయో ఒకసారి గమనించుకోండి. అదే సమయంలో మీ చుట్టు ప్రక్కల ఎవరికైనా ఇలాంటి జ్వరమే ఉన్నా డెంగీ అని నిర్ధారణ అయినా, అలసత్వం చేయకండి.

సొంత వైద్యాలు అసలే మొదలు పెట్టకండి. ఈ కాలంలో పిల్లలైనా, పెద్దలైనా కేవలం పారాసెటమాల్ వాడండి జ్వరానికి. అది కూడా టానిక్ /టాబ్లెట్ రూపంలోనే. అధిక జ్వరానికి తడిబట్టతో ఒళ్లంతా తుడవండి. తగినంత నీరు, ORS తాగించండి.

హైదారాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రిలో జ్వరపీడితులు (ఫైల్ ఫొటో)

ఒకరోజుకు మించి జ్వరం ఉంటే డాక్టరును సంప్రదించండి. మొదటి ఒకటి రెండు రోజుల్లో పెద్దలకైతే రక్త పరీక్షల అవసరం కూడా ఉండదు (అన్ని రకాలుగా ఆరోగ్యవంతులైతే). పసిపిల్లలు, కాస్త కౌమార దశలో ఉన్న పిల్లలయితే జ్వరానికి కారణం నిర్ధారణ చేసుకోవడం అవసరం. రెండు రోజుల జ్వరం తర్వాత తీవ్ర డెంగీ వ్యాధి వచ్చే అవకాశం ఆ వయసు పిల్లల్లో ఎక్కువ.

సీబీపీ పరీక్షలో మొదటి జ్వరం ఉన్న సమయంలో ప్లేట్‌లెట్లు సాధారణ స్థాయిలోనే ఉండొచ్చు. జ్వరం విడిచే సమయంలో రోజూ ప్లేట్‌లెట్లు గణనీయంగా తగ్గిపోతూ వస్తాయి. అదే సమయంలో బి.పి. పడిపోవడం చర్మంపై ఎర్రని-నల్లని ర్యాష్ రావడం జరగవచ్చు. అటువంటి సమయంలో హాస్పిటల్లో ఉండడం క్షేమకరం.

ప్రతి కొద్ది గంటలకు ఒకసారి బి.పి.చూడడం, రోజు లేదా పూటకు ఒకసారి ప్లేట్‌లెట్లు చూసుకోవడం, ఎక్కడి నుండైనా రక్తస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయేమో గమనించుకోవడం వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే సాధ్యం.

హాస్పిటల్లో చేరినంత మాత్రాన ప్లేట్‌లెట్లు నెంబరు తగ్గదనుకోవడం, బి.పి. పడిపోదనుకోవడం అపోహ. వైరల్ ఇన్ఫెక్షన్ కు శరీరం స్పందించే తీరును ఆపే మందులు ఇంకా లేవు. బి.పి. ని, జ్వరాన్ని, రక్తస్రావాన్ని అదుపులో ఉంచే వైద్యమే ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా చేసేది.

వైరస్ వల్ల ఏవైనా ముఖ్యమైన శరీర అవయవాలు దెబ్బతింటే కాపాడే వైద్యం చాలావరకు ప్రాణాపాయం నుండి గట్టెక్కిస్తుంది.

మెదడుకు డెంగి ఎన్కెఫలైటీస్, గుండెకు మయోకార్డైటిస్, కాలేయానికి హెపటైటిస్ లాంటివి రావచ్చు. ఊపిరితిత్తుల చుట్టూ, పొట్ట నిండా నీరు చేరడం, శరీరం అదుపు లేకుండా ఉబ్బటం కూడా ప్రమాదమే

సీజనల్‌గా వచ్చే ఆరోగ్య సమస్యల్లో డెంగీ ఒకటి (ఫైల్ ఫొటో)

సాధారణంగా ప్లేట్‌లెట్లు తగ్గిపోవడమే సమస్యంతా అనుకుంటారు అంతా. అందుకే కొంచెం (లక్షలోపు) తగ్గగానే హైరానా పడిపోతుంటారు. తగ్గకుండా ఉండేందుకు మందులిమ్మని, ప్లేట్‌లెట్లు ఎక్కించమని వత్తిడి చేస్తుంటారు.

ఇంకో పెద్ద తప్పేమిటంటే బొప్పాయి ఆకుల రసం, పండు రసం, కివీ, డ్రాగన్ ఫ్రూట్ లాంటివి తింటే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి అనుకోవడం. ఆకు పసర్లవల్ల కీడే గానీ మేలేమి లేదు. పండ్లు తినడం రోగికి మంచిదే అయినా ఆశించే ఫలితాన్ని ఏ ఫలాలు ఇవ్వవు.

మామూలుగా 3-4 రోజుల్లో ప్లేట్‌లెట్లు అవే తగ్గి అవే తిరిగి పెరుగుతాయి. ఈలోగా మరీ 30,000 లోపు తగ్గినా, రక్తస్రావం మొదలైనా, ప్లేట్‌లెట్లు, ప్లాస్మా ఎక్కించాల్సి రావచ్చు. ఒక్కోసారి రక్తం కూడా.

బి.పి.పెంచడానికి నోటి ద్వారా, రక్తనాళాల ద్వారా ఫ్లూయిడ్స్ ఎక్కించడం తప్ప వేరే మార్గం లేదు. థైరాయిడ్లు ఇవ్వడం చాలా తప్పు.

డెంగీ వైరస్ ను చంపే యాంటీ వైరల్ మందులేవీ లేవు. నివారించడానికి వ్యాక్సిన్లు ఇంకా పరిశోధన దశలో ఉన్నాయి. వ్యాధి తీవ్రత ఎలా అయినా ఉండవచ్చు. ఎవరికి ఎక్కువ ప్రమాదకరమో అంచనా వేయలేము.

ఈ కారణాల రీత్యా డెంగి జ్వరం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

డెంగ్యూ

డెంగీ నివారణ అంటే ఒక విధంగా దోమల నివారణ చేయటమే. దానికి మనం చేయవలసిన పనులు.

1. దోమలు వృద్ధి చెందకుండా పరిసరాల పరిశుభ్రత

2. నిల్వ నీరు ఉండకుండా జాగ్రత్త పడటం

3. నీటిపై దోమల మందు చల్లించడం, ఫాగింగ్ చేయించడం

4. దోమతెరలు వాడటం కొంతవరకు ఉపయోగం

5. పూర్తిగా కప్పి ఉంచే బట్టలు ధరించటం

6. ఓడోమాస్ వంటి క్రీములు రాసుకోవడం.

వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా ఒక సామాజిక బాధ్యతలా ప్రవర్తించినప్పుడే కొన్ని రోగాలను మనం అదుపులో పెట్టగలుగుతాము.

(రచయిత వైద్యురాలు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Dengue Fever: Rains, not floods...this mosquito is very dangerous
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X