విమాన ప్రయాణికులకు బిగ్ షాక్: ఇంకో నెల వెయిటింగ్: ఆ నిషేధం మళ్లీ పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్.. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. నాలుగైదు నెలలుగా ఈ రద్దు కొనసాగుతూ వస్తోంది. దేశంలో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఎత్తి వేస్తుందని ఆశించిన సగటు ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది. తేరుకోలేని విధంగా హైఓల్టేజ్ షాక్ ఇచ్చింది.

మరో నెల పొడిగింపు..
అంతర్జాతీయంగా రాకపోకలు సాగించే ప్యాసింజర్ కమర్షియల విమానాలపై విధించిన నిషేధాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరోసారి పొడిగించింది. నిజానికి ఈ నిషేధం ఈ నెల 31వ తేదీన ముగియాల్సి ఉంది. కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోండటం వల్ల ఈ సారైనా నిషేధాన్ని ఎత్తేవేస్తుందని ఆశించారు సగటు అంతర్జాతీయ విమాన ప్రయాణికుడు. వారి ఆశలు, అంచనాలను తలకిందులు చేసింది డీజీసీఏ. ఇదివరకే అమల్లో ఉన్న నిషేధాన్ని మరో నెలరోజుల పాటు పొడిగించింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు దీన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఓ స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది.

వాటికి మినహాయింపు..
కాగా- అంతర్జాతీయ స్థాయిలో రాకపోకలు సాగించే కార్గో విమాన సర్వీసులకు ఈ నిషేధం నుంచి మినహాయింపునిచ్చింది డీజీసీఏ. కార్గో విమాన సర్వీసులపై ముందు నుంచి కూడా ఎలాంటి నిషేధం లేదు. అవి యధాతథంగా రాకపోకలు సాగిస్తోన్నాయి. ఈ సారి కూడా అవి ఎప్పట్లాగే తిరుగాడుతాయని తెలిపింది. దీనితో పాటు ఎంపిక చేసిన కొన్ని ప్రత్యేక విమానాల పైనా నిషేధం లేదు. రద్దీ మార్గాల్లో పరిమితంగా ఎయిరిండియా విమానాలను నడిపిస్తోంది. అవి కూడా యధాతథంగా రాకపోకలు సాగిస్తాయి.

పాక్షికంగా సడలింపు..
ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ తగ్గిపోతోండటంతో విమాన సర్వీసులను పునరుద్ధరించడానికి సిద్ధపడుతోన్నాయి. ఈ జాబితాలో ఉన్న బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి దేశాలు తమ ఆంక్షలను సడలించుకున్నాయి. పరిమితంగా విమాన సర్వీసులను పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇదివరకు విధించిన ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తేశాయి. రెండు డోసుల వ్యాక్సిన్లను తీసుకున్న ప్రయాణికులను విమానాలు ఎక్కడానికి అనుమతి ఇస్తోన్నాయి.

ప్రయాణికుల్లో అసహనం..
అయినప్పటికీ- అంతర్జాతీయ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రాకపోవడం పట్ల ఒకింత అసహనం, అసంతృప్తి వ్యక్తమౌతోంది విమానయాన ప్రయాణికుల్లో. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ విజృంభించే అవకాశం ఉండటం వల్లే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తోందనే వాదనలు కూడా లేకపోలేదు. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటం, థర్డ్‌వేవ్ ముప్పు పొంచివుందంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోందని అంటున్నారు.

అమెరికా, కెనడా ఇదివరకే..
కెనడా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇదివరకే భారత్‌కు రానుపోను విమాన సర్వీసులను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం ఈ నెల 21వ తేదీ నాటికి ముగియాల్సి ఉండగా.. దాన్ని మళ్లీ పొడిగించింది. దీని ప్రకారం.. సెప్టెంబర్ 21వ తేదీ వరకు విమానాల సర్వీసులను నిలిపివేసింది. కొన్ని నెలలుగా విమాన సర్వీసులను ఎప్పుడెప్పుడు పునరుద్ధరిస్తారా అంటూ ఎదురు చూస్తోన్నారు ప్రయాణికులు. అమెరికా కూడా భారత్ నుంచి వచ్చే విమాన ప్రయాణికులపై నిషేధాన్ని కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. మే 6వ తేదీన అమల్లోకి తీసుకొచ్చిన ఈ ట్రావెల్ బ్యాన్ ఇంకా కొనసాగుతూనే ఉంది.












Click it and Unblock the Notifications