భారత్ లో చిట్ట చివరి గ్రామం.. మిస్టీరియస్ ఘోస్ట్ టౌన్ కు ఎలా వెళ్లాలి..?
భారత్ లో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు, కొండలు, కోనలు, జలపాతాలు, కోటలు, పుణ్యక్షేత్రాలు నెలకొని ఉన్నాయి. అయితే భారత్ లోని చిట్టచివరి గ్రామం గురించి మీకు తెలుసా..? శ్రీలంక, భారత్ కు సరిహద్దులో ఈ గ్రామం ఉంటుంది. ఇక్కడి నుంచి శ్రీలంక దేశం కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అందుకే భారత్ లోని చిట్ట చివరి గ్రామం ఇదే అంటారు. ఆ గ్రామమే ధనుష్కోడి.. ఈ గ్రామాన్ని మిస్టీరియస్ ఘోస్ట్ టౌన్ అని కూడా పిలుస్తుంటారు. తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రం రామేశ్వరం ను దర్శించుకున్న తర్వాత చాలామంది ఈ మిస్టీరియస్ ఘోస్ట్ టౌన్ అయిన ధనుష్కోడి ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారు. భారత్- శ్రీలంక దేశాన్ని కలిపే రామసేతు ఈ గ్రామంలోనే ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని అటు శ్రీలంక నుంచే కాకుండా భారత్ తో పాటు ఇతర దేశాల నుంచి కూడా పర్యటకులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు.
ఇక ధనుష్కోడి ప్రాంతానికి ఇటీవల మెరుగైన రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేశారు. దాంతో ఇటీవలికాలంలో పర్యటకుల తాకిడి మరింత పెరిగింది. రామేశ్వరం వచ్చిన భక్తులు ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించి ట్రిప్ ను ముగిస్తున్నారు. ధనుష్కోడి ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటించి రావచ్చు. అయితే రాత్రి వేళల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఎవరూ సాహసం చేయరు. అంతేకాక ఈ ఘోస్ట్ సిటీలోకి రాత్రి సమయాల్లో పర్యటకులను అనుమతించరు. మరి ఈ గ్రామానికి ఘోస్ట్ టౌన్ అని పేరు ఎలా వచ్చిందంటే..? బ్రిటిష్ పరిపాలన సమయంలో శ్రీలంక- భారత్ తోపాటు పాక్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని రెండు సముద్రతీరాలు ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధిపై బ్రిటిష్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ధనష్కోడి గ్రామం సముద్రం ఒడ్డునే ఉండటంతో అనాతికాలంలోనే వర్తకం జరిగే హార్బర్ గా ఈ ప్రాంతం మారిపోయింది.

అలా ధనుష్కోడి ప్రాంతాన్ని మినీ సింగపూర్ గా పిలిచేవారు. ఇక్కడ పోలీస్ స్టేషన్, తపాలా కార్యాలయం, రైల్వే స్టేషన్ ఇలా అనేక సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. అయితే ఓ రాత్రి ఇక్కడి ప్రాంతాన్ని పూర్తిగా మార్చేసింది. ధనుష్కోడి ప్రాంతాన్ని కాళరాత్రిగా మార్చింది. 1964 డిసెంబర్ 23 తేదీ ఈ ప్రాంతాన్ని ఘోస్ట్ టౌన్ గా మార్చింది. ఆ రాత్రి సముద్రంలో ఉప్పొంగిన రాకాసి అలలు ఈ గ్రామాన్ని కప్పెట్టేశాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర గ్రామం సముద్రంలో కలిసిపోయింది. ఈ మహా విలయంలో దాదాపు 800 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అప్పటినుంచి ఈ ప్రాంతాన్ని ఘోస్ట్ టౌన్ అని పిలుస్తుంటారు. ఇక రామేశ్వరానికి చేరుకుని అక్కడినుంచి సులభంగా ధనుష్కోడి ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
