• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోకి చొచ్చుకువచ్చి ఓ గ్రామం నిర్మించిందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అరుణాచల్ ప్రదేశ్

చైనా వాస్తవాధీన రేఖను దాటి, భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి చొచ్చుకువచ్చిందా? ఓ గ్రామం కూడా ఏర్పాటు చేసుకుందా?

ప్రస్తుతం రాజకీయ, మీడియా వర్గాల్లో ఈ ప్రశ్నల చుట్టూ చాలా చర్చలు జరుగుతున్నాయి.

అరుణాచల్ ప్రదేశ్‌లో భారత నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో పక్కా ఇళ్లతో చైనా గ్రామం నిర్మించిందని కొన్ని వార్తా ఛానెళ్లు శాటిలైట్ చిత్రాలను కూడా చూపించాయి.

ఈ విషయాలన్నింటినీ తాము గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అంటోంది.

మీడియాలో చూపిస్తున్న ఆ గ్రామం అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబన్‌సిరీ జిల్లాలో 'సారీ చూ’ నది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతంలో ఇదివరకు భారత్, చైనా సైన్యాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్లానెట్ ల్యాబ్స్ అనే శాటిలైట్ నిర్వహణ సంస్థ ఈ ప్రాంతానికి సంబంధించి రెండు చిత్రాలను విడుదల చేసింది.

ఒక చిత్రం 2019 ఆగస్టులో తీసినట్లుగా చెబుతున్నారు. అందులో ఏ నిర్మాణాలూ కనిపించడం లేదు.

రెండో చిత్రం గత ఏడాది నవంబర్‌లో తీసిందని అంటున్నారు. ఇందులో పక్కా ఇళ్లు, రోడ్లు కూడా కనిపిస్తున్నాయి.

అరుణాచల్ ప్రదేశ్‌‌లో వాస్తవాధీన రేఖకు సమీపంలో చైనా కొన్నేళ్లుగా నిర్మాణాలు చేపడుతోందని భారత విదేశాంగశాఖ వ్యాఖ్యానించింది.

సరిహద్దుల వెంబడి రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక వసతులు పెంచేందుకు భారత్ కూడా చర్యలు వేగవంతం చేసిందని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. స్థానికులకు ఇవి చాలా ఉపయోగపడతాయని వ్యాఖ్యానించింది.

అరుణాచల్ ప్రదేశ్

చైనా ఎయిర్‌స్ట్రిప్ నిర్మించింది: బీజేపీ ఎంపీ

అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా చొరబాట్లకు పాల్పడుతోందని కొన్నేళ్ల నుంచి ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ తాపిర్ గావో అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్లమెంటులోనూ లేవనెత్తారు.

2019లో సెప్టెంబర్‌లో ఓసారి, నవంబర్‌లో మరోసారి పార్లమెంటులో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే, ప్రభుత్వం చైనా చొరబాట్ల గురించి వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది.

తాజాగా చైనా నిర్మించినట్లుగా చెబుతున్న గ్రామం గురించి కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బీబీసీ తాపిర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన అందుబాటులో లేరు.

''అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు 1980ల నుంచే చైనా ఆక్రమణలో ఉన్నాయి. అక్కడ ఆ దేశం నిర్మాణాలు కూడా చేపట్టింది. మెక్‌మోహన్ రేఖకు భారత్ వైపు ఉన్న బీసా, మజా మధ్యలో ఒక ఎయిర్ స్ట్రిప్‌ను (విమానాలు దిగేందుకు) కూడా చైనా నిర్మించింది’’ అని తాపిర్ ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.

రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో చైనా తవాంగ్‌లోని సుబడోరంగ్ లోయను ఆక్రమించిందని... దాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత్ సైన్యం అనుమతి కోరినప్పటికీ, అప్పటి ప్రభుత్వం నిరాకరించిందని ఆయన ఆరోపించారు.

చైనా

అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనా చొరబడి 100 ఇళ్లు, మార్కెట్, రెండు వరుసల రోడ్డు ఉన్న గ్రామాన్ని నిర్మించిందని బీజేపీ ఎంపీ తాపిర్ ఆరోపించారని... ఈ విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం ట్వీట్ చేశారు.

https://twitter.com/PChidambaram_IN/status/1351196964558434304

కాంగ్రస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇదే అంశాన్ని ట్విటర్‌లో ప్రస్తావించారు. మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

https://twitter.com/RahulGandhi/status/1351375107952762881?s=20

రాజకీయ వర్గాల్లో చర్చనీయమైన ఆ గ్రామం ఉన్నట్లుగా చెబుతున్న ప్రాంతం మెక్‌మోహన్ రేఖకు దక్షిణంగా ఉందని నిపుణులు అంటున్నారు.

మెక్ మోహన్ రేఖ అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ ప్రాంతాలను విడదీస్తుంది. ఈ రేఖను చైనాతో తమ సరిహద్దుగా భారత్ గుర్తిస్తోంది. చైనా మాత్రం దీన్ని అంగీకరించడం లేదు.

'ఇజ్రాయెల్ లాంటి వ్యూహం’

ఈ ప్రాంత శాటిలైట్ చిత్రాలను సీనియర్ జర్నలిస్ట్ అభిజీత్ అయ్యర్ మిత్రా అధ్యయనం చేశారు.

భారత్, చైనా మధ్య 1962లో యుద్ధం జరగకముందే, అంటే 1959 నుంచీ ఈ ప్రాంతం చైనా ఆక్రమణలోనే ఉందని ఆయన బీబీసీతో చెప్పారు.

''మొదట్లో ఈ ప్రాంతంలో చైనా సైన్యానికి చెందిన శిథిల పోస్టు ఉండేది. ఇప్పుడు దాన్ని ఆధునికీకరించారు. ఇక ఇప్పుడు చెబుతున్న గ్రామం ఈ పోస్టు వెనుకవైపు ఉంది. గ్రామం ఏర్పడ్డ విషయం వాస్తవమే. కానీ, ఈ ప్రాంతం ముందు నుంచీ చైనా ఆక్రమణలోనే ఉంది. తమ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో చైనా ఏవో ఒక నిర్మాణాలను ఎప్పుడూ చేపడుతూనే ఉంది’’ అని ఆయన అన్నారు.

ఇజ్రాయెల్ తరహా వ్యూహాన్ని చైనా అనుసరిస్తోందని అభిజీత్ అభిప్రాయపడ్డారు.

''గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ కూడా ఇలాగే భవనాలు కడుతుంది. ఆ తర్వాత అక్కడ జనం నివసించేలా చేస్తుంది. పాలస్తీనా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇప్పుడు చైనా కూడా అలాగే చేస్తోంది’’ అని ఆయన అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్

'ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు’

ఈ వివాదం నేపథ్యంలో స్పందించిన భారత్ విదేశాంగ శాఖ... తాము వాస్తవాధీన రేఖ వెంబడి సాగుతున్న కార్యకలాపాలన్నింటినీ నిశితంగా గమనిస్తున్నామని... దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపింది.

భారత్ స్పందనలో సదరు గ్రామం ఎవరి నియంత్రణ పరధిలోదన్న స్పష్టత ఇవ్వలేదని, ఈ విషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని 'అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్’ అనే మేధో సంస్థకు చెందిన సుశాంత్ సరీన్ అన్నారు.

''అరుణాచల్ ప్రదేశ్‌లో చైనాతో వివాదం ఉన్న ప్రాంతం కొన్ని వేల కిలోమీటర్ల మేర ఉంది. ఈ ప్రాంతం విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందన్న సమాచారం శాటిలైట్ ద్వారా తెలుసుకుంటుంది. ఒకవేళ ఇప్పుడు చర్చనీయమైన ప్రాంతం కొత్తదైతే ఇది తీవ్రమైన విషయమే. ఒకవేళ అది కొన్ని దశాబ్దాలుగా చైనా నియంత్రణలో ఉన్న ప్రాంతమైతే, చైనా ఏదో చేస్తున్నట్లే. ఒప్పందం ప్రకారం చైనా ఆ ప్రాంతంలో యథాస్థితిని కొనసాగించాల్సి ఉంది’’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
China infiltrates and constructs a village in Arunachal Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X