వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సావర్కర్ బ్రిటిష్ వారిని క్షమాభిక్ష కోరాలని గాంధీ చెప్పారా? - BBC Fact Check

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

అండమాన్‌లోని జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో వినాయక్ దామోదర్ సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్లు మహాత్మా గాంధీ ఆదేశాల మేరకు రాసి పంపారా?

అక్టోబర్ 12న సావర్కర్‌పై రాసిన కొత్త పుస్తకం విడుదల సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇదే అంశంపై పలు వ్యాఖ్యలు చేశారు.

'వీర్ సావర్కర్: ది మ్యాన్‌ వూ కుడ్‌ హ్యావ్‌ ప్రివెంటెడ్‌ పార్టిషన్‌' పుస్తకం విడుదల కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. "సావర్కర్‌పై అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన బ్రిటిష్ వారికి పదేపదే క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకున్నారని, కానీ, నిజం ఏమిటంటే.. తనను క్షమించమని క్షమాభిక్ష పిటిషన్లు తనకు తానుగా ఇవ్వలేదు. మహాత్మాగాంధీ క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయమని కోరారు. మహాత్మా గాంధీ ఆదేశాల మేరకు ఆయన క్షమాభిక్ష పిటిషన్లు ఇచ్చారు"అని రాజ్‌నాథ్ అన్నారు.

రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలతో దీనిపై చర్చ మొదలైంది. ఒక వైపు ప్రతిపక్ష పార్టీలు ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండగా, మరోవైపు చరిత్రకారులు కూడా ఈ ప్రకటనలోని అంశాల్లో నిజానిజాలను ప్రశ్నిస్తున్నారు.

'వీర్ సావర్కర్: ది మ్యాన్‌ వూ కుడ్‌ హ్యావ్‌ ప్రివెంటెడ్‌ పార్టిషన్‌' పుస్తకాన్ని ఉదయ్ మహూర్కర్, చిరాయు పండిట్ రాసారు.

జర్నలిస్ట్ అయిన ఉదయ్ మహూర్కర్ ప్రస్తుతం భారత ప్రభుత్వంలో సమాచార కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

మహాత్మా గాంధీ ఆదేశాల మేరకు వీర్ సావర్కర్ బ్రిటిష్ వారి ముందు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసినట్లు కొత్తగా రాసిన పుస్తకంలో పేర్కొన్నారా అని బీబీసీ ఉదయ్ మహూర్కర్‌ని సంప్రదించింది. "లేదు, ఆ అంశాన్ని నా పుస్తకంలో ప్రస్తావించలేదు" అని ఆయన పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఈ పుస్తకానికి కొనసాగింపుగా వచ్చే ఎడిషన్‌లలో ఈ అంశాలను చేరుస్తారా అని మేము ఆయనని అడిగాము.

"నేను దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మీరు నన్ను ఇరికించకండి" అని అన్నారు.

సావర్కర్‌పై పుస్తకం రాసేటప్పుడు రాజ్‌నాథ్ సింగ్ వాదనను పొందుపరిచారా అని మేము మహూర్కర్‌ను అడిగాము. దానికి ప్రతిస్పందనగా, "సావర్కర్‌పై పూర్తిగా అధ్యయనం చేశానని నేను చెప్పడం లేదు. సావర్కర్ గురించి ప్రజలకు ఇంకా తెలియని అనేక వాస్తవాలు ఉన్నాయి. సావర్కర్‌పై నా అధ్యయనం ఇంకా పూర్తి కాలేదు. ఇంకా కొనసాగించి, మరొక పుస్తకంలో ఈ విషయాన్ని కూడా చేర్చవచ్చు"

మహూర్కర్ ఈ విషయం గురించి తన తోటి పరిశోధకులతో మాట్లాడటానికి కొంత సమయం కోరారు. అనంతరం బీబీసీతో తిరిగి మాట్లాడారు. "అది సరైనది. బాబా రావు సావర్కర్, ఆయన సోదరుడు, గాంధీజీ వద్దకు వెళ్లారు. గాంధీజీ వారికి సలహా ఇచ్చారు. మేము పుస్తకం తదుపరి ఎడిషన్‌లో దీనిని కవర్ చేస్తాము. గాంధీజీని కలవడానికి వెళ్లినప్పుడు బాబా రావు సావర్కర్‌తో పాటు కొంతమంది ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులు ఉన్నారు. ఇదే అంశం బాబా రావు రచనలలో ప్రతిబింబిస్తుంది"అని అన్నారు.

సావర్కర్ విభజనను ఆపగలరా?

ఈ పుస్తకం పేరు చాలా ఆసక్తికరంగా ఉంది. 'వీర్ సావర్కర్: ది మ్యాన్‌ వూ కుడ్‌ హ్యావ్‌ ప్రివెంటెడ్‌ పార్టిషన్‌' లేదా 'వీర్ సావర్కర్: విభజనను నిరోధించగలిగిన వ్యక్తి'. అయితే నిజం ఏమిటంటే సావర్కర్ రెండు దేశాల సిద్ధాంతం గురించి మొదట మాట్లాడిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు.

ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని 1940లో లాహోర్ సెషన్‌లో ముస్లిం లీగ్ మొదటిసారి మాట్లాడింది. కానీ, అంతకంటే మూడు సంవత్సరాల ముందే, అంటే 1937లో అహ్మదాబాద్‌లో హిందువులు, ముస్లింలు ఇద్దరూ వేరు అని, ఈ భూమిపై ఇద్దరికీ సమాన హక్కులు లేవని సావర్కర్ అన్నారు.

దీనికి ముందు, ఆయన తన 'హిందుత్వం: వూ హిజ్‌ ఏ హిందు' అనే పుస్తకంలో జాతికి ఆధారం మతం అని స్పష్టంగా రాసారు. ఆయన భారతదేశాన్ని 'హిందుస్తాన్' అని పిలిచారు. తన పుస్తకంలో "హిందుస్తాన్ అంటే హిందువుల భూమి. హిందుత్వానికి భౌగోళిక ఐక్యత చాలా ముఖ్యం. హిందువు ప్రధానంగా ఇక్కడ పౌరుడు లేదా అతని పూర్వీకుల కారణంగా 'హిందుస్థాన్' పౌరుడు" అని పేర్కొన్నారు.

"కొన్ని సందర్భాలలో మన ముస్లింలు లేదా క్రైస్తవులు బలవంతంగా హిందూయేతర మతంలోకి మారినప్పుడు, వారి మాతృభూమి ఇదే. కానీ వారిని హిందువులుగా పరిగణించలేము. హిందుస్తాన్ హిందువులా వారి మాతృభూమి అయినప్పటికీ, అది వారి పవిత్ర భూమి కాదు. వారి పవిత్ర భూమి అరేబియాకు దూరంగా ఉంది. వారి నమ్మకాలు, మతాలు, ఆలోచనలు ఈ నేలపై పుట్టినవి కాదు" అని 'హిందూత్వం: వూ హిజ్‌ ఏ హిందు'లో సావర్కర్‌ రాశారు.

ఈ విధంగా, సావర్కర్ హిందువులు దేశ పౌరులుగా, ముస్లిం-క్రైస్తవులు ఒకరికొకరు ప్రాథమికంగా భిన్నమైనవారని వర్ణించారు. వారి పవిత్ర భూమి మారడం వల్ల జాతి పట్ల వారికున్న విధేయతను ప్రశ్నించారు.

భారతదేశ విభజన సమయంలో భయంకరమైన హిందూ-ముస్లిం అల్లర్లు చెలరేగాయి. హిందూ-ముస్లిం ఐక్యత ద్వారా మాత్రమే భారతదేశ విభజనను నిరోధించవచ్చని గాంధీ ప్రయత్నించారు. కానీ సావర్కర్ ఒకరికొకరు భిన్నమైన వారు అని నిరూపించడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

వీర్ సావర్కర్ వారసులు ఏమంటున్నారు?

వీర్ సావర్కర్ తమ్ముడు డాక్టర్ నారాయణరావు సావర్కర్, మనవడు రంజిత్ సావర్కర్. ముంబయిలోని 'స్వతంత్ర వీర్ సావర్కర్ నేషనల్ మెమోరియల్'తో రంజిత్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. మహాత్మా గాంధీ ఆదేశాల మేరకు వీర్ సావర్కర్ క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేశారని రంజిత్ సావర్కర్ నమ్మడం లేదు.

"ఇది నోరు జారడం వంటిది కావొచ్చు. మహాత్మా గాంధీ పిటిషన్ దాఖలుకు చేయడానికి మద్దతు ఇచ్చారు. సావర్కర్ సోదరుల విడుదలపై ఆయన రెండు లేఖలు రాశారు. తమ మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయని గాంధీ చెప్పారు. కానీ సావర్కర్ శాంతియుత మార్గంలోకి వచ్చినట్టయితే, మేము ఆయన్ని స్వాగతిస్తామని, సావర్కర్ గొప్ప దేశభక్తుడు అని ఆయన స్పష్టంగా చెప్పారు. మాతృభూమిపై చూపిన ప్రేమకి మూల్యంగా ఆయన అండమాన్‌లో ఉంటున్నారని గాంధీ అన్నారు" అని రంజిత్ సావర్కర్ అన్నారు.

వీర్ సావర్కర్ పిటిషన్లు తనకు మాత్రమే కాకుండా ఇతర రాజకీయ ఖైదీలందరి కోసం అని రంజిత్ సావర్కర్ చెప్పారు. అప్పటి హోంమంత్రి రెజినాల్డ్ క్రాడాక్ వీర్ సావర్కర్ పిటిషన్ గురించి రాసినట్లు ఆయన చెప్పారు. "ఇది మెర్సీ పిటిషన్ మాత్రమే, కానీ ఆయనకు దీనిపై విచారం కానీ లేదా పశ్చాత్తాపం కానీ లేదు."

"సావర్కర్ పిటిషన్‌కు గాంధీ మద్దతు పలికారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పిన దానికి అర్థం ఇదే అని నేను అనుకుంటున్నాను" అని రంజిత్ చెప్పారు.

చరిత్రను చెడగొడుతున్నారా?

"ఈ వివాదాస్పద ప్రకటన గురించి ఇంతకు ముందు వినలేదు, చూడలేదు. ఎందుకంటే ఇది జరగలేదు లేదా దాని గురించి ఎవరూ రాయలేదు" అని గాంధీ శాంతి ఫౌండేషన్ ఛైర్మన్ కుమార్ ప్రశాంత్ చెప్పారు.

"వీరు చరిత్రలో కొత్త పేజీలను రాసే కళలో చాలా నైపుణ్యం కలిగినవారు. వీరికంటూ సొంతంగా చరిత్ర ఉండదు. ఇతరుల చరిత్రను ఎల్లప్పుడూ తమ పట్టులో ఉంచుకోవాలని వీరు ప్రయత్నిస్తారు" అని కుమార్ ప్రశాంత్ అన్నారు.

సావర్కర్ క్షమాపణతో గాంధీకి ఎలాంటి సంబంధం లేదని కుమార్ ప్రశాంత్ చెప్పారు. "గాంధీజీ జీవితంలో సావర్కర్ క్షమాపణకు సంబంధం ఉంటే, దానిని ఆయన తన పుస్తకాల్లో రాసే ఉంటారు. కానీ ఎక్కడా ఆయన దాన్ని ప్రస్తావించలేదు. మరే ఇతర సత్యాగ్రహికి క్షమాపణ పిటిషన్‌ పెట్టుకొమ్మని చెప్పలేదు. కాబట్టి ఇందులో ప్రయోజనంగానీ, లేదా వాస్తవంగానీ లేదు. ఈ కాలంలో మాత్రమే ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి."

ది ఆర్ఎస్ఎస్: ఐకాన్స్‌ ఆఫ్‌ ది ఇండియన్ రైట్

'గాంధీ హత్యకు సంబంధించిన మరకలను కడిగే ప్రయత్నం'

సీనియర్ జర్నలిస్ట్ నిలంజన్ ముఖోపాధ్యాయ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రముఖులపై 'ది ఆర్ఎస్ఎస్: ఐకాన్స్‌ ఆఫ్‌ ది ఇండియన్ రైట్' అనే పుస్తకాన్ని రాశారు.

సావర్కర్‌పై అతిపెద్ద వివాదం మహాత్మా గాంధీ హత్యకు సంబంధించినదని ఆయన చెప్పారు. "ఆ కేసులో సావర్కర్‌ని నిర్దోషిగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత వచ్చిన కపూర్ కమిషన్ నివేదిక ఆయన్ని పూర్తిగా నిర్దోషిగా ప్రకటించలేదు. ఆ రిపోర్టులో అనుమానాలన్నీ సావర్కర్‌పైనే ఉండేవి. దాంతో ఆయన వారసత్వంపై చీకటి మేఘాలు కమ్మేశాయి. వీటినే నేటి ప్రభుత్వం తొలగించడానికి ప్రయత్నిస్తోంది"అని ముఖోపాధ్యాయ్ అన్నారు.

1948లో మహాత్మా గాంధీ హత్య జరిగిన ఆరు రోజులకు, హత్యకు కుట్ర పన్నారని వినాయక్ దామోదర్ సావర్కర్‌ను ముంబయిలో అరెస్ట్ చేశారు. అయితే 1949 ఫిబ్రవరిలో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు.

నిలంజన్ ముఖోపాధ్యాయ

"గాంధీజీ ఆదేశాల మేరకే సావర్కర్ బ్రిటిష్ వారికి క్షమాపణ రాశారని రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటన, ఆయనపై ఉన్న పెద్ద మరకను తొలగించే ప్రయత్నం. ఇప్పుడు ఒకే ఒక్క విషయం మిగిలి ఉంది. రేపు మరొక నాయకుడు వచ్చి గాంధీజీ ఆదేశం మేరకే, గాడ్సే తుపాకీతో కాల్చి చంపాడు అని చెబుతారు" అని ముఖోపాధ్యాయ్ అన్నారు.

"మనం చరిత్రలో తప్పుడు కాలంలో జీవిస్తున్నాము. ప్రతిరోజూ ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి పదేపదే చెబుతుంటారు"

ఈ మొత్తం వివాదం చరిత్రలో కేవలం ముఖ్యాంశాల గురించి మాట్లాడే ధోరణిని చూపుతుందని ఆయన అన్నారు. "చరిత్ర గురించి చర్చ ముఖ్యాంశాలలో ఉండదు. దానిని వివరంగా విశ్లేషించాలి. గాంధీజీ ఆదేశాల మేరకు సావర్కర్ క్షమాపణ రాశారని చెప్పడాన్ని చరిత్రాత్మక తప్పు అని నేను అనుకుంటున్నాను" అని ముఖోపాధ్యాయ్ తెలిపారు.

'హిందుత్వ' అనే పదానికి రచయిత

చరిత్రకారుల ప్రకారం, సావర్కర్ రాజకీయ జీవితాన్ని స్పష్టంగా రెండు విభిన్న దశలుగా విభజించవచ్చు.

"20వ శతాబ్దం మొదటి దశాబ్దంలో ఆయన యువ జాతీయవాదిగా ఉన్నప్పుడు మొదటి దశ ప్రారంభమవుతుంది. ఆయన విలాయత్‌కి వెళ్లి జాతీయవాద ఉద్యమాలలో పాల్గొన్నారు. ఈ కారణంగా ఆయనని అండమాన్‌లో కాలాపానీ జైలుకి పంపించారు" అని ముఖోపాధ్యాయ్ అన్నారు.

1857 తిరుగుబాటు గురించి సావర్కర్ చాలా ముఖ్యమైన పుస్తకాన్ని రాశారని ముఖోపాధ్యాయ్ పేర్కొన్నారు.

"దీనిలో ఆయన 1857 తిరుగుబాటును, హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రత్యేక ఉదాహరణగా వర్ణించారు." ,"హిందువులు, ముస్లింలు కలిసి పోరాడటంతో బ్రిటిష్‌ ప్రభుత్వం పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొంది."

సావర్కర్ రాజకీయ జీవితంలో రెండో దశలో, అండమాన్ జైలులో ఉన్నప్పుడు తన మనసులో మార్పు వచ్చిందని, బ్రిటిష్ వారికి క్షమాపణలు చెప్పారని ముఖోపాధ్యాయ్ తెలిపారు.

"అండమాన్ జైలు నుండి విడుదలయ్యాక ఆయన్ని నాగ్‌పుర్, పూణె జైళ్లలో ఉంచారు. ఆయన విప్లవాత్మక జాతీయవాదంలో పాలుపంచుకోవడంతో, అనేక జాతీయవాద నాయకులు ఆయన నిర్భందానికి వ్యతిరేకంగా తమ స్వరాన్ని పెంచారు. ఆయన విడుదలకు ఆయనే దరఖాస్తు చేసుకున్నారు."

అయితే, సావర్కర్ ఇప్పటికీ వివాదాస్పదంగా ఉండటానికి కారణం జైలులో ఉన్నప్పుడు తన చేతితో రాసిన 'హిందూత్వం: మనం ఎవరు' అనే పుస్తకం అని ముఖోపాధ్యాయ్ చెప్పారు. "ఈ పుస్తకం స్ఫూర్తితో, కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను స్థాపించారు. సావర్కర్ కంటే ముందు నుంచే హిందు జాతీయవాద భావజాలం అభివృద్ధి చెందుతోంది. కానీ సావర్కర్ తన పుస్తకం ద్వారా హిందుత్వాన్ని క్రోడీకరించిన ఘనత పొందారు. అదే పుస్తకం హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పాటుకు ప్రేరణ కలిగించే పత్రంగా మారింది.’’

సంస్థ నాయకుడిగా వ్యవహరించే అవకాశం సావర్కర్‌కు దక్కలేదు అని ముఖోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు. అందుకే ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరలేదు.

"ఆయన 1966లో మరణించే వరకు ఆర్‌ఎస్‌ఎస్‌తో మెరుగైన సంబంధాలు లేవు. సావర్కర్ ఆర్‌ఎస్‌ఎస్‌ను ఒక చిన్న సంస్థగా భావించారు. ఆయన రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ విధానాలకు మద్దతుదారుడిగా ఉన్నారు. హిందువులు తమను తాము బలోపేతం చేసుకోవడానికి బ్రిటిష్ సైన్యంలో చేరాలని ఆయన అన్నారు. తన జీవితమంతా బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనలేదు. ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా చేరలేదు."

''ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎప్పుడూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనసంఘ్‌లో సభ్యుడు కాని వీర్ సావర్కర్ అంటే సంఘ్ పరివార్‌కు చాలా మర్యాద, గౌరవం ఉంది.

2000లో వాజ్‌పేయీ ప్రభుత్వం సావర్కర్‌కు భారత అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న' ఇవ్వాలని అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌కు ప్రతిపాదనలు పంపింది. కానీ, ఆయన దానిని స్వీకరించలేదు.’’

వీర్ సావర్కర్

అనవసర గందరగోళం?

వీర్ సావర్కర్ జీవిత చరిత్ర రచయిత, చరిత్రకారుడు విక్రమ్ సంపత్ ఒక ట్వీట్‌లో తాజా ప్రకటనపై గందరగోళం అనవసరం అని అన్నారు. 1920లో గాంధీజీ సావర్కర్ సోదరులకు లేఖ రాసినట్లు ఆయన ఇప్పటికే తన పుస్తకం, అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు. తన పత్రిక 'యంగ్ ఇండియా'లో ఒక కథనం ద్వారా వీర్ సావర్కర్ విడుదల గురించి రాశారు.

యంగ్ ఇండియాలో గాంధీ రాసిన వ్యాసానికి "సావర్కర్ సోదరులు" అనే పేరు పెట్టారు. దానిలో ఆయన అనేక విషయాలను చర్చించారు. "వారిద్దరూ బ్రిటిష్ రాజ్ నుండి స్వాతంత్ర్యం కోరుకోవడం లేదని స్పష్టంగా చెప్పారు. దీనికి విరుద్ధంగా, బ్రిటిష్ వారి సహకారంతో భారతదేశ గమ్యాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డారు."

దిల్లీ యూనివర్సిటీలో శంసుల్ ఇస్లాం పొలిటికల్ సైన్స్ బోధిస్తారు. 'సావర్కర్ అన్ మాస్క్‌డ్‌' పుస్తక రచయిత.

సావర్కర్ మొదటి సంవత్సరంలో జైలుకు వెళ్లిన వెంటనే 1911లో క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారని వారు చెప్పారు. ఆ తర్వాత ఆయన 1913, 1914, 1918, 1920 సంవత్సరాలలో క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేశారు.

"క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడం నేరం కాదు. ఖైదీలు తమ అభ్యర్థనలను సమర్పించుకునే హక్కు ఉంది. కానీ సావర్కర్ క్షమాపణ పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. కాలాపానీలో చాలా మంది విప్లవకారులను ఉరితీశారు. కొందరు పిచ్చివాళ్లుగా మారితే, మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరెవరు క్షమాభిక్ష అడగలేదు" అని శంసుల్ ఇస్లాం తెలిపారు.

శంసుల్ ఇస్లాం ప్రకారం.. సావర్కర్, అరబిందో ఘోష్ సోదరుడు బరీంద్ర ఘోష్, హృషికేష్ కంజిలాల్, గోపాల్‌లు క్షమాపణ పిటిషన్‌లు రాశారు.

రిషికేష్ కంజిలాల్, గోపాల్ పిటిషన్లు రాజకీయ ఖైదీలని, వారిని అలానే పరిగణించాలని శంసుల్ చెప్పారు. ''ఇవి న్యాయమైన పిటిషన్లు, వీటి సాంకేతిక పేరు క్షమాభిక్ష పిటిషన్. కానీ, సావర్కర్, బరీంద్ర ఘోష్ పిటిషన్లు మాత్రం అవమానకరం" అని శంసుల్ ఇస్లాం అన్నారు.

శంసుల్ ఇస్లాం ప్రకారం.. హిందు మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన చాలా మంది వ్యక్తులు సావర్కర్ జీవిత చరిత్ర రాసారు. కానీ గాంధీజీ ఆదేశాల మేరకు ఆయన పిటిషన్లు దాఖలు చేసినట్లు ఎక్కడా పేర్కొనలేదు.

"1913 నవంబర్ 14న పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ అత్యంత అవమానకరమైనది. గాంధీజీ భారతదేశ రాజకీయాల్లోకి 1915 చివరలో వచ్చారు. కాబట్టి గాంధీ చెప్పినందుకు క్షమాపణ రాయడం పూర్తిగా అర్థరహితం అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం."

శంసుల్ ఇస్లాం ప్రకారం.. గాంధీ 'యంగ్ ఇండియా'లో సావర్కర్ క్షమాపణలపై ఒక వ్యాసం రాసారు. "సావర్కర్ లాంటి వ్యక్తులు క్షమాపణలు రాయడం ద్వారా నైతిక బలాన్ని కూడా కోల్పోయారు"అని దానిలో పేర్కొన్నారు.

ఇలాంటి వివాదాస్పద ప్రకటనలతో గాంధీని అవమానించడానికి ప్రయత్నిస్తున్నారని శంసుల్ ఇస్లాం అభిప్రాయపడ్డారు. "వీరు నాథూరామ్ గాడ్సే, సావర్కర్‌లను గాంధీకి సమానంగా తీసుకురావాలని కోరుకుంటున్నారు" అని శంసుల్ ఇస్లాం అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Did Gandhi ask Savarkar to apologise to the British
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X