వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీని హత్య చేసే సమయానికి నాథూరామ్ గాడ్సే నిజంగానే ఆర్ఎస్ఎస్‌ను విడిచిపెట్టారా? ఆ రహస్యమేమిటి..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

అది 1948, జనవరి 30వ తేదీ సాయంత్రం. రాజధాని దిల్లీలో మహాత్మా గాంధీ ప్రార్థనా సభకు కాస్త ఆలస్యంగా చేరుకున్నారు. సమయం కోసం కాచుకుని ఉన్న నాథూరామ్ వినాయక్ గాడ్సే గాంధీని అక్కడే పాయింట్ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చారు.

38 ఏళ్ల గాడ్సే మితవాద 'హిందూ మహాసభ' సభ్యుడు, మతోన్మాది. ముస్లింలకు అనుకూలంగా, పాకిస్తాన్ పట్ల సున్నితంగా వ్యవహరిస్తూ గాంధీ హిందువులకు ద్రోహం చేశారని హిందూ మహాసభ ఆరోపించింది. దేశ విభజన సమయంలో రక్తపాతానికి కూడా గాంధీనే కారణమని నిందించింది.

గాంధీ హత్య జరిగిన ఏడాది తరువాత ట్రయల్ కోర్టు గాడ్సేకి మరణశిక్ష విధించింది. ఈ తీర్పును హైకోర్టు కూడా అంగీకరించడంతో 1949 నవంబర్‌లో గాడ్సేను ఉరితీశారు. ఈ పథకంలో గాడ్సేకు తోడుగా నిల్చిన నారాయణ్ ఆప్టేకి కూడా మరణశిక్ష విధించారు. మరో ఆరుగురికి జీవితఖైదు విధించారు.

హిందూ మహాసభలో చేరడానికి ముందు గాడ్సే 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్' (ఆర్ఎస్ఎస్)లో సభ్యుడిగా ఉండేవారు. సుమారు 95 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్ఎస్ఎస్‌లో ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీర్ఘకాల సభ్యుడిగా ఉన్నారు.

గాంధీ హత్య కేసు విచారణ సమయంలో బోనులో గాడ్సే

భారతీయులు "జాతిపిత"గా భావించే గాంధీని హత్య చేసిన గాడ్సేను ఆర్ఎస్ఎస్ అనేక దశాబ్దాల పాటు దూరం పెట్టింది.

అయితే, ఇటీవల కాలంలో హిందూ మితవాదులు కొందరు గాడ్సే పరాక్రమాన్ని కొనియాడుతూ, గాంధీ హత్యను బహిరంగంగా సమర్థిస్తూ వేడుక జరుపుకుంటున్నారు.

గత ఏడాది ఒక బీజేపీ ఎంపీ, గాడ్సేను "దేశభక్తుడిగా" అభివర్ణించారు. ఈ వ్యవహారం పట్ల అనేకమంది భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, ఆర్ఎస్ఎస్, గాడ్సే పట్ల తన వైఖరిని మార్చుకోలేదు. గాంధీని హత్య చేయడానికి చాలా కాలం ముందే గాడ్సే ఆర్ఎస్ఎస్ సంస్థను విడిచిపెట్టారనే చెబుతోంది.

గాడ్సే నిజంగానే ఆర్ఎస్ఎస్‌ను విడిచిపెట్టారా?

గాడ్సే ఆర్ఎస్ఎస్‌కు దూరం జరిగారన్నది నిజం కాదని ఈమధ్య విడుదలైన ఓ కొత్త పుస్తకం పేర్కొంది.

గాడ్సే ఆర్ఎస్ఎస్ఎస్‌లో "ప్రముఖ కార్యకర్తగా" వ్యవహరించేవారని 'గాంధీస్ అసాసిన్' పుస్తక రచయిత ధీరేంద్ర ఝా పేర్కొన్నారు. గాడ్సే తండ్రి పోస్ట్ ఆఫీసులో పనిచేసేవారు. తల్లి గృహిణి.

హైస్కూలుతో చదువులు కట్టిపెట్టిన గాడ్సే చాలా మొహమాటస్థుడు. హిందూ మహాసభలో చేరడానికి ముందు ఆయన టైలర్‌గా కొన్నాళ్లు పనిచేశారు. అలాగే, పండ్ల వ్యాపారం చేశారు. మహాసభలో చేరిన తరువాత, ఆ సంస్థ వార్తాపత్రికకు సంపాదకత్వం వహించారు.

కానీ, కోర్టు విచారణ సమయంలో 150 పేరాల నివేదికను చదవడానికి ఐదు గంటల కంటే ఎక్కువ సమయం తీసుకున్నారు.

గాంధీని చంపడానికి "ఎలాంటి కుట్ర" రచించలేదని చెబుతూ, తన సహచరులు ఏ తప్పూ చేయలేదని నిరూపించేందుకు ప్రయత్నించారు గాడ్సే.

హిందుత్వ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువచ్చిన వినాయక్ దామోదర్ సావర్కర్ మార్గదర్శకత్వంలో ఈ చర్యలకు పూనుకున్నారనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

గాంధీ హత్యకు చాలాకాలం ముందే ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలు తెంచేసుకున్నానని గాడ్సే కోర్టుకు తెలిపారు.

ఆయనను ఆర్ఎస్ఎస్ సంస్థ నుంచి బహిష్కరించినట్లు "ఎలాంటి ఆధారాలూ" లేవు. విచారణకు ముందు గాడ్సే ఇచ్చిన వాంగ్మూలంలో "ఆర్‌ఎస్‌ఎస్ నుంచి నిష్క్రమించిన విషయాన్ని ప్రస్తావించలేదు" అని ఝా రాశారు.

అయితే, గాడ్సే ఇచ్చిన కోర్టు వాంగ్మూలంలో "ఆర్ఎస్ఎస్ విడిచిపెట్టిన తరువాత హిందూ మహాసభలో చేరినట్లు తెలిపారు. కానీ, కచ్చితంగా అది ఎప్పుడు జరిగిందన్న దానిపై మౌనం వహించారు".

"ఇది గాడ్సే జీవితంలో అత్యంత చర్చనీయాంశమైన అంశాలలో ఒకటిగా మిగిలిపోయింది" అని ధీరేంద్ర ఝా అంటారు.

"గాంధీని హత్య చేయడానికి దాదాపు ఒక దశాబ్దం ముందే గాడ్సే ఆర్ఎస్ఎస్‌తో తెగతెంపులు చేసుకున్నారని, తరువాత హిందూ మహాసభలో చేరారనే" ప్రతిపాదనను ముందుకు నెట్టడానికి ఆర్ఎస్ఎస్ అనుకూల రచయితలు ఈ వివాదాన్ని ఉపయోంచుకున్నారని ఝా అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌లో దీర్ఘకాల సభ్యుడు

గాడ్సే 1930లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారని, నాలుగేళ్ల తరువాత ఆ సంస్థ నుంచి నిష్క్రమించారని అమెరికన్ పరిశోధకుడు జేఏ కుర్రాన్ జూనియర్ పేర్కొన్నారు. అయితే ఆయన వాదనకు ఎలాంటి ఆధారాలనూ అందించలేదు.

విచారణకు ముందు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో తాను ఏకకాలంలో రెండు సంస్థలకూ పనిచేసినట్లు గాడ్సే అంగీకరించారని ఝా అంటారు.

గాడ్సే కుటుంబ సభ్యులు కూడా గతంలో ఈ వివాదం గురించి మాట్లాడారు.

తన సోదరుడు "ఆర్‌ఎస్‌ఎస్‌ను విడిచిపెట్టలేదు" అని 2005లో మరణించిన నాథూరామ్ సోదరుడు గోపాల్ గాడ్సే చెప్పారు.

అలాగే, 2015లో గాడ్సే మనుమడు ఒక విలేఖరితో మాట్లాడుతూ, గాడ్సే 1932లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారని, "ఆయన ఎప్పుడూ ఆ సంస్థ నుంచి బహిష్కరణకు గురి కావడంగానీ, వదిలి వెళ్లడంగానీ జరగలేదని" చెప్పారు.

హిందూ మహాసభకు, ఆర్ఎస్ఎస్‌కు ఎలాంటి సంబంధాలు ఉండేవి?

పాత ఆర్కైవ్‌లను జల్లెడ పట్టిన ధీరేంద్ర ఝా ఈ రెండు హిందూ సంస్థలకు మధ్య సంబంధాన్ని కూడా వెలికితీసే ప్రయత్నాలు చేశారు.

సిద్ధాంతపరంగా హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్‌లు "ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న సంస్థలేనని" ఆయన అంటారు.

గాంధీ హత్య వరకు ఈ రెండు సంస్థలూ "సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాయని, రెండింటికీ ఉమ్మడి సభ్యులు ఉండేవారని" పేర్కొన్నారు.

1930ల మధ్యలోనే ఆర్ఎస్ఎస్‌ను విడిచిపెట్టానని గాడ్సే కోర్టులో చెప్పిన విషయాన్నే ఆర్ఎస్ఎస్ ఎల్లప్పుడూ ఉటంకించింది. కోర్టు తీర్పులో కూడా గాంధీ హత్యకు, ఆర్ఎస్ఎస్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు.

"ఆయన (గాడ్సే) ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడని చెప్పడమంటే, రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు ఆడడమేనని" ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత రామ్‌మాధవ్‌ అన్నారు.

గాంధీ హత్య "అత్యంత విషాదకర సంఘటన" అని, హత్య చేసిన వ్యక్తి "ఈ దేశానికి చెందిన హిందువు కావడం మరింత విషాదం" అని ఆర్ఎస్ఎస్ సంస్థలో ప్రముఖుడైన ఎంఎస్ గోల్వాకర్ అన్నారు.

ఇటీవల, ఎంజీ వైద్య లాంటి ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా గాడ్సేను "హంతకుడిగా" అభివర్ణించారు. "దేశం మొత్తం గౌరవించే వ్యక్తిని హత్య చేయడం ద్వారా గాడ్సే హిందుత్వను అవమానించారని" పేర్కొన్నారు.

గాంధీ అంతిమ యాత్ర

హిందూ మహాసభకు, ఆర్ఎస్ఎస్‌కు మధ్య ఎప్పుడూ కరకు సంబంధాలే ఉండేవని విక్రం సంపత్ లాంటి రచయితలు భావిస్తున్నారు.

సావర్కర్ సమగ్ర జీవిత చరిత్రను రెండు సంపుటాలుగా రచించారు సంపత్.

"హిందువుల ప్రయోజనాలను కాపాడటానికి" కొంతమంది వలంటీర్లతో "విప్లవాత్మక రహస్య సమాజాన్ని" ఏర్పాటు చేయాలని హిందూ మహాసభ నిర్ణయించింది. అది ఆర్ఎస్ఎస్‌కు పొసగలేదు. దాంతో, ఈ రెండు సంస్థల మధ్య సంబంధాలు సన్నగిల్లాయని సంపత్ రాశారు.

"వ్యక్తి పూజ, అతిశయోక్తి ప్రశంసలను ఆర్ఎస్ఎస్ నిరోధించింది. కానీ, సావర్కర్ లాంటి హిందూ మహాసభ నాయకులు వాటికే పెద్దపీట వేశారు" అని సంపత్ అంటారు.

"గాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ మాజీ సభ్యుడు (గాడ్సే) ప్రమేయం ఉందని" ఆ సంస్థపై నల్లరంగు పూసేందుకు ప్రయత్నాలు జరిగాయని, "ఫాసిస్ట్ అని, నిరంకుశవాద సంస్థ, తిరోగమనవాది అనే దుష్ప్రచారాలు" జరిగాయని 'ఆర్ఎస్ఎస్: ఎ వ్యూ టు ది ఇన్‌సైడ్ ' పుస్తక రచయితలు వాల్టర్ కె ఆండర్సన్, శ్రీధర్ డి దామ్లే రాశారు.

అయినప్పటికీ, గాడ్సేకు ఆర్‌ఎస్‌ఎస్‌తో విడదీయరాని సంబంధం ఉందనే సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి.

1949 నవంబర్ 15న తనను ఉరితీసే ముందు, గాడ్సే ఆర్ఎస్ఎస్ ప్రార్థనలోని మొదటి నాలుగు వాక్యాలను చదివారు.

"ఆ సంస్థలో ఆయన చురుకుగా పనిచేశారన్న విషయాన్ని ఇది వెల్లడిస్తుంది" అని దీరేంధ్ర ఝా అంటారు.

"గాంధీ హత్య ఉదంతం నుంచి ఆర్ఎస్ఎస్‌ను వేరు చేయడం చరిత్రను తారుమారు చేసే ప్రయత్నం" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Did Nathuram Godse really leave the RSS at the time of Gandhi's assassination
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X