ఏపీలో డీజిల్ ధరలతో ముడిపెట్టి.. రేట్లు పెంచిన కర్ణాటక
Petrol and Diesel Price in Karnataka: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డీజిల్ రేట్లను పెంచింది. డీజిల్ అమ్మకాలపై పన్ను శాతాన్ని భారీగా పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫలితంగా డీజిల్ ధరలు లీటర్ ఒక్కింటికి దాదాపు రెండు రూపాయల మేర పెరిగింది. పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. వాటిని సవరించలేదు.
పెరిగిన డీజిల్ ధరలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. కర్ణాటకలో నిన్నటివరకు డీజిల్ ధర రూ. 88.99 పైసలు, పెట్రోల్ ధర రూ. 102.92 పైసలు. డీజిల్ అమ్మకాలపై మాత్రమే మూడు శాతం మేర సెస్ విధించింది ప్రభుత్వం. ఈ పెంపుతో డీజిల్‌పై విక్రయ పన్ను 18.4 శాతం నుంచి 21.17 శాతానికి చేరుకుంది. లీటరు డీజిల్ ధర రూ. 91.02 పైసలకు చేరింది.

అదే సమయంలో ఈ ఏడాది మార్చి 31 తేదీ నాటికి వివిధ రాష్ట్రాల్లోని డీజిల్ ధరల జాబితాను కూడా విడుదల చేసింది ప్రభుత్వం. బెంగళూరు రూ. 91.02 పైసలు, తమిళనాడులోని హోసూరులో రూ. 94.42 పైసలు, కేరళలోని కాసర్‌గోడ్‌లో రూ. 95.66 పైసలు, ఏపీలోని అనంతపురంలో రూ. 97.35 పైసలు, హైదరాబాద్‌లో రూ. 95.70, మహారాష్ట్రలోని కగల్‌లో రూ. 91.07 పైసలుగా ఉన్నట్లు తెలిపింది.
ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి ఎల్‌కే అథీక్ మాట్లాడారు. పన్నులు పెంచినప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకలోనే డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ పెంపు ద్వారా సుమారు 2,000 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం పెట్రోల్‌పై విక్రయ పన్ను పెంచే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు.
గత ఏడాది జూన్‌లో కూడా కర్ణాటక ప్రభుత్వం ఇంధన అమ్మకాలపై సెస్‌ను విధించిన విషయం తెలిసిందే. పెట్రోల్‌పై విక్రయ పన్నును 25.92 నుంచి 29.84 శాతానికి, డీజిల్‌పై 14.3 నుంచి 18.4 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. వరుసగా ధరలు పెంచుతోడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ డీజిల్ ధరల పెరుగుదల వల్ల రవాణా ఛార్జీలు రెట్టింపు అవుతాయని, ఇది నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్ల ధరల పెరుగుదలకు దారి తీస్తుందనే ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులపై ఇది మరింత భారం పడినట్టవుతుందంటూ కర్ణాటక భారతీయ జనతా పార్టీ మండిపడుతోంది.
బృహత్ బెంగళూరు మహానగర పాలికె ఏప్రిల్ 1 నుంచి ఆస్తి పన్నుతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలోనే కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ ఛార్జీ- 15 శాతం, మెట్రో రైలు ఛార్జీ- 71 శాతం, పాల ధర లీటరుకు రూ. 4, విద్యుత్ ఛార్జీలు పెరిగాయి.












Click it and Unblock the Notifications