వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిజిటల్ పేమెంట్స్: ఫోన్‌పే, పేటీఎం వాడుతున్నారా? మీ ఖాతాలు వేరొకరికి చిక్కకుండా ఎలా జాగ్రత్తపడాలి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఫోన్ పే, పేటీఎం

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)తో కలిసి యూపీఐ డిజిటల్ పేమెంట్స్ విభాగంలో పనిచేస్తున్న మార్కెట్ ప్లేయర్స్ మీద పరిమితులు విధించాలని ప్రయత్నిస్తోంది.

గూగుల్ పే, పేటిమ్, ఫోన్‍పే లాంటి థర్డ్‌పార్టీ ప్రవేట్ కంపెనీల యాప్స్ నుంచే సింహభాగం యూపీఐ లావాదేవీలు జరుగుతుండడంతో, వాటినుంచి లావాదేవీలు 30% మించి రాకూడదన్న నియమాలపై కసరత్తులు జరుగుతున్నాయి.

ఇవిగానీ అమలులోకి వస్తే డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడకంలో మార్పులు వస్తాయి. బహుశా, నెలకు ఇన్ని లావాదేవీలు కన్నా ఎక్కువ చేయకూడదన్న నియమాలు రావచ్చు.

ఆ నేపథ్యంలో ఈ యాప్స్ విషయాల్లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెల్సుకుందాం.

పేటీఎం

మొబైల్ పేమెంట్ యాప్స్

నెట్ బ్యాంకింగ్ లాంటివి వాడి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి అవతలివారి బ్యాంక్ అకౌంట్ల వివరాలన్నీ తెలుసుండాలి. అవి మన అకౌంట్‌లో లింక్ అయ్యుండాలి. అప్పుడు గానీ డబ్బు పంపలేం.

ఈ బాధలేవీ లేకుండా ఒక ఫోన్ నెంబర్ ఉంటే చాలు, ఎవరికైనా డబ్బులు పంపించే వెసులుబాటు ఇచ్చే టెక్నాలజీ Unified Payments Interface (UPI).

ఈ సర్వీస్‍ను అందించే యాప్స్: గూగుల్ పే, పేటిఎమ్, ఫోన్ పే, వాట్సాప్ పే వగైరాలు.

వీటి వల్ల ఎన్ని సౌలభ్యాలు ఉన్నాయో, వీటిని జాగ్రత్తను ఉపయోగించకపోతే డబ్బు నష్టపోయే అవకాశాలూ అంతే ఎక్కువ.

ముఖ్యంగా మార్కెట్‍లో ఎడాపెడా కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. వీటిలో ఏవి నమ్మదగినవో, వేటికి దూరంగా ఉండాలో తెల్సుకోవడం కూడా ముఖ్యం.

అలా నిర్ణయించుకోడానికి మనకి ఉపయోగపడే కొన్ని ప్రశ్నలు:

డిజిటల్ బ్యాంకింగ్
  1. ప్లే స్టోర్/యాప్ స్టోర్‌లో ఈ యాప్‍కు సరైన రేటింగ్స్, రివ్యూస్ ఉన్నాయా?
  2. యాప్ వాడడానికి లాగిన్ అవ్వాలి కదా. ఆ లాగిన్ నియమాలు ఎంత పకడ్బందీగా ఉన్నాయి. పాస్‍వర్డ్ అవీ బలంగా సెట్ చేసుకోనిస్తుందా?
  3. ఫోన్ తెరిచేటప్పుడు ఇచ్చే పాస్‍వర్డ్ కాకుండా, యాప్ తెరవడానికి కూడా మళ్ళీ పాస్‍వర్డ్ లాంటివి అడుగుతుందా?
  4. యాప్ నుంచి డబ్బులు వేసినా, డబ్బులు వచ్చినా నోటిఫికేషన్స్ వస్తున్నాయా?
  5. పొరపాటున వేయకూడని వారికి డబ్బులు వేస్తే సరిజేసుకునే అవకాశాలు ఇస్తుందా? పేమెంట్ చేసే ముందు, కన్‍ఫర్మేషన్ అడుగుతుందా?
  6. యాప్ ఇన్‍స్టాల్ చేసేటప్పుడు ఏయే పర్మిషన్లు అడుగుతుంది? థర్డ్ పార్టీ కంపెనీలకు డేటా పంపించే అవకాశాలు ఉన్నట్టు యాప్ వివరాల్లో ఎక్కడన్నా ఉందా?

వీటన్నింటికీ సమాధానాలను బట్టి ప్రస్తుతం మార్కెట్‍లో ఏ యాప్ సురక్షితం అనేది తెలుసుకోవచ్చు.

మొబైల్ పేమెంట్ యాప్‍ను సురక్షితం చేసుకోడం ఇలా..

ఫోన్ పే

మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ (Multi-Factor Authentication - MFA): ఇది ఎనేబుల్ చేసుకోవడం వల్ల కేవలం యూజర్ నేమ్/పాస్ వర్డ్ అడిగి ఊరుకోకుండా, అవి ఇచ్చాక మళ్ళీ మొబైల్/ఈమెయిల్‍కు ఓటీపీ పంపిస్తుంది. ఓటీపీ కరెక్టుగా ఎంటర్ చేస్తేనే యాప్‍లో వివరాలు చూపిస్తుంది. అందుకని ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలి.

నోటిఫికేషన్లు వచ్చేట్టు పెట్టుకోవడం: మన అకౌంట్‍లో డబ్బులు పడినా, లేక తీసినా నోటిఫికేషన్లు వచ్చేట్టు పెట్టుకుంటే, మనకి తెలీకుండా డబ్బులు కట్ అయినప్పుడు కూడా మనకి వెంటనే తెలుస్తుంది.

అప్పుడు అవాంఛనీయ సంఘటన వల్ల మన డబ్బు పోయుంటే వెంటనే చర్యలు తీసుకోవచ్చు.

గమనిక: మొబైల్ నోటిఫికేషన్లతో పాటు SMS/Email నోటిఫికేషన్లు కూడా పెట్టుకోవచ్చు. అయితే, బ్యాంక్ బ్యాలెన్స్ సూచించే ఎస్ఎంఎస్‌లు చదవి కొన్ని రోజులకు డిలీట్ చేసుకుంటుంటే నయం. లేకపోతే, మన ఫోన్ ఎవరన్నా దొంగలించి అన్‍లాక్ చేస్తే, లేదా మనమే అజాగ్రత్తగా లాక్ చేయకుండా వదిలిస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ అవతలివారికి తెలియకుండా ఉంటుంది.

యాప్‍కు పాస్‍కోడ్: మామూలుగా మన ఫోన్ పాస్‍కోడ్/పాస్‍వర్డ్ ఇచ్చాక అన్ని యాప్స్ అందుబాటులో ఉంటాయి(లాగిన్ ఒకసారి చేస్తే చాలు.) అలా ఒకసారి లాగిన్ చేస్తే అన్నీ అందుబాటులో ఉండాలన్న సెట్టింగ్ పేమెంట్ యాప్స్‌కు పెట్టుకోకూడదు. యాప్ ఓపెన్ చేయాల్సిన ప్రతిసారి పాస్‍కోడ్ ఇచ్చేలా పెట్టుకుంటే అధిక భద్రత ఉంటుంది.

మొబైల్ యాప్ అప్‍డేట్స్: మొబైల్ యాప్స్ ఇన్‍స్టాల్ చేసుకున్నాక వాటికి అప్‍డేట్స్ వస్తుంటాయి. ఇవి ముఖ్యంగా సెక్యూరిటీ సమస్యలకు పరిష్కారాలు కలిగి ఉంటాయి. అందుకని వీటిని ఆలస్యంగా చేయకుండా అప్‍డేట్ చేసుకుంటుండాలి. ఆటోమాటిక్‍గా ఈ అప్‍డేట్స్ అవ్వాలంటే

గూగుల్ ప్లే స్టోర్ యాప్‍లో Settings > Auto-update apps.

ఐఫోన్‍లో Settings > iTunes & App Store > App Updates.

పేటీఎం

ఎవరికి పంపిస్తున్నామో సరి చేసుకోవాలి: పేమెంట్ చేయడానికి అనేక విధానాలు ఉన్నాయి: నెంబర్ కొట్టడం, యూపీఐ ఐడీ ఇవ్వడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, పేమెంట్ లింక్ నుంచి చేయడం వంటివి.

వీటిల్లో వేటిని వాడినా ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. లేకపోతే, వేరేవాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతాయి. స్కామ్స్‌లో ఇరుక్కుంటాం. మొదటిసారి ఎవరికైనా డబ్బులు వేసేటప్పుడు Rs 5 లాంటి చిన్న మొత్తాన్ని వేసి, వెళ్ళాల్సిన వాళ్ళకే వెళ్ళిందని నిర్ధారించుకున్నాక అసలు మొత్తాన్ని పంపాలి.

మొబైల్ పేమెంట్స్‌ను కూడా క్యాష్‌లానే భావించాలి: మనం క్యాష్ ఎవరికన్నా ఒకసారి ఇచ్చాక వాళ్ల నుంచి తిరిగి తీసుకోవడం (వాళ్లంతట వాళ్లు ఇస్తే తప్ప) ఎంత అసంభవమో మొబైల్ పేమెంట్స్‌లో వెళ్ళిన డబ్బు కూడా అంతే! స్కామ్స్‌లో పోగొట్టుకున్న డబ్బు మళ్ళీ తిరిగి రాదు. డిజిటల్ పేమెంట్ కదా, ట్రాక్ చేస్తే తెలుస్తుందేమోనని అనిపించినా కూడా వెనక్కి రాదు. అందుకని ఒకటికి రెండు సార్లు సరి చూసుకునే డబ్బులు వేయాలి. హడావిడిగా, అనుమానంగా వేయకూడదు.

ఫోన్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పేమెంట్ యాప్స్ ఉన్న ఫోనును డబ్బున్న పర్సులానే చూసుకోవాలి. అంతకన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో కొన్ని:

  • ఫోన్‍కి తప్పనిసరిగా పాస్‍వర్డ్/పాస్‍కోడ్ పెట్టుకోవాలి. ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్‍కన్నా ఇవే ఎక్కువ సెక్యూరిటీ. ఎందుకంటే ఎవరన్నా బలవంతాన వేలి ముద్ర తీసుకోవచ్చు, కానీ మనం చెప్తే కానీ పాస్‍వర్డ్ తెలీదు వారికి.
  • పాస్‍వర్డ్ మూడుసార్లకన్నా ఎక్కువసార్లు తప్పు కొడితే, ఫోన్ లాక్ అయిపోయే సెట్టింగ్ పెట్టుకోవాలి. దొంగల చేతికి చిక్కినా వాళ్లకి వివరాలు అందకూడదు.
  • మొబైల్ యాప్ పేమెంట్స్‌కు ఖచ్చితంగా పాస్‍వర్డ్ ఉండాలి.
  • ఒకటికన్నా ఎక్కువ మొబైల్ యాప్ పేమెంట్స్ వాడుతుంటే, అన్నింటికీ ఒకటే పాస్‍వర్డ్ పెట్టకూడదు. వేర్వేరు ఉంచాలి. ఒక యాప్ పాస్‍వర్డ్ లీక్ అయినా వేరేవి సురక్షితంగా ఉంటాయి.
  • పేమెంట్ యాప్స్ ఉన్న మొబైల్‌లో గేమింగ్/లాటరీ లాంటి వేరే యాప్స్ వేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఏదన్నా ఫేక్ యాప్ ద్వారా మాల్‍వేర్ ప్రవేశిస్తే, అది పేమెంట్ యాప్‍ను వాడుకుంటూ ఆర్థిక నష్టం కలిగించవచ్చు.

ఫోన్ పోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • పేమెంట్ యాప్స్ ఉన్న ఫోన్‍లకు ట్రాకింగ్ ఎనేబుల్ చేయాలి. ఫోన్ ఏ లొకేషన్‍లో ఉందో తెలుసుకునే వీలును ఇప్పుడు అన్ని కంపెనీలు ఇస్తున్నాయి.
  • పేమెంట్ యాప్స్ ఉన్న ఫోనులకు “రిమోట్ డేటా ఎరేజ్” (remote data erase) ఫీచర్ ను ఎనేబుల్ చేసుకుంటే, ఒకవేళ ఫోన్ పోయినా కూడా డేటా మొత్తం క్లీన్ చేసేయచ్చు, అది ఇంటర్నెట్‍కు కనెక్ట్ కాగానే. అప్పుడు దొంగలు ఈ యాప్‍ల నుంచి డబ్బు తీసే వీలుండదు.
  • ఫోన్ పోతే, వెంటనే అకౌంట్ల పాస్‍వర్డ్స్ మార్చే వీలుందేమో చూడాలి. లేదా, బ్యాంక్ అకౌంట్ నుంచి టెంపరరీగా డబ్బు తీయగలిగే వెసులుబాటును ఉంచుకోవాలి. అప్పుడు దొంగలు పేమెంట్ చేయాలని చూసినా కూడా విఫలమవుతారు.

టెక్నాలజీ అందించే వెసులుబాటులు వెసులుబాటులుగా మిగలాలి అంటే దాని వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటూ ఉండాలి. లేదంటే, నష్టపోతాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Digital Payments: Using PhonePay, Paytm? How to prevent your accounts from being hacked?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X