గే సెక్స్: సుప్రీంకోర్టు తీర్పుపై సోనియా అసంతృప్తి
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం చట్ట విరుద్దం, నేరమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల కాంగ్రెసు అధ్యక్షురాలు, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేసారు. గే హక్కుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వ్యతిరేకించడం పట్ల తాను నిరాశకు గురైనట్లు ఆమె తెలిపారు. దేశంలోని పౌరులందరికీ జీవించే హక్కును, స్వేచ్ఛను పార్లమెంటు గ్యారంటీ చేస్తందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు.
గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలివైందని, ప్రాథమిక మానవహక్కులకు విఘాతంగా ఉన్న చట్టాన్ని అన్యాయంగా హైకోర్టు వర్ణించిందని ఆమె గుర్తు చేశారు. తమ సంప్రదాయం ఇమిడ్చుకునేది, సహనశీలమైంది కావడం గర్వకారణమని ఆమె అన్నారు.

వెనక్కి తీసుకుని వెళ్లింది
గే సెక్స్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 1860లోకి తీసుకుని వెళ్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాలు శిలాసదృశ్యాలు కావని ఆయన ఓ ఆంగ్ల మీడియా చానెల్‌తో అన్నారు. ప్రభుత్వం క్యురిటేవ్ పిటిషన్ వేసి, తీర్పును ఐదుగురు సభ్యులతో కూడిన బెంచ్ విచారించాలని కోరాలని ఆయన అన్నారు.
గే సెక్స్‌పై హైకోర్టు తీర్పును పునరుద్ధరించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ గురువారంనాడు చెప్పారు. స్వలింగ సంపర్కాన్ని నేరాల జాబితా నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.