రాజీనామా వార్తలపై డిప్యూటీ సీఎం క్లారిటీ!
DK ShivaKumar: కర్ణాటక రాష్ట్రంలో నాయకత్వ మార్పు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడిని అని పేర్కొంటూ.. కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తాననే వదంతులను కొట్టిపారేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం డిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన తర్వాత రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ లేదా నాయకత్వ మార్పు ఉండవచ్చనే ఊహాగానాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఢీకే శివకుమార్ కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
సీఎందే తుది నిర్ణయం: డీకే శివకుమార్
కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభీష్టానికే చెందుతుందని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. పార్టీ హైకమాండ్‌తో చర్చించిన తర్వాతే ఇది జరుగుతుందని ఆయన వెల్లడించారు. తాను ఢిల్లీకి వచ్చింది కేవలం ఒక శుభకార్యానికి ఆహ్వానించడానికి మాత్రమేనని శివకుమార్ తెలిపారు. కర్ణాటకలో కొత్తగా 100 కాంగ్రెస్ కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమానికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించడానికి వచ్చానని చెప్పారు. "శంకుస్థాపన కార్యక్రమం, అనేక ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఎవరు చూసుకుంటారు? నేను చేయాలి. నేను (రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా) రాజీనామా చేస్తానని ఎందుకు చెబుతాను? ఆ పరిస్థితి ఇంకా తలెత్తలేదు. నేను క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పార్టీకి సేవ చేయడానికి అంకితమయ్యాను, నాకు అప్పగించిన పనులను చేస్తాను." అని శివకుమార్ ఢిల్లీలో విలేకరులతో అన్నారు.

నేను బ్లాక్‌మెయిల్ చేయను: డీకే శివకుమార్
ఈ ఊహాగానాలకు మీడియానే కారణమని డీకే శివకుమార్ పేర్కొన్నారు. తాను రాజీనామా బెదిరింపులతో పార్టీని బ్లాక్‌మెయిల్ చేసే వ్యక్తిని కాదని గట్టిగా చెప్పారు. "నేను కాంగ్రెస్‌ను బ్లాక్‌మెయిల్ చేసే వ్యక్తిని కాదు. నేను ఈ పార్టీని నిర్మించాను. దాని కోసం రేయింబవళ్లు అవిశ్రాంతంగా పనిచేశాను. భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాను. 2028లో మా పార్టీ (కర్ణాటకలో) మళ్లీ అధికారంలోకి వస్తుంది," అని శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంతో పాటు మహాత్మా గాంధీ నేతృత్వంలో ఒక శతాబ్దం క్రితం జరిగిన బెళగావి కాంగ్రెస్ సెషన్ గురించి, దాని శతాబ్ది ఉత్సవాల గురించి తాను రచించిన "గాంధీ-భారత్" అనే పుస్తకాన్ని కూడా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వరన్ కూడా ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదని, కేవలం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మాత్రమే ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. అయితే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీలో స్పష్టత ఇస్తూ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ జరగలేదని, బీహార్ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications