తమిళ అసెంబ్లీలో గవర్నర్ వర్సెస్ స్టాలిన్- డీఎంకే, మిత్రపక్షాల వాకౌట్- తెలంగాణ తరహాలోనే..
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్న గవర్నర్ బీఎన్ రవికి ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ సమావేశాల ఆరంభవేళ ఆయన చేసిన ప్రసంగంలో పలు వ్యాఖ్యలు బీజేపీ, ఆరెస్సెస్ కు మద్దతుగా ఉండటంతో అధికార డీఎంకేతో పాటు మిత్రపక్షాలు కూడా భగ్గుమన్నాయి.
తమిళనాడు పేరు తీసేసి దాని స్ధానంలో తమిళగం పేరు పెట్టాలన్న గవర్నర్ బీఎన్ రవి వ్యాఖ్యలు ఇవాళ అసెంబ్లీని కుదిపేశాయి. గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టగానే దీనిపై అధికార డీఎంకేతో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తూ నిరసనకు దిగాయి. గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. బీజేపీ, ఆరెస్సెస్ భావజాలాన్ని తమిళనాడుపై రుద్దొద్దని సూచించాయి. ఇది నాగాలాండ్ కాదని, తమిళనాడు అని స్పష్టంచేశాయి. అయితే గవర్నర్ రవి మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రసంగం కొనసాగించారు.

గవర్నర్ ప్రసంగంలో వ్యాఖ్యలపై మండిపడ్డ డీఎంకే, మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు కొనసాగించాయి. అయినా గవర్నర్ వెనక్కి తగ్గకపోవడంతో అసెంబ్లీ నుంచి బాయ్ కౌట్ చేశాయి. అధికారపక్షమై ఉండి కూడా గవర్నర్ వ్యాఖ్యలపై డీఎంకే, మిత్రపక్షాలు బాయ్ కాట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వెళ్లే ముందు ఆన్ లైన్ జూదాన్ని నిషేధించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంపైనా డీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. వాస్తవానికి ప్రభుత్వం పంపిన బిల్లుల్ని ఆమోదించకుండా గవర్నర్ రవి పెండింగ్ పెట్టడంపై ఇరు పక్షాల మధ్య వార్ జరుగుతోంది. డిసెంబర్ నాటికి గవర్నర్ వద్ద ఇలాంటి 21 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
మరోవైపు తెలంగాణలోనూ దాదాపు ఇలాంటి పరిస్ధితే కనిపిస్తున్న వేళ పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ గవర్నర్, డీఎంకే సర్కార్ మధ్య జరుగుతున్న పోరు ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. దీంతో ఇక్కడా గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా అధికార బీఆర్ఎస్ పోరాడుతోంది.












Click it and Unblock the Notifications