డీఎంకే-కాంగ్రెస్ మధ్య విజయ్ చిచ్చు..! ఇండియా కూటమిలో ప్రకంపనలు..!
తమిళనాడులో నిన్న మొన్నటివరకూ డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ (ఎస్పీఏ)లో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తాజా ఎన్నికల్లో కూటమి కాస్తా ఓటమిపాలు కావడంతో రూటు మార్చేసింది. డీఎంకేకు గుడ్ బై చెప్పేసి విజయ్ పార్టీ టీవీకేతో జట్టు కట్టేందుకు సిద్దమైంది. విజయ్ కు మద్దతు ప్రకటిస్తూ తమిళనాడు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దీంతో డీఎంకే వర్సెస్ కాంగ్రెస్ (dmk vs congress) గా పరిస్ధితి మారుతోంది. అలాగే తమిళనాడుతో పాటు జాతీయ స్దాయిలోనూ ప్రకంపనలు మొదలయ్యేలా ఉన్నాయి.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి 10 సీట్ల దూరంలో ఉన్న విజయ్ కు స్నేహహస్తం అందించిన కాంగ్రెస్ పార్టీపై డీఎంకే మండిపడింది. ఇన్నాళ్లు తమతో మిత్రపక్షంగా ఉంటూ ఇప్పుడు విజయ్ కు మద్దతివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ను వెన్నుపోటుదారుగా డీఎంక అధికార ప్రతినిధి శరవణన్ అన్నదురై అభివర్ణించారు. బీజేపీ, ఆరెస్సెస్ రాహుల్ గాంధీని పప్పూ అని ఎగతాళి చేస్తున్నప్పుడు .. స్టాలిన్ ఆయన్ను ప్రధాని అభ్యర్దిగా నిలబెట్టారని గుర్తుచేశారు.

డీఎంకే వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో
తమిళనాడు తీర్పు డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందన్నారు. కేబినెట్‌లోని సగం మంది మంత్రులు తమ సీట్లను కోల్పోయారని, తమ తప్పు ఏమీ లేకపోయినా పరోక్ష నష్టాన్ని చవిచూశామని గుర్తుచేశారు. ఇప్పుడు బీజేపీ తమిళనాడుపై కన్నేసిందన్నారు. మన ముందున్న ప్రశ్న స్పష్టం:ప్రజా తీర్పులో తిరస్కరించబడిన వారితో మనం నిలబడాలా, లేక బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన శక్తితో ఏకమై, తమిళనాడును బీజేపీ పాలించకుండా అడ్డుకోవడానికి పోరాడాలా? అని ప్రశ్నించారు. మరోవైపు తమిళనాడు ప్రభావం జాతీయ స్దాయిలో ఇండియా కూటమిపై పడకుండా కాంగ్రెస్ చూసుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది.














Click it and Unblock the Notifications