వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాక్సీన్ వేసుకుంటే పత్యం చేయాలా... డాక్టర్లు, ప్రభుత్వాలు చెప్పని మాట యాడ్స్‌లో ఎందుకొచ్చింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

''టీకాతో పాటు పత్యం కూడా చేయాలి'' ఇది కోవిడ్ టీకా సర్టిఫికెట్లపై కనిపిస్తున్న మాట. ఇది చూసిన వారు గందరగోళానికి గురవుతున్నారు. బయట ఎక్కడా ఎవరూ ఈ మాట చెప్పడం లేదు.

కానీ, టీకా సర్టిఫికేట్లపై మాత్రం ఈ వాక్యం కనిపిస్తోంది. దీంతో గందరగోళం పెరిగింది. ఇంతకీ ఎందుకిలా జరిగింది?

భారతదేశంలో చాలా భాషలుంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైనా సమాచారం ప్రజలకు చేరవేయాలనుకుంటే అనువాదం చేస్తుంటుంది. కేంద్రం ఇచ్చే ప్రకటనలు, వార్తలు, సర్టిఫికేట్లు..ఇలా ఎన్నిటినో అనువాదం చేసే పెద్ద తతంగం ఎప్పుడూ జరుగుతుంది.

అయితే చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం, ఆ సంస్థలు చేసే అనువాదాలు అసహజంగా, ఎవరికీ అర్థం కాకుండా ఉంటాయి.

గ్రాంథిక భాష, సంస్కృత పదాలు ఎక్కువగా వాడడం ఒక సమస్య. కొన్ని సందర్భాల్లో పూర్తి వ్యతిరేక అర్థమో, సంబంధం లేని అర్థమో వస్తూ ఉంటుంది కూడా.

తాజాగా కరోనా వ్యాక్సీన్ సర్టిఫికేట్లలో ఇలాంటి గందరగోళమే ఎదురైంది.

హిందీ నుంచి యథానువాదం సందర్భంగా పత్యం అనే మాట వచ్చి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

పత్యం అవసరమా?

నిజానికి కరోనా టీకాకు ఎటువంటి పత్యమూ లేదని ముందు నుంచీ వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. మద్యం వినియోగం విషయంలో మాత్రమే నిబంధనలు ఉన్నాయి.

మరి డాక్టర్లు చెప్పని పత్యం కేంద్రం ఎందుకు చెబుతుందా అని చూస్తే అది అనువాద సమస్య అని తేలింది.

హిందీలో టీకా సర్టిఫికేట్లపై దవాయి బీ, కడాయి బీ అని వస్తోంది. అంటే మందు తీసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి అనేది దాని భావం. ఇక్కడ మందు అంటే వ్యాక్సీన్. వ్యాక్సీన్ తీసుకున్నా జాగ్రత్తలు పాటించాలని కేంద్రం చెబుతోంది.

హిందీలో కడాయీ పదానికి చాలా అర్థాలున్నా, ఇక్కడ సందర్భాన్ని బట్టి బాధ్యతగా, జాగ్రత్తగా ఉండాలనే అర్థం వాడాలి.

అది కాస్తా తెలుగులోకి వచ్చేసరికి టీకాతో పాటూ పత్యం కూడా చేయాలి అని మారిపోయింది. వాస్తవానికి అక్కడ ఉండాల్సింది ''టీకా తీసుకున్నా జాగ్రత్తగా ఉండండి'' అని.

వ్యాక్సీన్ వేసుకున్న తర్వాత పత్యం చేయాలని ఇంత వరకు ఏ ప్రభుత్వము చెప్పలేదు.

ఎందుకిలా జరిగింది?

నిజానికి కేంద్ర ప్రభుత్వం తరఫున మీడియాకు సమాచారం ఇచ్చే విభాగం పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ప్రకటనల్లో కూడా ''టీకా వచ్చిందండి, జాగ్రత్తలు మాత్రం మరవకండి అనీ, టీకా తీసుకోండి అయినా జాగ్రత్తగా ఉండండి అనీ రాస్తున్నారు. కానీ కోవిన్ వెబ్ సైట్ వారు మాత్రం ఈ వింత అనువాదం చేశారు.

''తాము ఈ అనువాదం చేయలేదు. బహుశా కేంద్ర ఆరోగ్యం శాఖగానీ, కోవిన్ వెబ్ సైట్ రూపొందించిన వారుగానీ నేరుగా అనువాదం చేసి ఉండొచ్చు. పీఐబీ కానీ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కానీ ఈ అనువాదం చేయలేదు'' అని కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి బీబీసీతో చెప్పారు.

అటు రెండు రాష్ట్రాల వైద్య శాఖ అధికారులను దీనిపై సంప్రదించింది బీబీసీ. తెలగాణ ప్రజారోగ్య సంచాలకులు స్పందించ లేదు. ఈ అనువాదంతోనూ, ఆ సర్టిఫికేట్ తోనూ తమకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డా.గీత వివరణ ఇచ్చారు.

''ఈ మధ్య ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. ముఖ్యంగా గూగుల్ అనువాదాలు వచ్చాక సమస్య పెరిగింది. 60 శాతం తప్పులు ఉంటున్నాయి. ఈతచెట్టు అని టైప్‌ చేస్తే స్విమ్మింగ్ ట్రీ అనే అర్ధం వస్తోంది. అంటే అసలు వాక్యానికీ అనువాదానికీ సంబంధం లేదు. పెద్ద వాక్యాలు ఇంకా దారుణం'' అని ఎమెస్కో ప్రచురణల సంపాదకులు చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు.

''ఈ అనువాదాల్లో తప్పులే కాకుండా, అసహజంగా కూడా కొన్ని ఉంటాయి. ముఖ్యంగా మరియు, యొక్క వంటి అవసరం లేని పదాలు వాడుతున్నారు. మరియు బదులు కామా లేదా దీర్ఘం సరిపోతుంది. కమర్షియల్ అనువాదాలు కూడా నాణ్యంగా కనిపించడం లేదు'' అన్నారు చంద్రశేఖర రెడ్డి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Do we need to stay away from certain foods after taking covid vaccine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X