జయలలిత వేలిముద్ర కేసు: హైకోర్టుకు ప్రత్యక్ష సాక్షి డాక్టర్ బాలాజీ వివరణ, మీడియాలో వద్దు!
చెన్నై: తమిళనాడులో గత సంవత్సరం జరిగిన శాసన సభ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థి బీఫామ్ లో ఆపార్టీ అధినేత్రి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో వేసిన వేలిముద్రకు ప్రత్యక్ష సాక్షిగా వ్యవహరించిన ప్రభుత్వ వైద్యుడు బాలాజీ మద్రాసు హైకోర్టు ముందు హాజరై రెండు గంటల పాటు వివరణ ఇచ్చారు.
తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం నియోజక వర్గం ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ నుంచి ఏకే బోస్, డీఎంకే పార్టీ నుంచి డాక్టర్ శరవణ పోటీ చేశారు. ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఏకే బోస్ విజయం సాధించారు. జయలలిత వేసిన వేలిముద్ర ఉన్న బీఫాం ఎన్నికల కమిషన్ కు సమర్పించారని, ఆ ఎన్నిక చెల్లదని డాక్టర్ శరవణ హైకోర్టును ఆశ్రయించారు.

జయలలిత వేలిముద్రలు వేసినప్పుడు స్పృహలో ఉన్నారా, లేదా, ఆమెకు చేసిన చికిత్స పూర్తి వివరాలు తెప్పించుకుని పరిశీలించాలని మద్రాసు హైకోర్టులో డాక్టర్ శరవణ మనవి చేశారు. ఈ కేసు విచారణకు ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ విల్ ఫోర్డ్ ఈనెల 13వ తేదీ హైకోర్టు ముందు హాజరైనారు.
అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడియం చేర్మన్ మధుసూదనన్ జయలలిత వేలిముద్రలు ఉన్న బీఫాం తీసుకోవాలని సిఫారస్సు చెయ్యడంతో తీసుకున్నామని ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. జయలలిత వేలిముద్రలు వేసే సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ప్రభుత్వ వైద్యుడు బాలాజీ హైకోర్టు ముందు హాజరై రెండు గంటల పాటు వివరణ ఇచ్చారు. ఆయన ఇచ్చిన వివరణ మీడియాలో ప్రచారం చెయ్యరాదని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications