విమానంలో మహిళ ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా కాపాడిన వైద్యుడు; అసలేం జరిగిందంటే!!
ఢిల్లీ నుండి పూణే వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో మధ్య వయస్కురాలైన ఒక మహిళ ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ కు గురికాగా, అదే విమానంలో ప్రయాణం చేస్తున్న ఒక వైద్యుడు చేసిన సహాయం మహిళా ప్రాణాలు కాపాడింది. భువనేశ్వర్ లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కార్డియాక్ అనస్థీషియా కన్సల్టెంట్ డాక్టర్ బాదమాలి అశోక్ కుమార్ మహిళా ప్రయాణికురాలికి ప్రాణదాత అయ్యారు.
తాజాగా ఈ విషయాన్ని ధృవీకరించిన ఎయిర్ లైన్స్ సిబ్బంది చాలా ప్రయాసకోర్చి వైద్యుడు అందించిన సేవను వివరించారు. 17వ తేదీన ఉదయం నాలుగు గంటలకు ఢిల్లీ నుండి పూణేకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం బయలుదేరిందని, అది ఉదయం ఆరు గంటల 10 నిమిషాలకు పూణే చేరుకోవాల్సి ఉండగా, తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాలకు ఒక నడి వయస్కురాలైన మహిళ కార్డియాక్ అరెస్ట్ కు గురైందని తెలిపారు.

దీంతో క్యాబిన్ సిబ్బంది మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారని, ఎవరైనా వైద్యులు కానీ పారామెడికల్ సిబ్బంది గాని ఉంటే మహిళ ప్రాణాలు కాపాడటానికి సహాయం చేయాలని అనౌన్స్ చేశారని తెలిపారు. అప్పుడు వెంటనే స్పందించిన డాక్టర్ బాదమాలి అశోక్ కుమార్ మహిళ కూర్చున్న ప్రదేశానికి వెళ్లి మహిళ కండిషన్ను చూసి సిపిఆర్ చేయాలని సూచించారు.
అయితే అక్కడ మహిళకు సిపిఆర్ చేయడానికి తగినంత ప్రదేశంలో లేకపోవడంతో మహిళ కనీసం కదలలేని పరిస్థితిలో ఉండటంతో ప్రయాణికుల సహకారంతో మహిళను మోసుకుంటూ తీసుకువెళ్లి సిపిఆర్ చేయడానికి తగిన ప్రదేశం చూసి సిపిఆర్ నిర్వహించారు. సిపిఆర్ చేయడం వల్ల మహిళ క్రమంగా కోలుకున్నారు. ఆమె గుండె స్పందనలు గాడిలో పడ్డాయి. దీంతో విమానంలోని ప్రయాణికులంతా వైద్యునికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇక పూణే ఎయిర్పోర్టుకు చేరుకునేసరికి తక్షణ వైద్య సదుపాయాన్ని అందించడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అప్రమత్తమైంది. వెంటనే సదరు మహిళను ఆస్పత్రికి తరలించింది. విమానంలో ప్రయాణం చేస్తున్నా మహిళ ప్రాణాలు కాపాడిన వైద్యుడికి హ్యాట్సాఫ్ చెప్తున్నారు ప్రయాణికులు.












Click it and Unblock the Notifications