జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఆ రిస్కీ అజెండావైపే కాంగ్రెస్ మొగ్గు ! చేదు అనుభవాలున్నా..!
కాశ్మీర్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో తమ గెలుపుకు మార్గం సుగమం చేస్తుందంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ విభజన వాదానికి మద్దతుగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. గతంలోనూ దేశంలో విభజన రాజకీయాలతో అధికారాన్ని సుస్ధిరం చేసుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాల ఫలితంగానే కశ్మీర్ సమస్య అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మరోసారి ఎన్నికల ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ ల పునరుద్దరణ కోసం కాంగ్రెస్ ఇస్తున్న హమీలూ జాతీయ భద్రతను పణంగా పెడుతున్నారన్న విమర్శలకు కారణమవుతున్నాయి.
కాంగ్రెస్ విభజన రాజకీయాలు
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎలాగైనా అధికారం సుస్ధిరం చేసుకునే దిశగానే ఉండేవి. ఈ కబ్జా మనస్తత్వం దేశ రాజకీయాల్లో పలు సందర్భాల్లో కాంగ్రెస్ వ్యవహారశైలి చూస్తే కనిపిస్తుంది. 1975లో ఎమర్జెన్సీ విధించినప్పటి నుండి, ప్రజాస్వామ్య వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసినప్పటి నుండి, వరుసగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాల హయాంలో అధికార కేంద్రీకరణ వరకు, పార్టీ నిరంకుశ పోకడలు విమర్శలకు కారణమయ్యాయి. జమ్మూ కశ్మీర్ సహా ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ అనుసరించిన రాజకీయ వ్యూహాలే ఇందుకు కారణం. గతంలో యూపీఏ ప్రభుత్వాల హయాంలో వరుస ఉగ్రదాడులకూ ఇవే కారణమయ్యాయి.

జమ్మూకశ్మీర్లోనూ అదే వ్యూహం
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్ణయంకొన్ని ఓటు బ్యాంకుల్ని ప్రసన్నం చేసుకునేందుకే అన్న విమర్శలున్నాయి. ఇవి అంతిమంగా వేర్పాటువాదానికి, తీవ్రవాదానికి కారణమయ్యాయి. అయినా వాటిని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ ప్రయత్నించలేదు. అలాగే ఎన్డీఏ సర్కార్ రద్దు చేసినా వాటిని పునరుద్దరిస్తామంటూ ఇప్పుడు మరోసారి హామీలు ఇస్తోంది. ఇది జాతీయ భద్రతను సైతం ప్రమాదంలోకి నెడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

వక్ఫ్ బోర్డు విషయంలోనూ..
తాజాగా కేంద్రం పార్లమెంటులో తెచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు విషయంలోనూ కాంగ్రెస్ వైఖరి కొన్ని వర్గాల్ని ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా ఉందన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా వక్ఫ్ బోర్డు అనేది ముస్లింల మతపరమైన, ధార్మిక వ్యవహారాలు చూసే సంస్ధ. కానీ ఆ ముసుగులో భారీ ఎత్తన భూములు, ఆస్తుల్ని తమ గుప్పిట్లో ఉంచుకుంటోందన్న ఆరోపణలున్నాయి. అలాంటి వక్ఫ్ బోర్డుకు కాంగ్రెస్ అండగా నిలవడం తన రాజకీయ ప్రయోజనాల కోసమే అన్న చర్చ జరుగుతోంది.
ఇలా ఏ విధంగా చూసుకున్నా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ రచిస్తున్న వ్యూహాలు ఆ పార్టీకి రాజకీయంగా ఉపయోగపడొచ్చు కానీ అంతిమంగా జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెడుతుందన్న వాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఖర్గే చేసిన వ్యాఖ్యల బట్టి చూస్తే భవిష్యత్తులో జమ్మూకశ్మీర్ లో అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ తిరిగి విభజన రాజకీయాలకు దాన్ని కేంద్రంగా మార్చుకోవడానికే పనికొస్తుందనే చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications