వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోల వివాదం మన నైతిక విలువల గందరగోళాన్ని సూచిస్తోందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

"వెయ్యి మంది ముందు నేను నగ్నంగా నిలబడగలను. కానీ, వాళ్లే అసౌకర్యానికి గురవుతారు" అని బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ఇటీవల 'పేపర్’ అనే మ్యాగజైన్‌‌తో అన్నారు.

అదే మ్యాగజైన్‌లో ఆయన నగ్నంగా పోజులిస్తూ చేసిన ఫొటోషూట్ ప్రచురితమైంది. దీనిపై సోషల్ మీడియాలో అనుకూలంగా, వ్యతిరేకంగా స్పందనలు వచ్చాయి.

అయితే, ఇందులో విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఫొటోలను ఎగతాళి చేస్తూ మీమ్‌లు, జోకులు పుష్కలంగా సాగాయి.

ఈ హీరో పురుషులను కించపరిచాడని చాలామంది విమర్శించారు. ఇది చాలదన్నట్లు మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.

భిన్నమైన వ్యక్తిత్వం

రణ్‌వీర్‌ సింగ్ సంప్రదాయ సినిమా స్టార్ కాదు. ఆయనలో అంతులేని ఎనర్జీ ఉంటుంది. చాలా విలాసంగా, స్టైల్‌గా, ఫ్యాషన్‌గా కనిపిస్తారు. వెల్వెట్ ప్యాంటు, సీక్విన్ టర్టినెక్స్, రకరకాల ఆభరణాలతో దర్శనమిస్తుంటారు.

మరో మాటలో చెప్పాలంటే, 'పేపర్' మ్యాగజైన్ అభిప్రాయం ప్రకారం ''సింగ్ సంప్రదాయ భారతీయ సమాజపపు పురుషులలో ఉండే ప్రతి మూస ధోరణిని ఆయన ఆచరణలో సవాల్ చేశారు’’

"ఆయన ఆదర్శవంతమైన పురుష రూపంతో ఉంటారు. కానీ ఆండ్రోజినీ (స్త్రీ పురుష లక్షణాలు)కి సరిపోయే దుస్తులు ధరిస్తారు. బిగుసుకుపోయినట్లు ఉండరు. సెక్స్ గురించి స్వేచ్ఛగా మాట్లాడతారు. సగటు భారతీయ మగవాళ్ల స్వభావానికి ఆయన సరిపోడు. ఇది చాలామంది పురుషులకు ఆందోళన కలిగిస్తుంది, అసౌకర్యానికి గురిచేస్తుంది" అని టఫ్ట్స్ యూనివర్శిటీలో లిటరేచర్ అండ్ సెక్సువాలిటీ మీద పీహెచ్‌డీ చేస్తున్న రాహుల్ సేన్ అన్నారు.

రణ్‌వీర్‌ సింగ్ పై వచ్చిన ఆరోణలు, విమర్శలు, మెచ్చుకోళ్లు భారతదేశంలోని తీవ్రమైన నైతిక గందరగోళానికి అద్దం పడతాయి. ఇండియాలో ప్రజలు ఉదార, సంప్రదాయవాద వైఖరులు సమ్మేళనంగా కనిపిస్తారు. ఇండియాలో చాలా ఆలయాల్లో శృంగారానికి సంబంధించిన చిత్రాలు కనిపిస్తుంటాయి. ప్రపంచంలోనే పురాతనమైన భారతీయ గ్రంథాలలో కామసూత్ర లాంటివి కూడా ఉన్నాయి.

మధు సప్రే, మిలింద్ సోమన్

నగ్నత్వం కొత్త కాదు

ఒక సినిమా మ్యాగజైన్ కోసం నటి ప్రొతిమా బేడీ (ప్రతిమా బేడీ) 1974లో ముంబయి బీచ్‌లో నగ్నంగా పరుగెత్తారు. వాస్తవానికి భారతదేశంలో నగ్నత్వం అనేది ఎవరికీ తెలియని కొత్త విషయమమీ కాదు.

ఒంటికి బూడిద రాసుకున్న వేలమంది హిందూ సాధువులు కుంభమేళాలాంటి మతపరమైన కార్యక్రమాల్లో నగ్నంగా పాల్గొంటుంటారు.

''ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లు పురుషులతో నిండిపోయాయి. అనేకమంది మగవాళ్లు శృంగారపరంగా రెచ్చగొట్టే భంగిమలలో ఫొటోలు తీసుకుని పోస్టులు పెడుతుంటారు'' అని మస్కులర్ ఇండియా అనే పుస్తక రచయిత మిషెల్ బాస్ అన్నారు.

"వారిలో కొందరికి పదివేల నుండి పదిలక్షల మంది కంటే ఎక్కువమంది ఫాలోయర్లు ఉన్నారు. వారి ఫొటోలకు అశ్లీల భాషలో కొన్ని రియాక్షన్స్ వస్తుంటాయి. కొంతమంది వావ్ అని, మరికొంతమంది వివిధ భావాలను వ్యక్తపరిచే ఎమోజీలతో స్పందిస్తారు'' అని మిషెల్ బాస్ అన్నారు.

https://www.instagram.com/p/CgSMiQIpfOz/?utm_source=ig_web_copy_link

చాలామంది బాలీవుడ్ హీరోలు యాక్షన్ సన్నివేశాలలో చొక్కాలు విప్పి నటిస్తుంటారు.

సింగ్ లాంటి కొంతమంది భారతీయ పురుషులు సంప్రదాయకంగా శరీరాన్ని ప్రదర్శించే విధానాలను పక్కకు నెట్టి 1970ల నాటి తరహాలో నగ్నంగా ఫొటోలకు పోజులిస్తుంటారు. ఇలాంటి సందర్భాలలో స్త్రీల తరహాలో పురుషులు కూడా తమ శరీరాన్ని ప్రదర్శించడంపై విమర్శలు వినిపిస్తుంటాయి.

కొందరు మాత్రం ఈ వివాదాన్ని పనికిమాలిన విషయంగా చూస్తారు. "నాకు ఈ వివాదం అర్థం కాలేదు. నగ్నత్వం అనేది భారతదేశానికి కొత్త కాదు. రణవీర్ సింగ్ విషయానికి వస్తే, అది అతని శరీరం, అతని ఇష్టం'' అని ప్రముఖ రచయిత శోభా డే అన్నారు.

మోరల్ పోలీసింగ్

ప్రముఖ చిత్రకారులు ఎంఎఫ్ హుస్సేన్ వేసిన నగ్న దేవతల పెయింటింగ్‌లు, అక్బర్ పదమ్‌సీ లాంటివాళ్లు వేసిన స్త్రీ స్థనం మీద పురుషుడు చేతులు వేసినట్లు కనిపించే చిత్రాలు వివాదాస్పదం అయ్యాయి.

నగ్నత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ సినిమా సెట్లకు నిప్పుపెట్టడం, ప్రదర్శనలను, నాటకాలను అడ్డుకోవడం తరచూ కనిపించే దృశ్యం.

అయితే, మగవాళ్లు నగ్నంగా తమ దేహాన్ని చూపించడం రణ్‌వీర్ సింగ్‌తోనే మొదలు కాలేదు. 1995లో మిలింద్ సోమన్, మధు సప్రే లు నగ్నంగా కనిపించారు.

శరీరం మీద దుస్తులు లేకుండా, ఒక కొండచిలువను పెట్టుకుని ఓ షూ కంపెనీ అడ్వర్టయిజ్‌మెంట్‌లో వారిద్దరూ పాల్గొన్నారు.

అశ్లీల ప్రదర్శన చేశారంటూ వారిపై కేసు నమోదయింది. 14 సంవత్సరాల పాటు న్యాయస్థానంలో పోరాడాల్సి వచ్చింది. తర్వాత వాళ్లను నిర్దోషులుగా గుర్తించారు.

''మధు సప్రే విదేశాలకు వెళ్లిపోయారు. షూబ్రాండ్ మూతపడింది. ఆ కొండ చిలువ ఏమయిందో ఎవరికి తెలుసు''అని బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అంబి పరమేశ్వరన్ వ్యాఖ్యానించారు.

గందరగోళం

అశ్లీల అడ్వర్టయిజ్‌మెంట్లపై ముంబైకి చెందిన అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ వాచ్‌డాగ్‌కు ప్రజల ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.

గత నవంబర్‌లో ఇలాంటివి రెండు ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఒకటి లోదుస్తులను బహిర్గతం చేస్తున్న మహిళల గురించి కాగా, రెండోది ఇద్దరు మహిళలు తమ లో దుస్తులను ఒకరికొకరు చూపించడానికి టీ షర్టులు విప్పేసే దృశ్యాలున్న అడ్వర్టయిజ్‌మెంట్.

ఈ రెండు ఫిర్యాదులను వాచ్‌డాగ్ తోసిపుచ్చింది.

"ఇక్కడ మరింత స్వేచ్ఛతో పాటు, మరింత గందరగోళం కూడా కనిపిస్తుంది. అదే సమయంలో అసహనంగా కనిపించే నైతిక దళం కూడా ఉంది. తీవ్రమైన నైతిక గందరగోళం మనందరికి ఎదురవుతుంటుంది'' అని 'ట్రాన్స్‌లేటింగ్ డిజైర్: ది పాలిటిక్స్ ఆఫ్ జెండర్ అండ్ కల్చర్ ఇన్ ఇండియా’ పుస్తక రచయిత బృందాబోస్ అన్నారు.

రెండు సంవత్సరాల కిందట చెన్నైకి చెందిన ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ జి.వెంకట్ రామ్ ఈ గందరగోళానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. 'బాడీ పాజిటివిటీ’ ఉద్యమంలో భాగంగా ఆయన ఒక టాటూ వేసుకున్న యువతిని నగ్నంగా ఫొటో తీశారు. అన్ని రకాల శారీరక ఆకారాలను ఆమోదించాలని ఈ ఉద్యమం డిమాండ్ చేస్తుంది.

ఆయన ధైర్యాన్ని కూడగట్టుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ సోషల్ మీడియాలో ఆయనకు 90వేలమంది ఫాలోయర్లు ఉన్నారు.

"అది చాలామందికి నచ్చింది. కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ మీద మాకు చాలా గౌరవం ఉండేది. కానీ, మీరు ఇలా ఎలా చేశారు అని కొందరు ప్రశ్నించారు'' అన్నారు రామ్ .

ఈ సందర్భంగా కొన్ని చిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకే రోజులో ఆయన ఫాలోయర్లలో 2,500మంది అన్ ఫాలో కాగా, 8,000మంది కొత్తగా వచ్చి చేరారు.

"అది సునామీలా ఉంది. ప్రజలు గుంపులు గుంపులుగా నన్ను ఫాలో కావడం మొదలుపెట్టారు. కొంతమంది అన్‌ఫాలో అయ్యారు. టీనేజర్లు ఈ షూట్ గురించి ఆసక్తి వ్యక్తం చేశారు. ఇది ఒక అస్పష్టమైన అనుభవం'' అన్నారాయన.

ఈ ఏడాది 'బేర్’ అనే పేరుతో ఇద్దరు మోడళ్లతో ఒక సిరీస్‌ను రామ్ షూట్ చేశారు. అందులోని కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందరూ వాటిని బాగా రిసీవ్ చేసుకున్నారు. ట్రోలింగ్‌లు లేవు. ''ఫొటోలను సౌందర్యాత్మకంగా చిత్రిస్తున్న కారణంగా చాలామంది మంది మగ, ఆడ మోడళ్లు నగ్నంగా పోజులివ్వడానికి ముందుకొస్తున్నారు'' అన్నారు రామ్.

ఇప్పుడాయన మగ మోడళ్లతో నగ్న ఫొటో షూట్లకు సిద్ధమవుతున్నారు. ''సంప్రదాయ మీడియా, అడ్వర్టయిజ్‌‌మెంట్ల కన్నా, సోషల్ మీడియా మనలోని కళాత్మకతను స్వేచ్ఛగా ప్రదర్శించడానికి ఉపయోగపడుతోంది'' అని రామ్ అన్నారు.

రణ్‌వీర్ సింగ్ ది ఒక విలక్షణమైన వ్యక్తిత్వం

సగటు భారతీయుల వైఖరి

ఒకప్పుడు ప్లేబాయ్ పత్రికకు పోటీగా వచ్చిన డెబోనేర్ (ఇప్పుడది ప్రచురణలో లేదు) మేగజైన్ కు ఎడిటర్ గా పని చేసిన వినోద్ మెహతా, న్యూడిటీ, సెక్సువాలిటీల మీద భారతీయుల వైఖరి గురించి ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు.

ఎమర్జెన్సీ రోజుల్లో పత్రికల మీద ఆంక్షలుండేవి. ఒకసారి మెహతాకు దిల్లీ నుంచి పిలుపు వచ్చింది.

ఆయన ఎడిటర్‌గా పని చేస్తున్న డెబోనేర్ పత్రికలో సెంటర్ స్ప్రెడ్‌కు ఏ ఫొటో వాడాలన్న నిర్ణయంపై మంత్రి ఆయన్ను పిలిపించారు. ఈ పేజీలో సాధారణంగా మహిళల అర్థనగ్న ఫొటోలను ప్రచురిస్తుంటారు.

తదుపరి మేగజైన్‌లో ఏ ఫొటో వేయాలన్న దానిపై ఆయన మంత్రికి అరడజను ఫొటోలను చూపించారు .

''మంత్రిగారి కన్ను 90శాతం న్యూడ్‌గా ఉన్న ఫొటోపై పడింది. ఆయన దాన్ని తీసి పక్కనబెట్టుకున్నారు. అసలు సెంటర్ స్ప్రెడ్ పేజీని తీసేయమంటారా అని నేను అడిగాను. ఆయన ఒక్కసారిగా నో అన్నారు. కాస్త డీసెంట్‌గా ఉండేలా చూడండి చాలు అన్నారు'' అని మెహతా గుర్తు చేసుకున్నారు.

సదరు మంత్రి మెహతా అనుమతి లేకుండానే ఆ ఫొటోను తన దగ్గరే ఉంచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Does the Ranveer Singh nude photos controversy indicate a confusion of our moral values?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X