కుక్కల పేరుతో డబ్బులు మింగేశారా? కుక్క మాస్క్‌తో ప్రతిపక్ష నేత వినూత్న నిరసన!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖాండ్వా మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓ వంత సంఘటన చోటుచేసుకుంది. నగరంలో వీధి కుక్కుల నియంత్రణ, వాటి దాడి ఘటనలు విపరీతంగా పెరుగుతున్నాయంటూ ప్రతిపక్ష నేత దీపక్ రాథోడ్ ఓ వ్యక్తికి కుక్క మాస్క్ తొడిగి పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి తీసుకువచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నగరంలో వీధి కుక్కల భయం రోజురోజుకూ పెరుగుతోందని.. ప్రజల రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రూ.40 లక్షల నిధుల వినియోగంపై అనుమానాలు
ఈ సందర్భంగా కలెక్టర్‌కు దీపక్ రాథోడ్ ఓ వినతిపత్రం సమర్పించారు. గడిచిన నాలుగేళ్లలో వీధి కుక్కల సంతానోత్పత్తి నిరోధక శస్త్రచికిత్సల కోసం మున్సిపల్ కార్పొరేషన్ సుమారు రూ.40 లక్షల నిధులను ఖర్చు చేసిందని ఆయన వెల్లడించారు. అయితే ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ నగరంలో కుక్కల సంఖ్య తగ్గకపోగా.. వాటి సంతతి, వీధి కుక్కల దాడి ఘటనలు మరింత పెరుగుతున్నాయని ఆరోపించారు.

నాలుగేళ్లలో 13,225 కుక్క కాటు కేసులు
నగరంలో పిల్లలు, మహిళలు, వయోవృద్ధులు కుక్కల భయంతో గడపాల్సి వస్తోందని దీపక్ రాథోడ్ మండిపడ్డారు. అధికారిక రికార్డుల ప్రకారం గడిచి నాలుగేళ్లలో నగరంలో దాదాపు 13,225 మంది కుక్కు కాటుకు గురయ్యారని ఆయన తెలిపారు. స్టెరిలైజేషన్ కోసం లక్షల రూపాయలు వెచ్చించినప్పుడు ఈ స్థాయిలో కుక్కకాటు కేసులు నమోదు కావడం ఏమిటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
'మా పేరుతో అవినీతి జరిపారు'
ఈ నిరసన సమయంలో దీపక్ రాథోడ్ కుక్క మాస్క్ వేసుకున్న వ్యక్తి తరఫున ఓ వినూత్న రోల్ ప్లే చేశారు. "వీధికుక్కలు ఎంతో విశ్వసనీయమైనవి.. కానీ తమ పేరు మీద మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడటం వల్లే అవి కోపంతో ఉన్నాయి" అని దీపక్ రాథోడ్ వ్యాఖ్యానించారు. పేపర్లపై మాత్రమే స్టెరిలైజేషన్ పూర్తి చేసినట్లు చూపిస్తూ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
సమగ్ర విచారణ, ఎఫ్ఐఆర్ నమోదుకు డిమాండ్
ఈ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ, స్టెరిలైజ్ చేసిన ఏజెన్సీ అర్హతలు, అసలు ఎన్ని కుక్కలకు స్టెరిలైజేషన్ చేశారనే వివరాలపై సమగ్ర ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ ఆడిట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని కంపెనీకి టెండర్ కేటాయించినా లేదా నిధుల దుర్వినియోగానికి పాల్పడినా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ ఏజెన్సీపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
దర్యాప్తునకు ఆదేశించిన అధికారులు
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఈ ఫిర్యాదుపై ఖాండ్వా అదనపు కలెక్టర్ కాశీరామ్ బడోలే స్పందించారు. ప్రతిపక్ష నేత సమర్పించిన వినతిపత్రంపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు. దర్యాప్తులో ఏవైనా అక్రమాలు లేదా నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలితే నిబంధనల ప్రకారం బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
खंडवा, मध्य प्रदेश
— Gaurav Kumar (@gaurav1307kumar) August 18, 2026
खंडवा में आवारा कुत्तों के आतंक के विरोध में अनोखा प्रदर्शन, कुत्ते को देखने उमड़ी अधिकारियो औऱ स्थानीय लोगों की भीड़
शहर में बढ़ते आवारा कुत्तों के आतंक के विरोध में कलेक्ट्रेट में जनसुनवाई में एक व्यक्ति को कुत्ते का कॉस्ट्यूम पहनकर पहुंचा pic.twitter.com/KWo2erTvC0













Click it and Unblock the Notifications