కాశ్మీర్ సీఎంగా ముస్లీం: పీడీపీ నేత, బీజేపీ నేతపై ఫైరింగ్
శ్రీనగర్: త్వరలో ఎన్నికలు జరగనున్న జమ్ము కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయని, హిందూ నాయకుడిని జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయని, కానీ ముస్లింలు మెజారిటీ సంఖ్యలో ఉన్న ఇక్కడ ముస్లిం నాయకుడే ముఖ్మమంత్రి కావాలని పీడీఎఫ్ నేత, షాంగస్ నియోజకవర్గ ఎమ్మెల్యే పీర్ మన్సూర్ వ్యాఖ్యానించారు.
దక్షిణ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన కొందరు నేతలు ఈ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపించారు. అలాంటి పార్టీలకు ఓటు వేయవద్దని ప్రజలకు సూచించారు. బీజేపీ హిందు సీఎం కోసం ప్రయత్నిస్తుందని, ఆ పార్టీకి ఓటేయవద్దన్నారు.
కాగా, ఆయన వ్యాఖ్యలు పీడీపీని చిక్కుల్లోకి నెట్టాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, అవి ఆయన సొంత అభిప్రాయాలని పీడీఎఫ్ అధికార ప్రతినిధి నయీమ్ అక్తర్ వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, ఆయన వ్యాఖ్యల పైన తాము రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే... వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ తమ పార్టీ, బీజేపీల మధ్యనే ఉంటుందని, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసినట్లే అవుతుందని పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించడం గమనార్హం. జమ్ము కాశ్మీర్‌లో 87 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 25వ తేదీ నుండి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి.
ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 25, డిసెంబర్ 2, డిసెంబర్ 9, డిసెంబర్ 1, డిసెంబర్ 20 తేదీలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 23న జరగనుంది.
బీజేపీ అభ్యర్థిపై తీవ్రవాదుల కాల్పులు
కుల్గాం నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గులాం హసన్ జర్గార్ పైన దక్షిణ కాశ్మీర్‌లోని ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని తీవ్రవాదులు కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తూ ఆయన దాని నుండి తప్పించుకున్నారు. శ్రీనగర్ నుండి కుల్గాం జిల్లా బోగుండ్‌లోని నివాసం వద్దకు చేరుకున్న సమయంలో మంగళవారం రాత్రి తీవ్రవాదులు రెండుసార్లు తన పైన కాల్పులు జరిపారని గులాం హసన్ తెలిపారు. తనను తాను రక్షించుకున్నానని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications