• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Draupadi Murmu: క్లర్క్‌ నుంచి రాష్ట్రపతి పదవికి పోటీ వరకు.. గిరిజన నేత ప్రస్థానం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

భారత రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్లు జూన్ 29 వరకు కొనసాగుతాయి. జూలై 18న ఓటింగ్ నిర్వహించి, జూలై 21న ఫలితాలు ప్రకటిస్తారు. ఇప్పటికే, అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థులను ప్రకటించాయి.

గత ఎన్నికల్లో అప్పటి బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను బీజేపీ నామినేట్ చేయగా, ఈసారి ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును రంగంలోకి దింపింది.

ద్రౌపది ముర్ము ఝార్ఖండ్‌కు తొలి మహిళా గవర్నర్, గిరిజన గవర్నర్ కూడా.

Draupadi Murmu biography

పదవీ విరమణ తరువాత ఆమె తన సొంత రాష్ట్రం ఒడిశాలో మయూర్‌భంజ్ జిల్లాలోని రాయంగ్‌పూర్‌లో నివసిస్తున్నారు. ఇది ఆమె స్వగ్రామం బైదాపోసిలోని బ్లాక్ ప్రధాన కార్యాలయం.

ఝార్ఖండ్ గవర్నర్‌గా పదవీ కాలం పైబడి (ఆరేళ్లకు పైగా) ఆమె పనిచేశారు.

ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ద్రౌపది ముర్ము భారతదేశానికి తొలి గిరిజన రాష్ట్రపతి కాగలరు. రెండో మహిళా రాష్ట్రపతి కూడా. ఎన్‌డీఏ ఓట్ల పరంగా చూస్తే ఆమె విజయానికి చేరువలో ఉన్నారు.

ప్రతిపక్ష పార్టీలు యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి పదవికి నామినేట్ చేశాయి. మాజీ ఐఏఎస్ అధికారి యశ్వంత్ సిన్హా ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ స్థానం నుంచి బీజేపీ లోక్‌సభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. చాలాకాలం పాటు ఆయన బీజేపీలోనే ఉన్నారు. కానీ, ఈ మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోదీపై పలుమార్లు విముఖత ప్రదర్శించారు. ఆయన విధానాలను వ్యతిరేకించారు. దాంతో, పార్టీ విడిచిపెట్టాల్సి వచ్చింది.

తరువాత యశ్వంత సిన్హా, మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఆయన కుమారుడు, హజారీబాగ్ లోక్‌సభ సిట్టింగ్ ఎంపీ జయంత్ సిన్హా ఇప్పటికీ బీజేపీలోనే కొనసాగుతున్నారు.

భారత రాష్ట్రపతి ఎన్నికలో ప్రధాన అభ్యర్థులిద్దరూ ఝార్ఖండ్‌కు చెందిన వారు కావడం ఇదే మొదటిసారి. దీంతో ఈ చిన్న రాష్ట్రంపై అందరి దృష్టి పడింది.

ద్రౌపది ముర్ము ఎందుకు ప్రత్యేకం

జూన్ 21 సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్‌డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించారు.

అప్పటికి ఆమె రాయంగ్‌పూర్ (ఒడిశా)లోని తన ఇంట్లో ఉన్నారు. జూన్ 20న తన 64వ పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకొన్నారు. సరిగ్గా 24 గంటల్లో బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తుందని ఆమె ఊహించి ఉండరు. ఆ తరువాత ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు.

"రాష్ట్రపతి పదవికి నన్ను నామినేట్ చేసినందుకు నాకు చాలా ఆశ్చర్యం, సంతోషం కలిగింది. టీవీ ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. రాష్ట్రపతి పదవి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి. దీనికి నేను ఎన్నికైతే రాజకీయాలకు అతీతంగా దేశ ప్రజల కోసం పనిచేస్తాను. రాజ్యాంగ నిబంధనలు, హక్కుల ప్రకారం పనిచేస్తాను. ప్రస్తుతానికి ఇంతకన్నా ఏమీ చెప్పలేను" అని ఆమె మీడియాతో అన్నారు.

అయితే, బీజేపీ ఆమె పేరును నామినేట్ చేయవచ్చనే ఊహాగానాలు ముందు నుంచీ వినిపిస్తూనే ఉన్నాయి. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆమె పేరు వినిపించింది. కానీ రామ్‌నాథ్ కోవింద్‌ను బీజేపీ నామినేట్ చేసింది. ఆయన రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు కూడా. ఆయన పదవీ కాలం జూలై 24తో ముగియనుంది.

గుమస్తాగా కెరీర్ ప్రారంభించి..

ద్రౌపది ముర్ము, 1979లో భువనేశ్వర్‌లోని రమాదేవి వుమెన్స్ కాలేజీ నుంచి బీఏ పాస్ అయిన తరువాత, ఒడిశా ప్రభుత్వంలో క్లర్క్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. నీటిపారుదల, ఇంధన శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు.

తరువాతి కాలంలో ఆమె ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. రాయంగ్‌పూర్‌లోని శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో గౌరవ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. కష్టించి పనిచేసే ఉద్యోగిగా ఆమె గుర్తింపు పొందారు.

రాజకీయ జీవితం

ద్రౌపది ముర్ము 1997లో వార్డు కౌన్సెలర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రాయిరంగపూర్ నగర పంచాయతీ ఎన్నికలలో వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. నగర పంచాయతీ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు.

తరువాత, రాయరంగ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు (2000, 2009లలో) బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మొదటి సారి ఎమ్మెల్యే అయిన తరువాత, 2000 నుంచి 2004 వరకు నవీన్ పట్నాయక్ క్యాబినెట్‌లో (బీజేడీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం) వివిధ శాఖల్లో మంత్రిగా వ్యవహరించారు. వాణిజ్యం, రవాణా, మత్స్య శాఖలతో పాటు జంతు వనరుల శాఖలను నిర్వహించారు.

మంత్రిగా ఉండి కూడా ఆమె నిరాడంబర జీవితాన్ని గడిపారు. ఆమెకు సొంత వాహనం కూడా లేదు.

ఒడిశాలోని ఉత్తమ ఎమ్మెల్యేలకు అందించే నీలకంఠ అవార్డును ఆమె అందుకున్నారు.

రెండుసార్లు బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వ్యవహరించారు. 2002 నుంచి 2009 వరకు, 2013 నుంచి 2015 ఏప్రిల్ వరకు ఈ మోర్చా జాతీయ కార్యవర్గంలో సభ్యురాలిగా ఉన్నారు.

దీని తరువాత ఆమెను జార్ఖండ్ గవర్నర్‌గా నామినేట్ చేశారు. క్రమంగా బీజేపీ క్రియాశీల రాజకీయాల నుంచి దూరమయ్యారు.

ఝార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్

2015 మే 18న ద్రౌపది ముర్ము ఝార్ఖండ్‌కు తొలి మహిళ, గిరిజన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు సంవత్సరాలకు పైబడి నెలా 18 రోజుల పాటు ఈ పదవిలో కొనసాగారు.

జార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నికైన మొదటి గవర్నర్ ఆమె. అయిదేళ్ల పదవీ కాలం పూర్తయిన తరువాత కూడా గవర్నర్‌గా కొనసాగారు.

తన పదవీ కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Draupadi Murmu: From clerk to presidential candidate, know the Tribal leader career
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X