ప్రజల కష్టాలు, రైల్లో నీటి తరలింపు: మోడీకి కేజ్రీ ప్రశంస
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు ప్రశంసలు గుప్పించారు. చాలా రోజులుగా బిజెపి, ఏఏపీ మధ్య ఉప్పునిప్పులా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రతి ఇష్యూకి ప్రధాని మోడీయే కారణమనే విధంగా కేజ్రీవాల్ విమర్శలు ఉన్నాయనే విమర్శలు చాలారోజులుగా వస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీని కేజ్రీవాల్ పొగడటం గమనార్హం. మహారాష్ట్రలోని మరారఠ్వాడా ప్రాంతంలో ఉన్న లాతూరు మునుపెన్నడూ లేనంత తీవ్ర కరవుతో అల్లాడిపోతోంది. ప్రజలకు, పశువులకు గుక్కెడు తాగునీరు సైతం కరువైపోయింది.
దీంతో సుమారు లక్షల లీటర్ల నీటిని రైలు ట్యాంకర్ల ద్వారా తరలించడానికి కేంద్రం చర్యలు చేపడుతోంది. లాతూరుకు 50 ట్యాంకర్లతో నీటి రైలును నడుపుతున్నందుకు కేజ్రీవాల్ ప్రధాని మోడీని ప్రశంసించారు.

అదే సమయంలో తాము కూడా సహకరిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. లాతూరు ప్రజలకు సాయం చేయడానికి ఆయన ముందుకొచ్చారు. ఢిల్లీ తరఫున లాతూరులోని సోదరసోదరీమణులకి రెండు నెలల పాటు రోజుకి 10 లక్షల లీటర్ల నీళ్లు ఇస్తామని కేజ్రీవాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
మరఠ్వాడా ప్రాంతంలోని లాతూర్‌లో నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో రవాణా కోసం కావలసినన్నిసార్లు ట్యాంకర్లతో నీటి రైళ్లను నడుపుతామని రైల్వే అధికారులు ప్రకటించారు. నీటితో మీరజ్ నుంచి బయలుదేరే రైలు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లాతూర్ ప్రజలకు నీటిని అందిస్తుంది.












Click it and Unblock the Notifications