అసోంలో ప్రకంపనలు: తీవ్రత 5.4గా నమోదు
గౌహతి: అస్సాం రాష్ట్రంలో బుధవారం ఉదయం భూమి కంపించింది. గౌహతి పరిసర ప్రాంతాల్లో 15 నుంచి 20 సెకన్లపాటు ప్రకంపనలు వచ్చినట్లు గౌహతిలోని భారత వాతావరణ కేంద్రం ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రకంపనల తీవ్రత 5.4గా రిక్టర్ స్కేలుపై నమోదైనట్లు వారు తెలిపారు.
దీని వల్ల ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్ల తలుపులు, కిటికీలు కొన్ని సెకన్లపాటు గట్టిగా కదిలాయని పేర్కొన్నారు. అయితే భూకంపం స్వల్పంగా ఉన్నందున ప్రాణ నష్టం సంభవించే అవకాశం లేదని, అలాంటి సమాచారం కూడా తమకు అందలేదని అధికారులు తెలిపారు.

బుధవారం ఉదయం 9.46 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని తెలిపారు. కర్బి ప్రాంతం భూకంప కేంద్రంగా 20 కిలో మీటర్ల లోతులో, 26.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం వైపు, 93.5 తూర్పు రేఖాంశం వైపు భూకంపం ప్రభావం చూపిందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కూడా అసోంలో రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
ఈ భూకంపం 34 కిలో మీటర్ల లోతు, 26.5 డిగ్రీల అక్షాంశం ఉత్తరం వైపు, 93.1 డిగ్రీల రేఖాంశం తూర్పు వైపు నాగోన్ జిల్లా కేంద్రంగా వ్యాపించిందని అధికారులు తెలిపారు. ఈ భూకంపం సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదని వాతావరణ అధికారులు తెలిపారు. అయితే ఏప్రిల్ 16న రాష్ట్రంలో సంభవించిన భూకంపం వల్ల ఒక చిన్నారి మరణించిందని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications