బంగాళాఖాతంలో అల్పపీడనం: ఇటు అదరగొడుతోన్న ఎండ.. అటు భారీ వర్షాలు
న్యూఢిల్లీ: దేశంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అనేక రాష్ట్రాల్లో ఎండ అదరగొడుతోంటే.. మరికొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనితోపాటు మూడున్నర కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్‌లల్లో ఈ నెల 9, 10 తేదీల మధ్య భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. మరో 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, వాయుగుండంగా మారొచ్చని చెప్పారు. ఇది మరింత బలపడి, విస్తరించగలిగితే.. ఒడిశా, ఏపీ ఉత్తర ప్రాంతంపైనా ప్రభావం చూపుతుందని, ఆయా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం లేకోలేదని చెప్పారు. కొద్దిరోజుల కిందటే విశాఖపట్నంలో భారీ వర్షాలు కురవడానికి ఈ తరహా వాతవరణమే కారణమని పేర్కొన్నారు.

కాగా రాష్ట్రవ్యాప్తంగా ఎండలు అదరగొడుతూనే ఉన్నాయి. అనేక జిల్లాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయవాడ, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత, చిత్తూరు-45.5, విశాఖపట్నం-45.3 డిగ్రీల మేర టెంపరేచర్ రికార్డయింది. కర్నూలు-44.5, తూర్పుగోదావరి 44.5, కృష్ణా జిల్లా 44.6, నెల్లూరులో 45.3, విజయనగరం- 45 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగొచ్చని అధికారులు హెచ్చరించారు.
వచ్చే 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని వెల్లడించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. గురు, శుక్ర వారాల్లో సముద్రం మీదుగా బలమైన ఈదురుగాలులు వీస్తాయని, వాటికి ఎండ తీవ్రత తోడు కావడం వల్ల వడగాడ్పులుగా మారుతాయని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని అంటున్నారు.












Click it and Unblock the Notifications