లిక్కర్ స్కాంలో చిక్కిన బిగ్ ఫిష్..!!
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. రూ.2,100 కోట్ల లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్ట్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఆయన పుట్టినరోజు నాడే ఈ అరెస్ట్ చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ ఉదయం భూపేష్ బఘేల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా కొన్ని డాక్యుమెంట్ల, ఇతర సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకుంది. మద్యం కుంభకోణంలో చైతన్య బఘేల్ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణకు రావడంతో ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ 19 కింద అరెస్ట్ చేశారు. చైతన్య బఘేల్ ప్రమేయం ఉన్నట్లుగా కొత్త ఆధారాలు లభించడం, విచారణకు ఆయన సహకరించకపోవడంతోనే అరెస్టు చేయాల్సి వచ్చిందని ఈడీ అధికారులు వెల్లడించారు. విచారణ సందర్భంగా మరిన్ని వివరాలను రాబట్టుకుంటామని చెప్పారు.
ఈ అరెస్ట్ రాజకీయంగా దుమారం రేపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఘాటు విమర్శలు చేశారు. దీనికి భయపడబోమని, తల వంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఒకవైపు బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని, మరోవైపు ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష నాయకులను అణిచివేస్తున్నారని విమర్శించారు.
తాము ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థను విశ్వసిస్తామని, ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తామని భూపేష్ బఘేల్ స్పష్టం చేశారు. తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఈడీ దాడులు జరగడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు.
చైతన్య బఘేల్‌ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. ఈడీని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని పేర్కొంది.
రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల చివరి రోజున కీలక సమస్య నుండి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ దాడి చేశారని భూపేష్ బఘేల్ ఆరోపించారు. అదానీ కోసం చెట్లు నరికివేత అంశాన్ని లేవనెత్తకుండా అడ్డుకోవడానికి ఈడీని పంపారని ఆయన విమర్శించారు.
2019 నుంచి 2022 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ స్కామ్ ద్వారా ఒక లిక్కర్ సిండికేట్ రూ. 2,100 కోట్లకు పైగా అక్రమ లాభాలు గడించిందని ఆరోపణలు ఉన్నాయి. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని ఈడీ పేర్కొంది.
ఈ కేసులో పలువురిని అరెస్టు చేశారు. వారిలో మాజీ మంత్రి కవాసి లఖ్మా, రాయపూర్ మేయర్ అజాజ్ ధేబర్ సోదరుడు అన్వర్ ధేబర్, మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ టూటేజా, ఐటీఎస్ అధికారి అరుణ్‌పతి త్రిపాఠి ఉన్నారు. ఇప్పటివరకు రూ.205 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు.












Click it and Unblock the Notifications