మాజీ హోంమంత్రికి ఈడీ షాక్: మనీలాండరింగ్ కేసులో రూ. 4.2 కోట్ల ఆస్తులు జప్తు
ముంబై: మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు సంబంధించిన సుమారు రూ. 4.2 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం అటాచ్ చేసింది. అనిత్ దేశ్‌ముఖ్‌పై నమోదైన కేసు విచారణకు హాజరుకావాలని ఇప్పటికే ఈడీ పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ.. మాజీ మంత్రి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఈ క్రమంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టీ(పీఎంఎల్ఏ) కింద అనిత్ దేశ్‌ముఖ్ ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అనిత్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో బార్లు, రెస్టారెంట్ల నుంచి అక్రమ వసూళ్లతోపాటు పోలీసు శాఖలో బదిల్లీల్లోనూ అవకతవకలకు, అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ ఆయనపై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది.

విచారణకు హాజరుకావాలంటూ పలుమార్లు నోటీసులు పంపినా ఈ మాజీ మంత్రి స్పందించలేదు. అనిత్ దేశ్‌ముఖ్ తోపాటు కుమారుడు హృషికేశ్, భార్యకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే, వీరి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం అనిత్ దేశ్‌ముఖ్‌కు సంబంధించిన రూ. 4.2 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.
కాగా, తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని అనిల్ దేశ్‌ముఖ్ చెబుతున్నారు. తనపై ఈడీ అన్యాయంగా చర్యలు తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు. ఈ కేసు విషయంలో అనిత్ దేశ్‌ముఖ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది ఇలావుంటే, ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండైన పోలీసు అధికారి సచిన్ వాజేను అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్న సమయంలో ఆదేశించారని మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పరంబీర్ సింగ్ హైకోర్టును ఆశ్రయించడంతో.. ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కూడా ఇప్పటికే విచారణ ప్రారంభించింది.












Click it and Unblock the Notifications