LYCA Productionsపై ఈడీ మెరుపుదాడి- కోలీవుడ్ ఉక్కిరిబిక్కిరి
చెన్నై: తమిళనాడులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మెరుపు దాడులకు దిగారు. ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌పై దాడులు సాగిస్తోన్నారు. ఈ తెల్లవారు జాము నుంచి ఈ దాడులు, సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని లైకా ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయంతో పాటు ఆ సంస్థ యాజమానుల నివాసాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు తనిఖీలు సాగిస్తోన్నారు.
లైకా ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత ఏ సుబాస్కరన్ నివాసంలో కూడా ఈడీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. భారీ సినిమాలకు పెట్టింది పేరు లైకా ప్రొడక్షన్స్. వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమాలను తీసే నిర్మాణ సంస్థగా గుర్తింపు ఉంది. ఈ మధ్యే విడుదలైన పొన్నియన్ సెల్వన్-2ను నిర్మించింది ఈ సంస్థే. అరుణ్ విజయ్ హీరోగా ప్రస్తుతం మిషన్ ఛాప్టర్ సినిమాను నిర్మిస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటోన్న ఇండియన్ 2 సినిమా కూడా లైకా ప్రొడక్షన్స్‌కు చెందినదే. భారతీయుడుకు సీక్వెల్‌గా శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. కమల్ హాసన్ హీరో. ఐశ్వర్య రజినీకాంత్, విష్ణువిశాల్, విక్రాంత్‌లతో లాల్ సలామ్, అజిత్ కుమార్‌తో విదా ముయార్చి సినిమాలను తెరకెక్కిస్తోంది. ఆయా సినిమాలన్నీ కూడా సెట్స్‌పై ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు లైకా ప్రొడక్షన్స్ కార్యాలయాలపై ఏకకాలంలో మెరుపుదాడులకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ అనూహ్య ఘటనతో తమిళ చిత్ర పరిశ్రమల ఉలిక్కి పడింది. దాడుల సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications