అనంతపురం, కర్నూల్ జిల్లాల బార్డర్ లో హైఅలర్ట్, కొత్తగా 18 చెక్ పోస్టులు, బళ్లారి ఎఫెక్ట్ తో !
బళ్లారి/అనంతపురం/కర్నూల్: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ దగ్గర పడటంతో రాజకీయ నాయకుల్లో టెన్షన్ మొదలైయ్యింది. ఎలాగైనా పార్టీ టిక్కెట్ సంపాధించి ఎమ్మెల్యే అయిపోవాలని, సొంత పార్టీ అధికారంలోకి వస్తే వీలైతే మంత్రి అయిపోవాలి అని చాలా మంది ఇప్పటి నుంచి కలలు కంటున్నారు. ఇప్పటికే పార్టీ టిక్కెట్లు దక్కించుకున్న వారు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో పోలీసులకు చేతినిండా పనిపడింది. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు రాష్ట్రాల మీద పోలీసులు నిఘా వేశారు. కర్ణాటక సరిహద్దులోని బళ్లారి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా 18 చెక్ పోస్టులు ఏర్పాటు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. బళ్లారి జిల్లా ఎస్పీ రంజిత్ కుమార్ దగ్గర ఉండి చెక్ పోస్టులు ఏర్పాటు చేయించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని బళ్లారి జిల్లా ఎస్పీ రంజిత్ కుమార్ ఆ జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

కర్ణాటక- ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని బళ్లారి జిల్లాలో పలు ప్రాంతాల్లో 24 గంటలు సోదాలు చెయ్యడానికి 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో బళ్లారి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండటంతో ఆ ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. వీటిలో అంతరాష్ట్ర చెక్ పోస్టులు 11 ఉండటం విశేషం. ప్రతిరోజు 24 గంటలు కర్ణాటకలోకి వచ్చి వెలుతున్న వాహనాలు మొత్తం పరిశీలించాలని జిల్లా ఎస్పీ రంజిత్ కుమార్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బళ్లారి జిల్లాకు అనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, కర్నూల్ జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసు శాఖ, ఎక్సైంజ్ శాఖ సీనియర్ అధికారులతో బళ్లారి జిల్లా కలెక్టర్ పవన్ కుమార్, జిల్లా పోలీసు ఎస్పీ రంజిత్ కుమార్ తదితరులు చర్చలు జరిపారు. బళ్లారి జిల్లాలో ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మీరు సహకరించాలని అనంతపురం, కర్నూల్ జిల్లా పోలీసు అధికారులు, సంబంధిత అధికారులకు బళ్లారి జిల్లా అధికారులు మనవి చేశారు. మొత్తం మీద బళ్లారి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా 18 కొత్త చెక్ పోస్టులు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications