బెంగాల్ లో ఉప ఎన్నికలు: షెడ్యూల్ విడుదల: మమత బెనర్జీ సత్తాకు అగ్నిపరీక్షే
పశ్చిమ బెంగాల్ లో అధికార మార్పిడి అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీకి వరుస షాకులను ఇస్తోందక్కడి ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పటికే ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయక్కడ. వ్యతిరేకంగా ప్రచారం చేసిన సెలెబ్రెటీలను కూడా వదలట్లేదు. కేసులు నమోదవుతున్నాయి.
ఈ పరిణామాల మధ్య మమత బెనర్జీకి మరో సవాల్ ఎదురైంది. పశ్చిమ బెంగాల్ లో మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికల తేదీలను ఖరారు చేసింది. ఈ నెల 24వ తేదీన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. రాత్రికి ఫలితాలు వెల్లడవుతాయి.

పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులు తమ పదవీ కాలం ముగియక ముందే రాజీనామాలు చేయడం వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. కిందటి నెల 8న సుఖేందు శేఖర్ రాయ్, 10న సుస్మితా దేవ్, 11న ప్రకాష్ చిక్ బరాక్ తమ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించారు. అవి ఆమోదం పొందాయి. ఈ ఎన్నికల ద్వారా నూతనంగా ఎంపికయ్యే ఎంపీలు 2029 ఆగస్టు, 2030 ఏప్రిల్ వరకు సభ్యులుగా కొనసాగుతారు.
పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 7 మంగళవారం నోటిఫికేషన్ జారీ అవుతుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ 14. 15 నాటికి నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 17వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. 24 పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం ఓట్లను లెక్కిస్తారు. 27వ తేదీ నాటికి ఉప ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా పూర్తవుతుంది.
ఉప ఎన్నికలను ఎటువంటి వివాదాలు లేకుండా, అత్యంత పారదర్శక పద్ధతిలో నిర్వహించడానికి, పోలింగ్ పర్యవేక్షణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక పర్యవేక్షక బృందాలను రంగంలోకి దించనుంది. నిష్పక్షపాత వాతావరణంలో ఈ కీలక ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా సరిపోవు భద్రతా సిబ్బంది, ప్రత్యేక పరిశీలకులను నియమిస్తున్నట్లు అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications