విజయ్ పార్టీకి ఊహించని షాక్: సెక్షన్ 128 కింద ఈసీకి..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్ దశకు చేరుకుంది. పోలింగ్‌కు కేవలం గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్న వేళ, రాష్ట్రంలో రాజకీయ హైడ్రామా ముదిరింది. ఒకవైపు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలి వెళ్తుండగా, మరోవైపు నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. సైలెన్స్ పిరియడ్ (Silence Period) లో నిబంధనలను బ్రేక్ చేసేందుకు టీవీకే వ్యూహాలు రచిస్తోందన్న ఆరోపణలు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చిచ్చు రేపుతున్నాయి.
పోలింగ్‌కు ముందు అమల్లో ఉండే 48 గంటల సైలెంట్ వ్యవధిని ఉల్లంఘిస్తూ.. ఏప్రిల్ 22న టీవీకే భారీ ఎత్తున ఆన్‌లైన్ ప్రచారానికి ప్లాన్ చేసిందంటూ ఎల్. దేవసాగాయం, పి. ఆదికేశవన్ తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 128 ప్రకారం, సైలెన్స్ పిరియడ్ లో ప్రచారం చేస్తే మూడు నెలల జైలు శిక్ష తప్పదని వారు గుర్తు చేశారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో సమన్వయంతో ప్రచారం చేయడం, పోలింగ్ బూత్‌లలో ఓటింగ్‌ను చిత్రీకరించడం వంటి నిషేధిత పనులకు టీవీకే సిద్ధమైందని ఫిర్యాదులో పేర్కొనడం కలకలం రేపుతోంది.

అనర్హత వేటు పడుతుందా?
ఈ ఫిర్యాదులో 1951 చట్టంలోని సెక్షన్ 123 (అవినీతి కార్యకలాపాలు) ను కూడా ప్రస్తావించారు. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని తేలితే, అభ్యర్థులు అనర్హతకు గురయ్యే ప్రమాదం ఉంది. టీవీకే తలపెట్టిన ఆన్‌లైన్ కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన పోలీసులు ఇప్పటికే తిరుచిరాపల్లి వంటి ప్రధాన నగరాల్లోని లాడ్జిలపై ఆకస్మిక దాడులు చేస్తూ, నిబంధనల అమలును పర్యవేక్షిస్తున్నారు.
యుద్ధ ప్రాతిపదికన పోలింగ్ ఏర్పాట్లు..
మరోవైపు, క్షేత్రస్థాయిలో ఎన్నికల యంత్రాంగం బుధవారం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,787 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 6 గంటలకల్లా సిబ్బంది బూత్‌లకు చేరుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈవీఎంలు (EVMs) సహా మొత్తం 117 రకాల ఎన్నికల సామగ్రిని పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది తమ పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నారు.
నటుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవి కావడంతో, అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు ప్రజల్లో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తమిళ జనం తీర్పు ఎటువైపో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడక తప్పదు.












Click it and Unblock the Notifications