వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Electoral bonds: ఎన్నికల బాండ్ల‌తో బీజేపీకే మేలు జరిగిందా? వీటిపై ఇన్ని ప్రశ్నలు ఎందుకు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎన్నికల బాండ్లు

భారత్‌లోని రాజకీయ పార్టీల అపారదర్శక ఆదాయ మార్గాల సమస్యకు పరిష్కారంగా ఎన్నికల బాండ్లను తీసుకొచ్చారు. అయితే, వీటిని ''ప్రజాస్వామ్యానికి దొడ్డిదారి’’గా చెబుతూ సుప్రీం కోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి.

ఎన్నికల బాండ్లను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు త్వరలో విచారణ మొదలుపెట్టనుంది. వడ్డీ రహిత ఈ బాండ్లను రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు తీసుకొచ్చారు.

2018లో ఈ బాండ్లను ప్రవేశపెట్టారు. కాలపరిమితితో, వడ్డీ రహితంగా ఈ బాండ్ల విలువ రూ. 1000 నుంచి రూ. కోటి వరకు ఉంటాయి. వీటిని ప్రభుత్వ బ్యాంకుల నుంచి కొనుగోలు చేయొచ్చు. వీటిని ఏడాది పొడవునా నిర్దేశించిన సమయాల్లో విక్రయిస్తుంటారు.

ఎన్నికల బాండ్లు

ప్రజలతోపాటు సంస్థలు కూడా ఈ బాండ్లను కొనుగోలుచేసి రాజకీయ పార్టీలకు విరాళంగా అందించొచ్చు. ఆ పార్టీలు 15 రోజుల్లోగా వీటిని బ్యాంకులో జమచేసి డబ్బులను పొందే వీలుంటుంది. అయితే, కేవలం గత పార్లమెంటు లేదా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక శాతం కంటే ఎక్కువ ఓట్లు పొందిన రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలే ఈ బాండ్లను పొందేలా నిబంధనలు తీసుకొచ్చారు.

19 విడతల్లో మొత్తంగా 1.15 బిలియన్ డాలర్ల (రూ. 9,407 కోట్లు) విలువైన ఎన్నికల బాండ్లను విక్రయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దీని నుంచి ఎక్కువ లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. 2019-20లో నాలుగింట మూడొంతుల నిధులు బీజేపీకే దక్కాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు దక్కింది కేవలం తొమ్మిది శాతమే.

ఏడు జాతీయ పార్టీలు కలిపి తమ ఆదాయంలో 62 శాతాన్ని 2019-20లో ఈ ఎన్నికల బాండ్ల ద్వారా సంపాదించాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది.

ఎన్నికల బాండ్లు

అక్రమ ఆదాయానికి కళ్లెం వేసేందుకు..

రాజకీయ పార్టీలకు నల్ల ధనం చేరకుండా అడ్డుకునేందుకు, పార్టీల ఆదాయ మార్గాల్లో పారదర్శకత కోసం ఈ బాండ్లను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, ఇప్పుడు పూర్తి విరుద్ధంగా ఈ బాండ్లు మారాయని విమర్శకులు అంటున్నారు. ఈ బాండ్ల చుట్టూ గోప్యత సంకెళ్లు ఉన్నాయని వారు విమర్శిస్తున్నారు.

అసలు ఈ బాండ్లు ఎవరు కొంటున్నారు? ఎవరికి వీటిని ఇస్తున్నారు? లాంటి వివరాలను ప్రజల ముందు ఉంచడం లేదు, అందుకే వీటిని రాజ్యాంగ విరుద్ధమైనవని విమర్శలు వస్తున్నాయని ఏడీఆర్ విశ్లేషించింది.

''అదే సమయంలో ఇక్కడ పూర్తిగా గోప్యత ఉందని అనుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ బ్యాంకుల దగ్గర అటు బాండ్లు కొంటున్నవారు, ఇటు తీసుకుంటున్న వారు.. ఇద్దరి వివరాలూ ఉంటున్నాయి. అంటే ప్రభుత్వం కావాలంటే ఈ వివరాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. లేదా విరాళాలు ఇచ్చే వారిని ప్రభావితం కూడా చేయొచ్చు’’ అని కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

''ఏదిఏమైనప్పటికీ అధికారంలో ఉండేవారికి ఈ బాండ్లు చాలా ప్రయోజనాలు ఇస్తాయి’’ అని ఏడీఆర్ సహ-వ్యవస్థాపకుడు జగ్‌దీప్ ఛోకర్ వ్యాఖ్యానించారు.

2017లో ఈ బాండ్లను మొదట ప్రవేశపెట్టినప్పుడు, వీటి వల్ల ఎన్నికల్లో పారదర్శకత కొరవడుతుందని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది. మరోవైపు అక్రమ నగదు రాజకీయాల్లోకి రాకుండా ఈ బాండ్లు అడ్డుకోలేవని కేంద్ర బ్యాంకు, న్యాయ మంత్రిత్వ శాఖలోని అధికారులతోపాటు కొందరు ఎంపీలు కూడా చెప్పారు. అయితే, ఏడాది తర్వాత ఎన్నికల సంఘం తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొంది. బాండ్లకు మద్దతు పలుకుతూ కొందరు ఎన్నికల కమిషనర్లు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కోర్టులు కూడా ఈ బాండ్లకు సంబంధించిన విచారణలను వాయిదావేస్తూ వచ్చాయి.

ఎన్నికల బాండ్లు

''ఎన్నికల బాండ్లతో ఓ అపారదర్శక విధానాన్ని ప్రభుత్వం చట్టబద్ధం చేసింది’’అని వాషింగ్టన్‌కు చెందిన కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌కు చెందిన మిలన్ వైష్ణవ్ వ్యాఖ్యానించారు.

''దాతలు ఎంత మొత్తంలోనైనా తమకు నచ్చిన పార్టీకి విరాళాలు అందించుకోవచ్చు. ఇక్కడ ఏ వర్గమూ తమ వివరాలు బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదు. దీన్ని పారదర్శక విధానంగా చెబుతున్నారు. నిజానికి ఇది పారదర్శకత అనే పదానికి కొత్త నిర్వచనంగా చూడొచ్చు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

రాజకీయ పార్టీల ఆదాయ మార్గాల్లో పారదర్శకత అవసరమనే అంశంతో అందరూ ఏకీభవిస్తున్నారు. ఎన్నికలు నానాటికీ చాలా ఖరీదైనవిగా మారుతున్నాయి. వీటికి చాలా వరకు ప్రైవేటు విరాళాలే ఆధారం. 2019 సార్వత్రిక ఎన్నికల ఖర్చు దాదాపు 7 బిలియన్ డాలర్లు (రూ.5,72,59 కోట్లు)గా అంచనాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత అంత మొత్తంలో ఎన్నికల కోసం ఖర్చు చేస్తోంది ఇక్కడే.

నానాటికీ ఇక్కడ ఓటు హక్కు పొందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో 90 కోట్ల మంది ఓటు హక్కు కోసం రిజిస్టర్ చేసుకున్నారు. 1952లో ఇది కేవలం 4 లక్షలు మాత్రమే. అంటే ఓటర్లకు చేరువయ్యేందుకు అభ్యర్థులు మరింత ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. చాలాచోట్ల మూడంచెల వ్యవస్థ (గ్రామ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం) అమలులో ఉంది. అంటే ఇక్కడ మూడంచెల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

ఏటా సమర్పిస్తుంటాయి.. కానీ,

రాజకీయ పార్టీలు ఏటా ఎన్నికల సంఘానికి తమ ఆదాయం, ఖర్చుల వివరాలు సమర్పిస్తుంటాయి. ఇక్కడ ''అన్‌నోన్ సోర్సెస్’’ పేరుతో ఒక ఆప్షన్ ఉంటుంది. దీని కిందే బాండ్ల వివరాలను కూడా చూపిస్తుంటారు. అయితే, 70 శాతం వరకు ఆదాయం ఇలానే వస్తోందని ఏడీఆర్ చెబుతోంది. ''ఈ బాండ్లతో ఇప్పటివరకు తీసుకొచ్చిన సంస్కరణలు దశాబ్దాల వెనక్కి వెళ్లిపోయాయి’’ అని వైష్ణవ్ వ్యాఖ్యనించారు.

అయితే, రాజకీయ పార్టీల అపారదర్శక ఆదాయ మార్గాలను శుభ్రం చేయడంలో ఈ బాండ్లు మెరుగ్గా పనిచేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా చెబుతున్నారు.

''ఇదివరకు రాజకీయ పార్టీల ఆదాయం మొత్తం సూట్‌కేసుల ద్వారా చేతులు మారేది. చాలా అక్రమ మార్గాలను పార్టీలు ఉపయోగించుకునేవి’’ అని ఆయన వివరించారు.

''రాజకీయ పార్టీల ఆదాయ మార్గాలు పారదర్శకంగా మారాలి. దీనిలో ఎలాంటి సందేహమూ లేదు. ఆ దిశగా పడిన చర్యలుగానే ఈ బాండ్లను చూడాలి’’ అని ఆయన చెప్పారు.

''ఇంకా మరికొన్ని సంస్కరణలు కూడా అసవరం. మరింత పారదర్శకత కూడా ఉండాలి. అయితే, ఈ బాండ్లను పనికిరానివిగా చెప్పడంలో అర్థమేలేదు. ఇదివరకటి కంటే పరిస్థితులు ఇప్పుడు చాలా మెరుగు అయ్యాయి’’ అని ఆయన చెప్పారు.

అయితే, అన్ని వైపుల నుంచీ వంద శాతం పారదర్శకత ఉంటే ఈ బాండ్లను కొనసాగించొచ్చని వైష్ణవ్ అంటున్నారు. ''ఇక్కడ పారదర్శకత అంటే ప్రజల ముందు వివరాలు ఉంచడం’’ అని ఆయన అన్నారు. అయితే, ఇక్కడ మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు. ''ముఖ్యంగా తెల్ల ధనంతోనే ఈ బాండ్లను కొనేలా చూడాలి. అదే సమయంలో తెల్లధనంతో ఈ బాండ్లు కొని థర్డ్ పార్టీకి నల్లధనంపై అమ్మకుండా చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన అన్నారు.

మొత్తంగానికి రాజకీయ పార్టీల ఆదాయ మార్గాల సంస్కరణ అనే మార్గం చాలా సుదీర్ఘమైనది. ఎన్నో సవాళ్లతో కూడుకున్నది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Electoral bonds: Has BJP benefited from electoral bonds? Why so many questions on these?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X