భారత్‌లో Eli Lilly :కొవిడ్ రోగుల్లో యాంటీబాడీలు పెంచే ఎలీ లిల్లీ కాక్‌టెయిల్ డ్రగ్‌కు DCGI ఆమోదం
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయ తీవ్రత తగ్గముఖం పడుతుండగా, మరో శుభవార్త వెలువడింది. కోవిడ్ నియంత్రణకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. మధ్యస్థ, స్వల్ప లక్షణాలున్న కొవిడ్ రోగుల్లో యాంటీబాడీలు పెంపొందించే కాక్ టెయిల్ డ్రగ్ కు భారత్ లో అనుమతి లభించింది. అమెరికా ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ తయారు చేసిన యాంటీబాడీ ఇంజక్షన్లకు దేశంలో ఆమోదం లభించింది.
ఎలీ లిల్లీ అభివృద్ధి చేసిన 'బమ్లానివిమాబ్ 700ఎంజీ', 'ఎటెసెవిమాబ్ 1400ఎంజీ' అనే రెండు ఇంజెక్షన్లను కాక్ టెయిల్ మాదిరి కలిపేసి కొవిడ్ రోగులకు అందిస్తే శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. యాక్టివ్ కేసులు ఇంకా భారీగా ఉన్నందున ఈ డ్రగ్ ను అత్యవసర వినియోగానికి డీజీసీఐ అనుమతిచ్చింది.

ఈ డ్రగన్ ను తమ వెండర్లకు పంపిణీ చేయడంపై దృష్టిసారించిన ఎలీ లిల్లీ.. త్వరలోనే దీన్ని భారత్ లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని ఆ సంస్థ ఎండీ (ఇండియా) ల్యూకా విసిని తెలిపారు. భారత్ లో అనుమతి పొందిన రెండో కాక్ టెయిల్ డ్రగ్ ఇది. ఇంతకు ముందు స్విట్జర్లాండ్ కు చెందిన రోచె ఫార్మా కంపెనీ రూపొందించిన మందుకు డీజీసీఐ ఒకే చెప్పగా, ఇప్పుడు అమెరికా దిగ్గజం ఎలీ లిల్లీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. యాంటీబాడీ కాక్ టెయిల్ డ్రగ్ తోపాటు
కొవిడ్-19 చికిత్స కోసం రెమ్‌డెసివిర్‌తో కలిపి వినియోగించేందుకు అనుమతించిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఔషధం 'బారిసిటినిబ్' తయారీకి సైతం అమెరికా ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తో గతంలోనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అది రాయల్టీ ఫ్రీ, నాన్‌ఎక్స్‌క్లూజివ్ వాలంటరీ లైసెన్సింగ్ ఒప్పందమని కంపెనీలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications