వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల నిరసనలకు ముగింపు.. ఐదు కీలకమైన ప్రశ్నలు, సమాధానాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలో చేపడుతున్న నిరసనకు రైతులు ముగింపు పలికారు.

మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటూ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది.

ఈ నేపథ్యంలో తమ నిరసనలను నిలిపివేస్తున్నట్లు రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ ప్రకటించారు. సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల సమావేశం తరువాత ఆయన ఈ ప్రకటన చేశారు.

అసలు ఇంతకీ రైతుల డిమాండ్లు ఏమిటి? వారి నిరసన ఎలా మొదలైంది? మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ చట్టాల్లో ఏముంది? లాంటి ఐదు కీలక ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం.

https://twitter.com/ANI/status/1468872382412582915

నిరసన ఎప్పుడు మొదలైంది?

సెప్టెంబరు 2020లో వ్యవసాయ సంస్కరణల పేరుతో మూడు చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది.

  • నిత్యవసర సరకుల(సవరణ) చట్టం (ది ఎసెన్షియల్ కమోడిటీస్(అమెండమెంట్) యాక్ట్ 2020).
  • 'రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) చట్టం' (ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్, ఫెసిలిటేషన్) యాక్ట్) )
  • 'రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం-2020(ది ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ - 2020).

ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దిల్లీ సరిహద్దుల వద్ద పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రైతులు 2020 నవంబరు 26 నుంచి నిరసనలు మొదలుపెట్టారు.

రైతుల నిరసనలు

ఈ చట్టాలలో ఏముంది?

నిత్యవసర సరకుల చట్టం -1955కి కొన్ని సవరణలు చేస్తూ.. నిత్యవసర సరకుల (సవరణ) చట్టం (ది ఎసెన్షియల్ కమోడిటీస్(అమెండమెంట్) యాక్ట్ 2020ను తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా నిత్యవసర సరకుల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యం తదితర కార్యకలాపాల నియంత్రణాధికారం కేంద్రానికి ఉంటుంది. ఇది వ్యవసాయ రంగంలో పోటీ, రైతుల ఆదాయం పెంచడానికి ఉద్దేశించిన చట్టంగా కేంద్రం పేర్కొంది.

ఈ చట్టంలోని ప్రధాన అంశాలు

  • ఆహార ఉత్పత్తులపై నియంత్రణ: కొన్ని రకాల ఆహార పదార్థాలు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు వంటివి నిత్యవసరాలుగా పేర్కొనడానికి ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.
  • యుద్ధం, కరవు, ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ప్రకృతి విపత్తులు వంటి అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు తృణధాన్యాలు, పప్పులు, బంగాళా దుంపలు, ఉల్లి, నూనె గింజలు, నూనెలు వంటి ఆహార వస్తువులలో వేటి సరఫరానైనా నియంత్రించే అధికారాన్ని కేంద్రానికి ఇస్తుందీ చట్టం.
  • నిల్వ: ఏదైనా నిత్యవసర వస్తువును ఒక వ్యక్తి ఎంత పరిమాణంలో నిల్వ చేసుకోవచ్చనే నియంత్రణ విధించే అధికారమూ కేంద్రానికి కల్పిస్తుందీ చట్టం. దీనికి ధరల పెరుగుదలను ప్రాతిపదికగా తీసుకుంటారు. దీనికి అయిదేళ్ల సగటు ధరతో కానీ, లేదంటే ఏడాది కిందట ధరతో కానీ పోల్చి పెరుగుదల స్థాయిని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు. ఉద్యాన ఉత్పత్తులైతే 100 శాతం ధర పెరిగిన పక్షంలో నిల్వపై నియంత్రణ విధించే అవకాశం ఉంటుంది. త్వరగా పాడవని వ్యవసాయ ఉత్పత్తులకైతే 50 శాతం ధర పెరిగితే నిల్వపై నియంత్రణ విధించే అవకాశం ఉంటుంది.
  • అయితే, ఆయా వ్యవసాయ వస్తువుల వేల్యూ చైన్ భాగస్వాములకు ఈ నిల్వ పరిమితి వర్తించదు.
  • అంటే పంట పండించేవారి నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, గోదాం, రవాణా, పంపిణీదారు వరకు ఎవరికీ వర్తించదు.
  • ఈ నియంత్రణలు, నిల్వ పరిమితులు ప్రజాపంపిణీ వ్యవస్థకు వర్తించవు.
రైతుల నిరసనలు

'రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) చట్టం'

  • వ్యవసాయ మార్కెట్లను నియంత్రించే మార్కెట్ కమిటీలతో సంబంధం లేకుండా దేశంలో వేర్వేరు రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లోని జిల్లాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఇది అవకాశం కల్పిస్తుంది.
  • మార్కెట్ కమిటీల సరిహద్దులు దాటి విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్రాలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఎలాంటి పన్నులు వేయడానికి, ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు.
  • ఎలక్ట్రానిక్ ట్రేడింగ్: నిర్దేశిత వాణిజ్య ప్రాంతంలో రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్ కమిటీల నియంత్రణలోకి వచ్చే ఉత్పత్తుల ఎలక్ట్రానిక్ వర్తకానికి(ఈ-వర్తకం) ఇది అనుమతిస్తుంది.
  • ఆన్‌లైన్ క్రయవిక్రయాల కోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వేదికను ఏర్పాటు చేయొచ్చు. పాన్ కార్డు ఉన్న కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, రిజిస్టర్డ్ సొసైటీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు, వ్యవసాయ సహకార సంస్థలు ఏవైనా ఇలాంటి ఆన్‌లైన్ వర్తక వేదికను ఏర్పాటు చేయొచ్చు.

'రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం-2020

  • కాంట్రాక్ట్ ఫార్మింగ్: ఏ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించైనా పంట వేయడానికి ముందే రైతు, కొనుగోలుదారు ఒప్పందం కుదుర్చుకునే వీలు కల్పిస్తుందీ చట్టం.
  • ఈ ఒప్పందాలు కనిష్ఠంగా ఒక పంటకాలం నుంచి అయిదేళ్ల వరకు చేసుకోవచ్చు.
  • వ్యవసాయ ఉత్పత్తుల ధర: ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరను పేర్కొనాలి. ధర నిర్ణయ ప్రక్రియను ఒప్పందంలో రాయాలి.
  • మూడంచెల వివాద పరిష్కార విధానం: ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్‌లో తలెత్తే సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ సయోధ్య(కన్సిలియేషన్) బోర్డ్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, అప్పీలేట్ అథారిటీ ఉంటాయి.
  • ఏదైనా వివాదం తలెత్తితే.. మొదట బోర్డు పరిధిలో సయోధ్యకు ప్రయత్నిస్తారు. అక్కడ పరిష్కారం కాకుంటే 30 రోజుల తరువాత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌ను సంప్రదించొచ్చు.
  • సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలేట్ అథారిటీని సంప్రదించొచ్చు.
  • అప్పీలేట్ అథారిటీగా ఐఏఎస్‌ స్థాయి అధికారులు ఉంటారు.
  • ఏ స్థాయిలోనైనా రైతుకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే రికవరీ కోసం వ్యవసాయ భూమిని తీసుకోవడానికి ఈ చట్టం అంగీకరించదు.
రైతుల నిరసనలు

రైతుల డిమాండ్లు ఏమిటి?

ఈ మూడు చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటిస్తూ 2021 నవంబరు 19న దేశంలోని రైతులందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు.

అయితే, కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై తమకు చట్టపూర్వకంగా హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం చట్టాలను వెనక్కి తీసుకున్న తర్వాత, భవిష్యత్ కార్యచరణపై కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో డిసెంబరు 7న సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో రైతు ప్రతినిధులు చర్చలు జరిపారు.

''కనీస మద్దతు ధరపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ నిపుణులు, సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు ఉంటారు''అని కేంద్ర వ్యవసాయ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రైతులపై పెట్టిన కేసులన్నీ తక్షణమే వెనక్కి తీసుకుంటామని స్పష్టంచేసింది.

మోదీ ప్రభుత్వం ఎందుకు యూటర్న్ తీసుకుంది?

నవంబర్ 26నాటికి రైతుల నిరసనకు ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు ప్రకటించారు.

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం. మోదీ ప్రకటన వెలువడటానికి ఒక్కరోజు ముందుగానే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల బాధ్యతలను అమిత్ షాకు అప్పగించారు.

మరోవైపు గురునానక్ జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ప్రకటన వెలువడటానికి పంజాబ్ కూడా ఒక కారణం.

''మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ ఉన్నాయి. సహజంగానే ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికలు ఒక ప్రధాన కారణం. కానీ పంజాబ్‌ విషయంలో మరిన్ని కారణాలున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుంటే బీజేపీకి ఈ రాష్ట్రం కూడా ముఖ్యమైంది'' అని ది హిందూ ఆంగ్ల దినపత్రికకు చెందిన జర్నలిస్ట్ నిస్తులా హెబ్బార్ అన్నారు.

"పంజాబ్ భారతదేశానికి సరిహద్దులో ఉన్న రాష్ట్రం. ఖలిస్తానీ గ్రూపులు అకస్మాత్తుగా చురుకుగా మారాయి. ఈ పరిస్థితిల్లో ఎన్నికలను ఈ గ్రూపులు వినియోగించుకునే అవకాశం ఉంది" అని పంజాబ్‌కు సంబంధించిన మరో కోణాన్ని నిస్తులా వివరించారు.

"బీజేపీకి దీర్ఘకాలంగా పంజాబ్ చాలా ముఖ్యమైనది. 80ల నాటి పరిస్థితులు మళ్లీ అక్కడ ప్రారంభం కావాలని ఎవరూ కోరుకోరు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది."

అకాలీదళ్, బీజేపీలు చాలా కాలంగా మిత్రపక్షాలుగా కొనసాగాయి. కొత్త వ్యవసాయ చట్టం కారణంగా, అకాలీదళ్ గత సంవత్సరం బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలిగింది.

లఖింపూర్‌లో ఏం జరిగింది?

ఉత్తర్‌ప్రదేశ్‌ లఖీంపూర్‌లో రైతుల ఆందోళనలో నలుగురు రైతులు, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు.

కారు కింద పడి ఇద్దరు వ్యక్తులు నలిగిపోయారని, వాహనం బోల్తా పడడంతో మరో ముగ్గురు మరణించారని లఖింపూర్ జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ అరవింద్ చౌరాసియా స్పష్టంచేశారు.

లఖింపూర్ ఖేరిలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు, ఆ తర్వాత ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్ర స్వగ్రామంలో మరొక కార్యక్రమానికి హాజరయ్యారు.

డిప్యూటీ సీఎం పర్యటన సమాచారం అందుకున్న రైతు నాయకులు డిప్యూటీ సీఎంకు తమ నిరసన తెలియజేయడానికి తరలివచ్చారు.

ఈ సమయంలో, టికునియా పట్టణంలో ఒక రోడ్డుపై నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి కాన్వాయ్‌లోని ఒక వాహనం దూసుకెళ్లింది. ఒక రైతు అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటనతో ఆగ్రహించిన రైతులు ఒక కారుకు నిప్పు పెట్టారు.

ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ అక్కడికి చేరుకున్నారు. భారీగా పోలీసులను మోహరించారు.

ఆందోళనల్లో భాగంగా కారుకు నిప్పు పెట్టిన రైతులు

మరోవైపు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్ర కుమారుడు తన వాహనంతో ముగ్గురు రైతులను తొక్కించినట్లు భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు ఆరోపించారు.

అయితే, ఘటన జరిగినప్పుడు తన కుటుంబ సభ్యులు ఎవ్వరూ అక్కడ లేరని అజయ్ మిశ్రా వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై బీజేపీతోపాటు కేంద్ర ప్రభుత్వంపై పెద్దయెత్తు వ్యతిరేకత వ్యక్తమైంది.

''శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను బీజేపీ ప్రభుత్వం.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడు ద్వారా వాహనంతో గుద్దించడం ఘోరమైన అవమానం, క్రూరమైన చర్య''అంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ స్పందిస్తూ.. ''దేశంలోని రైతులను బీజేపీ ఎంతగా ద్వేషిస్తుంది? వాళ్లకు జీవించే హక్కు లేదా? వాళ్లు గొంతెత్తితే కాల్చేస్తారా? కారుతో తొక్కించేస్తారా? ఇక చాలు. ఇది రైతుల దేశం. బీజేపీ క్రూరమైన భావజాలానికి జాగీరు కాదు'' అని ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ''ఈ అమానవీయమైన నరసంహారాన్ని చూసి కూడా మౌనంగా ఉన్నవాళ్లు ముందే చచ్చిపోయారు. కానీ, మేము మాత్రం ఈ బలిదానాన్ని వృథా కానివ్వం. రైతుల సత్యాగ్రహం జిందాబాద్'' అని ట్వీట్ చేశారు.

ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)  

English summary
End to farmers' protests .. Five key questions and answers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X