Haryana Elections: మూడు వర్గాలు-మూడు నినాదాల చుట్టూ ఈసారి హర్యానా ఎన్నికలు..!
హర్యానాలో గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధానంగా రెండు నినాదాలు వినిపిస్తుండేవి. రాజకీయ పార్టీలు కూడా అవే నినాదాలు చుట్టూ తిరుగుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేసేవి. కానీ ఈసారి ఎన్నికల్లో మరో నినాదం కూడా వీటితో పాటు వచ్చి చేరింది. దీంతో ఈసారి మూడు వర్గాలకు సంబంధించిన మూడు నినాదాల చుట్టూ హర్యానాలో ఎన్నికలు తిరుగుతున్నాయి. దీంతో ఈ మూడు నినాదాలు ఎవరిని ఏ స్ధాయిలో ముంచబోతున్నాయనే చర్చ జరుగుతోంది.
ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా మూడు వర్గాల సమస్యలు ఫలితాలను తేల్చబోతున్నాయి. ఇందులో రైతులు, సైనికులు, రెజ్లర్లు. ఈ మూడు వర్గాలకూ గత ఐదేళ్లలో ఒక్కోటి చొప్పున మొత్తం మూడు సమస్యలు ఎదురయ్యాయి. ఇవే ఇప్పుడు ఎన్నికలను నిర్దేశించే వరకూ వెళ్లాయి. వీటిలో రైతులకు వ్యవసాయ బిల్లులు, కనీస మద్దతు ధర, సైనికులకు
అగ్నిపథ్ స్కీం, రెజ్లర్లకు వేధింపులు, అవమానాలు ప్రధానమైనవి.

రైతులు, సైనికుల ప్రధాన రాష్ట్రమైన హర్యానాలో జై కిసాన్, జై జవాన్ నినాదాలు గతంలో వినిపించేవి. ఇప్పుడు రెజ్లర్లు ఎదుర్కొన్న సమస్యల కారణంగా జై పహిల్వాన్ నినాదం కూడా వచ్చి చేరింది. దీంతో ఈసారి ఎన్నికల్లో జై జవాన్, జై కిసాన్, జై పహిల్వాన్ నినాదాలు ఎక్కువగా వినబడుతున్నాయి. కేంద్రం చేతిలో రైతులు, సైనికులు, రెజ్లర్లు గత ఐదేళ్లలో తీవ్ర ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొన్నారు. వీటిపై రాష్ట్రంలో ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈసారి ఎన్నికల్ని వేదికగా చేసుకుని తమ సత్తా చాటేందుకు ఈ మూడు వర్గాలు సిద్ధమవుతున్నాయి.

ఇదంతా కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ ను ఆసక్తికరంగా మార్చేసింది. ఇప్పటికే వెలువడిన పలు సర్వేల్లో కాంగ్రెస్ ముందున్నట్లు తేలింది. దీనికి కారణం కూడా ఈ మూడు నినాదాలు, ఈ మూడు వర్గాలే. దీంతో వీరిని ఆకట్టుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. హర్యానాలో అక్టోబర్ 5న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పటికల్లా ఆయా వర్గాలను ఏదో విధంగా ఆకట్టుకుంటే తప్ప బీజేపీ గెలిచే పరిస్ధితి కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications