ఉద్యోగులకు EPFO బ్యాడ్ న్యూస్ - ఆ లిస్ట్ నుంచి ఆధార్ అవుట్.. !
దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్ధ (EPFO)ఇవాళ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకూ ఉద్యోగుల పుట్టిన తేదీని ధృవీకరించేందుకు అందుబాటులో ఉంచిన డాక్యుమెంట్లలో ఒకదాన్ని తొలగించేసింది. దేశంలో గుర్తింపు కార్డులపై జరుగుతున్న చర్చలో భాగంగా ఇప్పటికే పలు ప్రభుత్వ విభాగాలు ఈ డాక్యుమెంట్ ను తొలగిస్తుండటంతో ఈపీఎఫ్ఓ కూడా అదే బాట పట్టింది.
ఉద్యోగుల భవిష్యత్ నిధిలో చందాదారులుగా ఉన్న ఉద్యోగులకు జనన ధృవీకరణ పత్రంగా ఇప్పటివరకూ తీసుకుంటున్న పత్రాల్లో ఆధార్ కార్డు కూడా ఒకటి. కానీ దాన్ని ఇవాళ్టి నుంచి తొలగిస్తూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగానూ, జనన ధృవీకరణ పత్రంగానూ ఉద్యోగులు వాడుతున్నారు. దీంతో మరే ఇతర డాక్యుమెంట్ అవసరం లేకపోయినా ఆధార్ ఉంటే సరిపోతోంది. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ నిర్ణయంతో ఉద్యోగులు జనన ధృవీకరణ కోసం ఇతర పత్రాలపై ఆధారపడాల్సిందే.

ఉద్యోగులు తన జనన ధృవీకరణ కోసం సమర్పించాల్సిన ఇతర డాక్యుమెంట్ల జాబితాను ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఇందులో గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ జారీ చేసిన మార్క్ షీట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (ఎస్ఎల్సీ) లేదా ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ (టీసీ), పేరు, పుట్టిన తేదీ కలిగిన ఎస్ఎస్సీ మార్క్ షీట్, పాన్ కార్డ్, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పెన్షన్ ఐడీలు, ప్రభుత్వాలు జారీ చేసే డొమిసైల్ సర్టిఫికెట్, పాస్ పోర్టు, సివిల్ సర్జన్లు ఇచ్చే మెడికల్ సర్టిఫికెట్లు మాత్రమే చెల్లుతాయి.
ఆయా డాక్యుమెంట్లను ఉద్యోగులు భవిష్య నిధి ఖాతాల్లో పుట్టిన తేదీల్లో తేడా ఉంటే మార్పు కోసం సమర్పించాల్సి ఉంటుంది. వీటిని సరిపోల్చుకుని ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పుట్టిన తేదీల్లో సవరణలు చేస్తుంది. వీటి ఆధారంగానే భవిష్యత్తులో పీఎఫ్ చెల్లింపులు ఉంటాయి. కాబట్టి ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications