EPFO: పీఎఫ్ విత్ డ్రా మరింత సులభం-ఆ రెండు రూల్స్ రద్దు..!
దేశవ్యాప్తంగా ఉద్యోగులకు భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్ ను వెనక్కి తీసుకునేటప్పుడు ఉన్న నిబంధనల్ని ఒక్కొక్కటిగా ఉపసంహరిస్తూ వస్తున్న సంస్థ .. ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పీఎఫ్ విత్ డ్రా కోసం అమల్లో ఉన్న రెండు నిబంధనల్ని రద్దు చేసేసింది. దీంతో దేశంలోని 8 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఈపీఎఫ్ఓ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఉద్యోగులు తమ పీఎఫ్ మొత్తాల్ని విత్ డ్రా చేసుకొనేటప్పుడు క్యాన్సిల్ చెక్కు సమర్పణతో పాటు మరో విషయంలోనూ వెసులుబాటు లభించింది. ఇకపై పీఎఫ్ విత్ డ్రాకు క్యాన్సిల్ చెక్కు సమర్పించాల్సిన అవసరం లేదని సంస్థ వెల్లడించింది. అలాగే పీఎఫ్ చందాదారుడు తమ బ్యాంక్ ఖాతాను ద్రవీకరించాల్సిన అవసరం కూడా లేదని తేల్చిచెప్పేసింది.

ఇప్పటివరకూ పీఎఫ్ కడుతున్న ఉద్యోగులు సంస్థ నుంచి తప్పుకున్నప్పుడు లేదా మధ్యలో లోన్ తీసుకున్నప్పుడు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే తమ పీఎఫ్ ఖాతాలో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ చెక్కును సమర్పించాల్సి ఉంది. అలాగే బ్యాంక్ అకౌంట్ ను కూడా వారు పనిచేసే సంస్థ ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఒకటి లేకపోయినా ఈ మొత్తాలు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఈ రెండు రూల్స్ ను తొలగించింది. దీంతో మరింత వేగంగా పీఎఫ్ మొత్తాల్ని విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది.












Click it and Unblock the Notifications