కాంగ్రెస్ పొరపాటున అధికారంలోకి వచ్చినా..: హర్యానాకు మోడీ హెచ్చరిక
ఛండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోడీ. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానాలో బీజేపీ తరపున ప్రచార సభల్లో పాల్గొన్నారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించారు.
హర్యానా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతోందని ప్రధాని మోడీ చెప్పారు. కాంగ్రెస్ ఆశలు సన్నగల్లుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా.. బంధుప్రీతి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే ప్రభుత్వ వ్యవస్థలో భారీగా అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ హర్యానాను వారి వారసులకు, మధ్యవర్తులకు అప్పగించిందన్నారు.

హర్యానా రాష్ట్రం బీజేపీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు ప్రధాన మోడీ. వ్యవసాయ, పరిశ్రమల రంగాల్లో దేశం అగ్రస్థానంలో ఉందని ప్రధాని చెప్పారు. పారిశ్రామిక వృద్ధితోనే దళితుల సాధికారత ముడిపడి ఉందని అంబేద్కర్ పేర్కొన్నారని ప్రధాని మోడీ గుర్తు చేశారు. హర్యానా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న సమయంలో ఓ బాలుడు తాను గీసిన మోడీ చిత్రాన్ని చూపుతుండటం ఆయన గమనించారు. తన చిరునామా రాసి, ఆ చిత్రాన్ని భద్రతా సిబ్బందికి అందించాలని బాలుడిని ప్రధాని కోరారు. తాను ఆ బాలుడికి లేఖ రాస్తానని చెప్పారు.
సోనిపట్, రోహ్‌తక్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలు, పానిపట్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రధాని మోడీ తన ఎన్నికల ప్రచారంలో కవర్ చేశారు. సెప్టెంబర్ 15న కురుక్షేత్రలో ప్రధాని మోడీ తన మొదటి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వరుసగా మూడోసారి అధికారాన్ని నిలుపుకునేందుకు మోడీతోపాటు జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. జమ్మూకాశ్మీర్ తోపాటు అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications