పాకిస్థాన్‌తో శాంతికి యత్నిస్తే ద్రోహం, శత్రుత్వమే ఎదురైంది!
అమెరికాకు చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (AI) పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్ (Lex Fridman) పాడ్‌కాస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని పలు కీలక అంశాలపై మాట్లాడారు. విమర్శ అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిదని.. అందుకే తాను విమర్శలను స్వాగతిస్తాననని చెప్పారు. అయితే, విమర్శలు మరింత నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు.
తన శక్తి పేరులో లేదని.. 140 కోట్ల మంది భారతీయుల మద్దతు, దేశ సంస్కృతి, వారసత్వంలోనే ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తాను ప్రపంచ నేతలతో చేయి కలిపినప్పుడు.. అది మోడీ చేస్తున్నది కాదు.. 140 కోట్ల మంది భారతీయులు చేస్తున్నట్లేనని చెప్పారు. శాంతి గురించి తాము మాట్లాడినప్పుడు ప్రపంచం తమ మాట వింటుందన్నారు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ జన్మించిన నేల ఇదని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

తన ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్థాన్‌ను ఆహ్వానించానని ప్రధాని మోడీ తెలిపారు. అయితే, పాకిస్థాన్‌తో శాంతి కోసం ప్రయత్నించినప్పుడల్లా తమకు శత్రుత్వం, ద్రోహమే ఎదురైందని తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చడం ఇస్లామాబాద్ నాయకత్వంపైనే ఆధారపడి ఉంటుందన్నారు.
విమర్శలను స్వాగతిస్తానని.. అవి ప్రజాస్వామ్యానికి ఆత్మ అని నమ్ముతానని ప్రధాని మోడీ చెప్పారు. పాకిస్థాన్‌కి జ్ఞానోదయం అవ్వాలని, వారు శాంతి మార్గాన్ని ఎంచుకుంటారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.
సుద్దముక్కతో బూట్లను మెరిపించేవాడ్ని: మోడీ
తాను పేదరికం నుంచే అన్ని విషయాలు నేర్చుకున్నానని ప్రధాని మోడీ తెలిపారు. తన బాల్యం మొత్తం పేదరికంలోనే గడిచిందన్నారు. తన తెల్ల బూట్లను మెరిపించేందుకు పాఠశాలలో వాడి పడేసిన సుద్ద ముక్కలను సేకరించి తెచ్చుకునేవాడిని చెప్పారు. ఓ గొప్ప సత్కార్యం కోసం ఉన్నత శక్తి నన్ను ఇక్కడకు పంపించిందన్నారు. తాను ఒంటరిని కాదని, తనను ఇక్కడికి పంపించిన వారే తనకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటారని ప్రధాని మోడీ చెప్పారు. తన తండ్రి టీ దుకాణానికి వచ్చే వారిని చూసి తానెంతో నేర్చుకున్నట్లు తెలిపారు. వాటినే తన ప్రజా జీవితంలో అమలు చేస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications