ఆ పిటీషన్‌పై అత్యవసర విచారణ: సీజేఐ ఎన్వీ రమణను సంప్రదించిన తరువాతే: తేల్చేసిన సుప్రీం జడ్జి
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ పిటీషన్‌పై విచారణ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వానికి అనుకోని షాక్ ఇచ్చింది. ఈ పిటీషన్‌పై అత్యవసరంగా విచారణను చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సున్నితంగా తిరస్కరించింది. దీన్ని విచారణకు స్వీకరించలేమని సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఈ విషయంపై తాను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను సంప్రదించాల్సి ఉందని తేల్చి చెప్పారు.
నీట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్లలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్) వారి అర్హతను నిర్ధారించింది కేంద్ర ప్రభుత్వం. ఈడబ్ల్యూఎస్ కోటాను నిర్ధారించడానికి ఎనిమిది లక్షల రూపాయల వార్షికాదాయాన్ని ప్రాతిపదికగా తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు అందజేసింది. ఎనిమిది లక్షల రూపాయలు లేదా అంతకంటే తక్కువ వార్షికాదాయం ఉన్న కుటుంబాల వారిని ఆర్థికంగా వెనుకబడిన తరగతికి చెందిన వారిగా గుర్తించి, రిజర్వేషన్ కల్పిస్తామని పేర్కొంది.

కేంద్రం నుంచి అఫిడవిట్ అందిన నేపథ్యంలో- దీనిపై దాఖలైన పిటీషన్‌పై విచారణను వేగవంతం చేయాలని, అత్యవసరంగా వాదనలను చేపట్టాలని కేంద్రం కోరింది. ఈ మేరకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ పిటీషన్‌ను విచారణ చేస్తోన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీన్ని రేపు విచారణకు తీసుకోవాలని అన్నారు. దీనికి జస్టిస్ చంద్రచూడ్ బదులిస్తూ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను సంప్రదించాల్సి ఉందని చెప్పారు.
ఈ పిటీషన్‌పై విచారణను నిర్వహించాల్సి ఉన్న న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ వేర్వేరు బెంచ్‌లల్లో ఉన్నారని చెప్పారు. జస్టిస్ సూర్యకాంత్.. సీజేఐ ఎన్వీ రమణ బెంచ్‌లో కొనసాగుతున్నారని, అందువల్ల ఆయన అనుమతిని తీసుకోవాల్సి ఉందని అన్నారు. అత్యవసరంగా విచారణ జరిపించడానికి ప్రత్యేకంగా బెంచ్‌ను ఏర్పాటు చేస్తే గనక- ఈడబ్ల్యూఎస్ కోటా పిటీషన్‌ను అత్యవసర విచారణకు తీసుకుంటానని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
నిజానికి- ఈ పిటీషన్‌ను ఈ నెల 6వ తేదీన లిస్టింగ్ అయింది. ఢిల్లీలో రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనకు దిగిన నేపథ్యంలో కేంద్రం దిగి వచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటా ఎనిమిది లక్షల రూపాయల వార్షికాదాయంగా నిర్దారించింది. వారి ఆందోళనను విరమింపజేయడానికి అత్యవసరంగా విచారించాలని కోరింది. అఖిల భారత కోటాలో ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) వారికి 27 శాతం, ఈడబ్ల్యూఎస్ వారికి 10 శాతాన్ని కేంద్రం కల్పించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications