చైనా ద్వంద్వ నీతి... బరితెగింపు ప్రకటన... డ్రాగన్‌కు అర్ధరాత్రి భారత్ ధీటైన రిప్లై...
భారత సరిహద్దులో పొరుగు దేశాలు భౌగోళిక ఆక్రమణలకు తెగబడుతున్నాయి. ఇప్పటికే నేపాల్ లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా భారత భూభాగాలను తమ మ్యాప్‌లోకి ఎక్కించుకుని.. ఏకంగా పార్లమెంటులోనూ ఆమోదించుకుంది. తాజాగా చైనా సైతం తన బరితెగింపును బయటపెట్టుకుంది. గాల్వన్ వ్యాలీ తమదేనంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటనకు భారత్ కూడా ధీటైన బదులిచ్చింది. ఇది మీ అతిశయోక్తి అని,ఏమాత్రం ఆమోదయోగ్యం కానిదని చైనాకు స్పష్టం చేసింది.

ఆ విషయాలను గుర్తుచేసిన భారత్..
ఈ సందర్భంగా భారత్ చైనాకు రెండు విషయాలను గుర్తుచేసింది. ఇటీవల ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన టెలీఫోన్ సంభాషణలో.. సరిహద్దు వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామన్న ఒప్పందాన్ని గుర్తుచేసింది. అలాగే జూన్ 6న ఇరు దేశాల మిలటరీ కమాండర్స్ మధ్య జరిగిన ఒప్పందాన్ని నిబద్దతతో అమలుచేయాలని చెప్పింది. వీటిని విస్మరించి అతిశయోక్తితో కూడిన ఆమోదయోగ్యం కాని ప్రకటనలు చేయడం ఇరు దేశాల మధ్య అవగాహనకు విరుద్దమని స్పష్టం చేసింది. బుధవారం అర్ధరాత్రి తర్వాత భారత్ ఈ ప్రకటన చేసింది.

ఆర్మీ ప్రకటన తర్వాత విదేశాంగ ప్రకటన..
గాల్వన్ వ్యాలీ తమదేనంటూ మొదట పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్టర్న్ థియేటర్ కమాండ్ ప్రకటించింది. సోమవారం(జూన్ 16) రాత్రి భారత్-చైనా మధ్య తలెత్తిన ఘర్షణల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఆ తర్వాత చైనా విదేశాంగ శాఖ కూడా గాల్వన్ వ్యాలీ తమదేనని అధికారిక ప్రకటన చేయడం భారత్‌తో సరిహద్దు వివాదాన్ని మరింత పెంచేదిగా మారింది. డైలీ బ్రీఫింగ్స్‌లో భాగంగా పీఎల్ఏ ఆఫీసర్ స్టేట్‌మెంట్‌ను,ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చల సారాన్ని చైనా విదేశాంగ మంత్రి చదివి వినిపించారు. ఈ సందర్భంగా చైనీస్ ఆఫీసర్ తన స్టేట్‌మెంట్‌లో గాల్వన్ వ్యాలీ తమదేనని పేర్కొనడాన్ని ప్రస్తావించారు. అదే సమయంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల చర్చల్లో ఆ పాయింట్ ఎక్కడా లేదని మాత్రం చైనా పేర్కొనకపోవడం గమనార్హం.
Recommended Video

చైనా ద్వంద్వ నీతి..
ఓవైపు భారత్‌తో వివాదాలను కోరుకోవట్లేదని చెబుతూనే... గాల్వన్ వ్యాలీ తమదేనని ప్రకటించుకోవడం చైనా ద్వంద్వ నీతిని బయటపెడుతోంది. దశాబ్దాలుగా ఎన్నడూ లేనిది చైనా గాల్వన్ వ్యాలీపై కన్నేయడం భారత్‌తో కయ్యానికి కాలు దువ్వడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్ కంటే తామే శక్తివంతులమని నిరూపించుకోవడానికి తహతహలాడుతోంది. మరోవైపు భారత్ కూడా తమ సార్వభౌమత్వానికి భంగం కలిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మున్ముందు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్నది ఉత్కంఠను రేపుతోంది.












Click it and Unblock the Notifications