Tamil Nadu Twist: ఎగ్టిట్ పోల్స్ తో తమిళ లెక్క మారిందా ? పార్టీల రియాక్షన్ ఇదే..!
తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీకి గత నెల 23న జరిగిన ఎన్నికలపై తాజాగా ఎగ్జిట్ పోల్ (Exit Poll 2026)ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో అనూహ్యంగా డీఎంకే, అన్నాడీఎంకేలకు షాకిచ్చేలా విజయ్ పార్టీ టీవీకే ఫలితాలు సాధిస్తుందని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఇతర సంస్థలు మాత్రం డీఎంకే కూటమిదే విజయమని తేల్చిచెప్పేశాయి. ఈ నేపథ్యంలో మూడు పార్టీల నేతలు తాజా ఎగ్జిట్ పోల్స్ పై స్పందించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై డీఎెంకే, అన్నాడీఎంకే, టీవీకే నేతలు ఏమన్నారో ఓసారి చూద్దాం..
తమిళనాడులో ఎగ్జిట్ పోల్ అంచనాలపై ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ జాగ్రత్తగా స్పందించారు. చెన్నైలో జరిగిన మేడే సభలో స్టాలిన్.. సర్వే అంచనాలపై ఆధారపడకుండా గెలుపుపై ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. కష్టానికి తగిన వేతనం పొందడం ఉద్యోగి హక్కు. అదేవిధంగా, మే 4న (ఫలితాల రోజు) మన మిత్రుల కష్టానికి ప్రతిఫలం లభిస్తుందన్నారు. ఇందులో రవ్వంత కూడా మార్పు లేదన్నారు. తాను ఇది ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చెబుతున్నానని అనుకోవద్దన్నారు. పార్టీ నాడిని తాను అర్థం చేసుకున్నందుకే ఈ మాటలు చెప్పగలుగుతున్నట్లు వెల్లడించారు. అంతేగానీ మరే ఇతర కారణం లేదన్నారు.

అన్నాడీఎంకే మాత్రం ఎగ్టిట్ పోల్ అంచనాలను పూర్తిగా తిరస్కరించింది. ఎగ్జిట్ పోల్స్ చారిత్రాత్మకంగా పార్టీని తక్కువగా అంచనా వేశాయని ఆ పార్టీ ఎంపీ ఇన్‌బదురై అన్నారు. తాము 150 సీట్లు గెలుస్తామన్నారు. టీవీకేకి చెందిన నిర్మల్ కుమార్ .. క్షేత్రస్థాయి వాస్తవాలు సంప్రదాయ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే శిబిరం తరఫున, అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా డీఎంకేకు అనుకూలమైన అంచనాలను సంప్రదాయవాదమైనవిగా అభివర్ణించారు. తమ పార్టీ సొంతంగానే స్పష్టమైన మెజారిటీని సాధిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications