కాంగ్రెస్ ‘జై భీమ్’ నినాదం అందుకే!
కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడారు. నేషన్ ఫస్ట్ అనేది తమ ప్రభుత్వ విధానమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దేశ ప్రజల ప్రగతి కోసమే అహర్నిశలు తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
అయితే, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఫ్యామిలీ ఫస్ట్ అనేది విధానమని ప్రధాని మోడీ విమర్శించారు. అందుకే ఆ పార్టీతో సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ సాధ్యం కాలేదన్నారు. ఆ పార్టీ నుంచి అది ఆశించడం కూడా తప్పేనని చురకలంటించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పాలించినా.. ఆ కాలంలో మరో విధానం ఆలోచించే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు. ప్రజల కళ్లకు గంతలు కట్టి అధికారాన్ని కాపాడుకున్నారన్నారు ప్రధాని మోడీ.

తమ ప్రభుత్వ హయాంలో కేవలం దేశ ప్రజల ప్రగతి కోసం సమయం కేటాయించడం జరుగుతోందన్నారు ప్రధాని మోడీ. తమ ప్రభుత్వ పదేళ్ల కాలంలో సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ మార్పును గమనిస్తున్నామన్నారు. తమ డెవలప్‌మెంట్ మోడల్‌ను ప్రజలు గెలిపించారని ప్రధాని మోడీ చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో అర్హులకే పథకాలు అందుతున్నాయని తెలిపారు.
తమ ప్రభుత్వ హయాంలోనే దేశంలోని ఎస్సీ, ఎస్టీలను బలోపేతం చేశామని ప్రధాని మోడీ వివరించారు. తాము వచ్చాకే ఓబీసీల డిమాండ్లను నెరవేర్చామని తెలిపారు. దేశంలోని దివ్యాంగుల కోసం మిషన్ మోడల్ పనిచేస్తున్నామని ప్రధాని మోడీ చెప్పారు. ట్రాన్స్ జెండర్లు గౌరవంగా జీవించేలా తమ ప్రభుత్వం పనిచేసిందన్నారు.
Speaking in the Rajya Sabha. https://t.co/OZKM3x0CEX
— Narendra Modi (@narendramodi) February 6, 2025
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గౌరవించలేదని ప్రధాని మోడీ అన్నారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు అవమానించిందని మండిపడ్డారు. అంబేద్కర్‌ను ఎన్నికల్లో కాంగ్రెస్ కుట్ర చేసి ఓడించిందన్నారు. ఇప్పుడేమో ఓట్ల కోసం కాంగ్రెస్ జై భీమ్ అంటోందని ప్రధాని మోడీ విమర్శించారు.












Click it and Unblock the Notifications