రైతు ఆత్మహత్య: ఏఏపీ విపరీత వ్యాఖ్య, బీజేపీ, కాంగ్రెస్ భగ్గు
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ర్యాలీలో రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య చేసుకున్న వివాదం ముదురుతోంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీని లక్ష్యం చేసుకున్నాయి. కేజ్రీ ప్రభుత్వం పైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
రైతు ఆత్మహత్య నేపథ్యంలో గురువారం ఉదయం ఢిల్లీ పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని బీజేపీ ముట్టడించింది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ నివాసాన్ని ముట్టడించారు. రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్యకు ఆమ్ ఆద్మీ పార్టీయే కారణమని నినదించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఆమ్ ఆద్మీ పార్టీ రెచ్చగొట్టడం వల్లనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఆ పార్టీ పైన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాఫ్తు జరిపించాలని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ప్రభుత్వ తీరు వల్లే రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు.

కాగా, వివాదాస్పదమైన భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ర్యాలీలో రైతు ఆత్మహత్య చేసుకోవడం రాజకీయ రంగును పులుముకుంది. రాజకీయ పార్టీలు పరస్పరం విమర్ళలు చేసుకోవడంలో మునిగిపోయాయి.
కుమార్ విశ్వాస్, అశుతోష్‌లు ఘటనపై విపరీత వ్యాఖ్యలు చేశారు. ఏఏపీ ర్యాలీని భగ్నం చేసేందుకు బీజేపీ చేసిన కుట్రగా రైతు ఆత్మహత్యను కుమార్ విశ్వాస్ అభివర్ణించారు. మరో ఆప్ నేత అశుతోష్ ఏఏపీ కార్యకర్తలు చెట్లు ఎక్కడంలో శిక్షణ తీసుకోలేదని, అందుకే వారు రైతును రక్షించడంలో విఫలమయ్యారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
అసలు ఇది కేజ్రీవాల్ తప్పిదం, ఆయన స్టేజి దిగి రైతును రక్షించాల్సింది, ఈసారి ఆయన తప్పకుండా చెట్లు ఎక్కి ప్రజలను రక్షిస్తారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఏఏపీ నేతలు రైతు ఆత్మహత్యపై ఇలా మాట్లాడటం మరింత వివాదాస్పదమైంది. కాగా, ఈ ఆత్మహత్యపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉభయ సభల్లో ప్రకటన చేసే అవకాశముంది.












Click it and Unblock the Notifications