ఢిల్లీలో ఉద్రిక్తత తీవ్రం- 144 సెక్షన్ విధింపు
Farmers' protest 2024: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరోసారి ఉత్తరాది రైతులు ఉద్యమించనున్నారు. దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు.
2021లో రైతుల ఆందోళన రోజుల తరబడి సాగిన విషయం తెలిసిందే. దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన దీక్షలను కొనసాగించారు. ఏడాది కాలం పాటు వారంతా ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలను కొనసాగించారు. ఇప్పుడు మరోసారి రోడ్డెక్కడానికి సిద్ధపడ్డారు. ఈ నెల 13వ తేదీన ఛలో ఢిల్లీ ఆందోళనకు పిలుపునిచ్చారు.

కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, సంయుక్త్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా.. వంటి 200లకు పైగా రైతు సంఘాలు ఈ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. ఛలో ఢిల్లీ ఆందోళనలో మూడు లక్షల మంది వరకు రైతులు పాల్గొనే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్.. వంటి రాష్ట్రాల నుంచి 500లకు పైగా ట్రాక్టర్లతో ఢిల్లీకి తరలి వెళ్లనున్నారు రైతులు. దీనికోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేపట్టారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరను కల్పించడంతో పాటు గతంలో తాము ప్రతిపాదించిన తమ డిమాండ్లను పరిష్కరించాలని పట్టుబట్టుతున్నారు.
ఈ ప్రదర్శన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. కట్టుదిట్టమైన భద్రత చర్యలను తీసుకున్నారు. హర్యానా, పంజాబ్ నుంచి ఢిల్లీలో ప్రవేశించే మార్గాలను మూసివేశారు. ఢిల్లీ-ఘాజీపూర్, టిక్రీ, సింఘూ సరిహద్దులు మూతపడ్డాయి. సరిహద్దుల్లో పెద్ద ఎత్తున అదనపు పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఈ మార్గం గుండా రాకపోకలను సాగించే వాహనాలను తనఖీ చేస్తోన్నారు పోలీసులు.
ఈ ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో 144 సెక్షన్‌ను విధించారు. ఈ మేరకు నార్త్ ఈస్ట్ ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జాయ్ టిర్కే ఉత్తర్వులు జారీ చేశారు. నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ ప్రొసీజన్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications