రుతుపవనాలు: 25 ఏళ్లలో ఎన్నడూ లేనంత! అన్నదాతకు అగ్నిపరీక్షే?
భారత వ్యవసాయ రంగం ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి రెండు పెను సవాళ్లను ఎదుర్కోబోతోంది. అంచనాలకు తగ్గట్టుగా కురవని వర్షాలు, పశ్చిమ ఆసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు వెరసి.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కుంగదీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ ఆందోళనను మరింత పెంచుతున్నాయి.
2026 నైరుతి రుతుపవనాలపై ఐఎండీ విడుదల చేసిన తొలి దీర్ఘకాలిక అంచనా షాకింగ్ వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాల సగటు (LPA)లో కేవలం 92 శాతంగానే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గత 25 ఏళ్లలో ఇంత తక్కువ స్థాయిలో ప్రారంభ అంచనా వెలువడటం ఇదే తొలిసారి. గత రెండేళ్లుగా (2024, 2025) సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసిన నేపథ్యంలో, ఈ ఏడాది అంచనా వ్యవసాయ రంగానికి గట్టి ఎదురుదెబ్బగా పరిణమించేలా ఉంది.

ఖరీఫ్‌కు 'వర్షం' గండం..
బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం.. రుతుపవనాల పనితీరుకు, వ్యవసాయ వృద్ధికి విడదీయలేని సంబంధం ఉంది. ముఖ్యంగా ఖరీఫ్ దిగుబడులకు, వర్షపాతానికి మధ్య 0.64 సంబంధిత గుణకం (correlation coefficient) ఉంది. అంటే, వర్షం తగ్గితే ఖరీఫ్ పంటలు కుదేలవడం ఖాయం. ప్రస్తుతం దేశంలో కేవలం 50 నుంచి 60 శాతం భూమికి మాత్రమే నీటిపారుదల వసతి ఉంది. మిగిలిన సగం సాగు పూర్తిగా వానదేవుడి కరుణపైనే ఆధారపడి ఉంది. వర్షపాతం 96 శాతం కంటే తక్కువ ఉంటే వ్యవసాయ వృద్ధి రేటు గణనీయంగా పడిపోతుందని చారిత్రక డేటా చెబుతోంది.
వ్యవసాయానికి తప్పని 'యుద్ధ' సెగ!
ప్రకృతి కన్నెర్ర చేయడమే కాకుండా, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా వ్యవసాయ ఖర్చులను పెంచేలా ఉన్నాయి. పశ్చిమ ఆసియాలో సాగుతున్న సంఘర్షణల వల్ల గ్యాస్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఎరువులు, పురుగుల మందుల తయారీలో గ్యాస్ అత్యంత కీలకం. యుద్ధం కారణంగా వీటి ధరలు పెరగడం లేదా లభ్యత తగ్గడం వల్ల రైతుపై ఆర్థిక భారం మరింత పెరగనుంది. మంచి పంట పండాలంటే కేవలం నీరు ఉంటే సరిపోదు, సరసమైన ధరకే ఎరువులు దొరకాలి. కానీ ఇప్పుడు ఆ రెండు అంశాలూ అనిశ్చితిలో ఉన్నాయి.
మే నెలపైనే ఆశలు..
ప్రస్తుతానికి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, మే చివరిలో ఐఎండీ విడుదల చేసే సవరించిన నివేదిక కోసం నిపుణులు వేచి చూస్తున్నారు. గతంలో తొలి అంచనాలకు, వాస్తవ వర్షపాతానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, ఆధునిక సాంకేతికత వల్ల ఇప్పుడు ఆ తేడా తగ్గుతోంది. సగటున 87 సెం.మీ. కురవాల్సిన వర్షం ఈసారి 80 సెం.మీకే పరిమితమైతే, అది దేశ జీడీపీ (GDP) గణాంకాలపై, గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఉద్యానవన పంటలు, పొగాకు, రబ్బరు వంటి వాణిజ్య పంటలు కూడా ఈ ప్రభావాన్ని చవిచూడనున్నాయి.














Click it and Unblock the Notifications