మరింత వేగంతో మరో రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు! ప్రయాణికులకు 2 గంటల సమయం ఆదా?
ముంబై-ఢిల్లీ మార్గంలో మరింత వేగంగా తిరిగే మరో రాజధాని ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రచిస్తోంది. ఈ రైలు ద్వారా ప్రయాణ కాలాన్ని మరో రెండు గంటలు తగ్గించాలన్నది ఆ శాఖ అధికారుల
న్యూఢిల్లీ: ముంబై-ఢిల్లీ మార్గంలో మరింత వేగంగా తిరిగే మరో రాజధాని ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రచిస్తోంది. ఈ రైలు ద్వారా ప్రయాణ కాలాన్ని మరో రెండు గంటలు తగ్గించాలన్నది ఆ శాఖ అధికారుల యోచన.
ఇప్పటికే ముంబై-ఢిల్లీ మార్గంలో మార్గంలో రెండు రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు తిరుగుతున్నాయి. తాజాగా ఈ మార్గంలో ఈ ఏడాది దీపావళి నాటికల్లా మూడో ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.

ముంబైలోని బాంద్రా స్టేషన్ నుంచి రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో బయలుదేరిన ప్రయాణికులు ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరుకోవడానికి ప్రస్తుతం 15 గంటలు పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే ఈ మార్గంలో ఆగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్ ప్రెస్, ముంబై సెంట్రల్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ పేరుతో రెండు రైళ్లు నడుస్తున్నాయి. ఆగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్ ప్రెస్ సగటున గంటకు 89 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ 17 గంటల 5 నిమిషాల్లో 1,377 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుండగా, ముంబై రాజధాని ఎక్స్ ప్రెస్ గంటకు 89 కిలోమీటర్ల సగటు వేగంతో 1386 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 15 గంటల 35 నిషాల్లో గమ్యస్థానానికి చేరుతోంది.
కొత్తగా ప్రవేశపెట్టబోయే రాజధాని ఎక్స్ ప్రెస్ 13 గంటల్లో తన గమ్యస్థానానికి చేరుకోగలదని భావిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులకు 2 గంటల సమయం ఆదా అవుతుంది. ఈ కొత్త ఎక్స్ ప్రెస్ రైలుకు సంబంధించి కొద్దిరోజుల్లోనే ట్రయల్ రన్ కూడా మొదలవనుంది.
ప్రస్తుతం ముంబై రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు రెండు ఇంజన్లు, 24 కంపార్ట్ మెంట్లతో నడుస్తున్నట్లు ఓ సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టబోయే రాజధాని ఎక్స్ ప్రెస్ రైలుకు మాత్రం ఒకే ఇంజను, 14 బోగీలే ఉంటాయి. అందువల్ల దీని వేగం ప్రస్తుత రైళ్లకంటే ఎక్కవుగా ఉంటుంది.
ఇటీవల వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రైలు బోగీల విషయంలోనూ రైల్వే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. యాంటీ క్లయింబింగ్, సుపీరియర్ బ్రేకింగ్ సిస్టం కలిగిన లింకే హాఫ్ మాన్ బుష్(ఎల్ఎహ్ బి) రకం బోగీల వాడకం వల్ల ప్రమాద తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
నిజానికి ప్రస్తుతం నడుస్తున్న ముంబై రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు వేగాన్ని గంటకు 130 కిలోమీటర్ల వరకు పెంచుకోవచ్చు. కానీ ముంబై-ఢిల్లీ మార్గంలో లెక్కలేనన్ని మలుపులు ఉండడంతో ఈ రైలు సగటు వేగాన్ని గంటకు 89 కిలోమీటర్లకు కుదించారు.
అదే ముంబై రాజధాని ఎక్స్ ప్రెస్ రైలుకు గనుక ఈ ఎల్ హెచ్ బి రకం బోగీలు తగిలిస్తే గంటకు సగటున 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని, మధ్యలో రైలు ఆగే మజిలీలను కూడా 6 నుంచి 3 లేదా 2 కుదిస్తే ముంబై నుంచి ఢిల్లీకి కేవలం 13 గంటల్లో ప్రయాణం సాధ్యమేనని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. కొత్తగా ప్రవేశపెట్టబోయే రాజధాని ఎక్స్ ప్రెస్ రైలును గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్లు ప్రయాణించేలా చూస్తారు.
నిజానికి ముంబై-ఢిల్లీ రైలు మార్గంలో అత్యధికంగా వ్యాపార వర్గాలకు చెందిన వారే ప్రయాణిస్తుంటారు. ఈ మార్గంలో నడిచే రైళ్లు 15 గంటల ప్రయాణ సమయాన్ని తీసుకోవడం వల్ల చాలామంది రైలు ప్రయాణం కంటే కూడా విమాన ప్రయాణానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో రైళ్ల వేగం మరింత పెంచి ప్రయాణ సమయాన్ని తగ్గించే అంశంపై రైల్వే అధికారులు దృష్టి సారించారు.












Click it and Unblock the Notifications