కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్ బీఐ పేరుతో లోన్, రూ 5 లక్షలు సబ్సిడి, క్లైమాక్స్ లో అందరూ ?
రుణం ఇప్పిస్తానని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో అమాయకులను మోసం చేసిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని అనేకల్ తాలూకాలో చోటుచేసుకుంది. కర్ణాటక సరిహద్దులోని హోసూరు (తమిళనాడు)కు చెందిన పవిత్ర అనే మహిళ ఆమె టీమ్ తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పేరు, ఆర్ బీఐ పేరు దుర్వినియోగం చేస్తూ ఈ మోసానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది.
బ్లూ వింగ్స్ ట్రస్ట్ పేరుతో 14 మంది మోసగాళ్లు రూ. కోట్లు లూటీ చేశారని వెలుగు చూసింది. మా
ట్రస్టుకు ఆర్‌బీఐ నుంచి రూ17 కోట్లు మంజూరు అయ్యిందని చెప్పి కస్టమర్లను మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తికి రూ. 10 లక్షలు రుణం ఇస్తే అందులో రూ 5 లక్షలు సబ్సిడీ అని చెప్పి ప్రజలను నమ్మించిన మోసగాళ్లు బెంగళూరు నగర శివార్లలోని చందాపూర, అత్తిబెలె, హోసూరు, ధర్మపురి తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను మోసం చేశారని వెలుగు చూసింది.

ఏ 1 నిందితురాలు అయిన పవిత్రా మీద కేసు నమోదు చెయ్యాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమిళనాడులోని హోసూర్‌కు చెందిన పవిత్ర అనే మహిళ బ్లూ వింగ్స్ ట్రస్ట్ పేరుతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేరు, ఆర్ బీఐ పేరు చెప్పుకుని మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంతకంతో కూడిన నకిలీ లెటర్ హెడ్ కాపీని చూపించి ప్రజలను నమ్మించేలా వందలాది మంది అమాయకులకు టోపీ పెట్టే పని చేశారని వెలుగు చూసింది.
అలాగే డబ్బు పంచుతున్న సమయంలో, ఆ నోట్లు పంచే వీడియోలు చూపిస్తూ ప్రజలను నమ్మించేలా చేశారని బాధితులు అంటున్నారు. ఈ వీడియోను చూసి దాన్ని నమ్మిన వ్యక్తులు ఓ గ్రూపుగా ఏర్పడి డబ్బులు ఇస్తున్నారని తెలిసింది. కానీ నెలలు గడుస్తున్నా రుణం రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఇప్పుడు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. బాధితులను నమ్మి వారు అడిగినంత డబ్బులు ఇచ్చిన బాధితులు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన అమాయకులు వీధిన పడ్డారు.
ఈ ఘటనకు సంబంధించి సూర్యనగర్‌లో నివాసం ఉంటున్న బాధితులు ఫిర్యాదు చెయ్యడంతో బెంగళూరు నగర శివార్లలోని అత్తిబెలె పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. పవిత్రతో పాటు ఉన్న ప్రవీణ్, యల్లప్ప, షీలా, రుక్మిణి, రాధ, మమత, నెహ్రూజీ, శరత్ కుమార్, సతీష్, మంజుల, హెల్మెట్ మార్టిన్, హేమలత, షాలినిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్ బీఐ పేరు దుర్వినియోగం చేసి ప్రజలను మోసం చేసిన వారి కోసం గాలిస్తున్నామని అత్తిబెలె పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications