ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల జలసమాధి
బెంగళూరు: స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్లిన ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు జలసమాధి అయిన సంఘటన బెంగళూరు నగర శివార్లలోని చిక్కజాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈత రాదని చెప్పి గట్టు మీద కూర్చుని ఉన్న ముగ్గురు విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు.
బెంగళూరు నగరంలోని రేవణ సిద్దేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ లో బెంగళూరు నగరంలోని ఆర్ టీ నగర నివాసి హరీష్ (20), బ్యాటరాయణపుర నివాసి నందకుమార్ (20), విద్యారణ్యపుర నివాసి అరుణ్ చంద్రశేఖర్ (21), రాజేష్ (20), కెం పాటిల్ (21) అనే ఐదుగురు నాలుగవ సెమిస్టర్ చదువుతున్నారు.
ఈ ఐదుగురు మరో ముగ్గురు స్నేహితులను పిలుచుకుని గురువారం మధ్యాహ్నం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని బెట్టే హలసూరు దగ్గర ఉన్న క్వారిల దగ్గరకు వెళ్లారు. తరువాత 60 అడుగుల నీరు నిండిన పెద్ద గుంతలో (చిన్న చెరువు) ఈత కొట్టడానికి సిద్దమయ్యారు.
ఆ సందర్బంలో ముగ్గురు తమకు ఈత రాదని తాము రాబోమని చెప్పి దూరంగా ఉండిపోయారు. తరువాత హరీష్, నందకుమార్, రాజేష్, కెం పాటిల్, చంద్రశేఖర్ ఈత కొట్టడానికి వెళ్లారు. ఆ సమయంలో ఒకరు మునిగిపోతున్న సమయంలో గట్టిగా కేకలు వేశాడు. తరువాత అతనిని పట్టుకొవడానికి స్నేహితులు ప్రయత్నించారు.

ఒకరిని ఒకరు పట్టుకుని అలాగే మునిగిపోయారు. గట్టు మీద ఉన్న ముగ్గురు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నీటి గుంతలో గాలించి నలుగురి మృతదేహాలు బయటకు తీశారు.
హరీష్ మృతదేహం కనపడటం లేదని, గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. కంగారులో ఒకరిని ఒకరు పట్టుకుని లాక్కొని వెళ్లడంతో జలసమాధి అయ్యారని పోలీసులు అన్నారు. మృతదేహాలను అంబేద్కర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. డీసీపీ వికాస్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.












Click it and Unblock the Notifications