కాంగ్రెస్ కు ఆ రెండు- బీజేపీకి ఈ రెండు- అక్కడ హంగ్- ఎగ్జిట్ పోల్స్ సారాంశం ఇదే..!
ఈ నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఇవాళ పలు మీడియా సంస్ధలు, ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించాయి. ఇందులో కాంగ్రెస్, బీజేపీకి రెండేసి రాష్ట్రాల్లో ఆధిక్యం కట్టబెట్టాయి. మరో రాష్ట్రంలో మాత్రం హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3వ తేదీన జరిగే కౌంటింగ్, అందులో వెలువడే ఫలితాలు ఆసక్తి పెంచేస్తున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలపైనా వీటి ప్రభావం పడనుంది.
Recommended Video

ఇవాళ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో తెలంగాణ ఎన్నికల్లో దాదాపు అన్ని సర్వే సంస్ధలు కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం కట్టబెట్టాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్ధలూ కాంగ్రెస్ 50 నుంచి 80 సీట్ల మధ్య సాధించబోతున్నట్లు తేల్చిచెప్పేశాయి. అన్ని సర్వేల్లోనూ అధికార బీఆర్ఎస్ వెనుకబడింది. తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ ఉన్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ డిసెంబర్ 3న వెలువడే ఫలితాలపై భారీ ఆశలు పెట్టుకున్నాయి.

తెలంగాణ పొరుగున ఉన్న ఛత్తీస్ ఘడ్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. ఈ నెలలో జరిగిన ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మరోసారి ఆధిక్యంలో నిలవబోతున్నట్లు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సంస్ధలూ తేల్చేశాయి. అలాగే బీజేపీ రెండోస్దానంతో సరిపెట్టుకోవాల్సిందేనని కూడా స్పష్టం చేస్తున్నాయి. ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ ముందంజలో లేదని చెప్పకపోవడం ఇక్కడ విశేషం.
మరోవైపు ఐదేళ్లకోసారి అధికారాన్ని మార్చే సంప్రదాయం ఉన్న రాజస్తాన్ లో ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురు కావడం ఖాయమని దాదాపు అన్ని సర్వేలు తేల్చిచెప్పేశాయి. ఇక్కడ విపక్షంలో ఉన్న బీజేపీ ఈసారి 100 సీట్లకు పైగా సాధించి అధికారంలోకి రావడం ఖాయమని కూడా చెబుతున్నాయి. ప్రధాని మోడీ వర్సెస్ అశోక్ గెహ్లాట్ గా మారిన ఈ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. ఈ ఒక్క రాష్ట్రంలో బీజేపీ స్పష్టమైన విజయం సాధించేలా కనిపిస్తోంది.
అటు హిందీ హార్ట్ ల్యాండ్ గా చెప్పుకునే మధ్యప్రదేశ్ లో హోరాహోరీ పోరు జరిగిందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టం చేశాయి. అయితే ఇక్కడ బీజేపీ స్వల్ప ఆధిక్యం సాధిస్తుందని మెజార్టీ సర్వేలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఆధిక్యం అందుకునే అవకాశం ఉందని దైనిక్ భాస్కర్, జన్ కీ బాత్ వంటి మరికొన్ని ఎగ్గిట్ పోల్స్ తెలిపాయి. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం ఇక్కడ ఆ పార్టీకి బాగానే కలిసి వచ్చిన్నట్లు అర్ధమవుతోంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే డిసెంబర్ 3 వరకూ ఆగాల్సిందే.
ఇక చివరిగా ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మాత్రం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పాత్ర నామమాత్రమే. స్ధానిక పార్టీలైన ఎంఎన్ఎఫ్, జడ్పీఎం మధ్య హోరాహోరీ పోరు సాగింది. అయితే వీరిద్దరిలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా కాంగ్రెస్ కీలకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మిజోరంలో కాంగ్రెస్ అధికార భాగస్వామి అవుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications