Agnipath: ఆందోళనకారులకు స్థానం లేదు, ఎఫ్ఐఆర్ నమోదైతే అనుమతి లేదు
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు త్రివిధ దళాల ఉన్నత అధికారులు. మిలటరీ నియామక ప్రక్రియ అగ్నిపథ్‌కు దరఖాస్తు చేసుకునేవారు గతంలో నిరసనలు, హింసాత్మక ఘటనల్లో ఎన్నడూ పాల్గొనలేదనే విషయాన్ని వెల్లడించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు సమయంలోనే ప్రమాణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు.
ఒక వేళ ఎఫ్ఐఆర్ నమోదైనట్లు పోలీస్ వెరిఫికేషన్లో తేలితే అటువంటి వారికి అగ్నివీరులుగా ప్రవేశం పొందేందుకు ఆస్కారం ఉండదని త్రివిధ దళాల ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. అగ్నిపథ్ పథకం 1989 నుంచి పెండింగ్ లో ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
గతంలో ఎన్నడూ ఎలాంటి ఆందోళనలు, దాడుల్లో పాల్గొనలేదని ప్రతి ఒక్క అభ్యర్థి ప్రతిజ్ఞ చేయాలని స్పష్టం చేశారు సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరీ. అగ్నివీరులుగా ఎంపికయ్యే సమయానికి పోలీసు వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. తాజాగా ప్రవేశపెట్టిన పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు తాము ఊహించలేదన్నారు.

క్రమశిక్షణే భారత సైన్యానికి పునాది అని, అటువంటి సైన్యంలో దాడులు, దహనాల వంటి క్రమశిక్షణారాహిత్యానికి చోటు లేదని స్పష్టం చేశారు. ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనలేదని ప్రతి అభ్యర్థి ప్రమాణపత్రం సమర్పించాలన్నారు. పోలీస్ వెరిపికేషన్లో ఏ అభ్యర్థి మీదైనా ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తేలినా.. అగ్నివీరులుగా వారికి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. కాగా, అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
సైన్యం, నౌకాదళం, వైమానిక మూడు సర్వీసుల్లో వయస్సు ప్రొఫైల్‌లో తగ్గింపు కొంతకాలంగా పట్టికలో ఉందని, కార్గిల్ సమీక్ష కమిటీ కూడా దీనిపై పరిశీలనలు చేసిందని చెప్పారు. అగ్నిపథ్ పథకంపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆందోళన చెందకుండా అగ్నిపథ్ పథకం ద్వారా చేపట్టే నియామకాల్లో పాల్గొనాలని సూచించారు. విధ్వంసానికి పాల్పడేవారికి ఆర్మీలో అవకాశం ఉండదన్నారు.
నావికాదళంలో అగ్నివీర్‌లను చేర్చేందుకు, జూన్ 25 నాటికి నౌకాదళ ప్రధాన కార్యాలయం రిక్రూట్‌మెంట్ కోసం విస్తృత మార్గదర్శకాన్ని రూపొందిస్తుందని వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి తెలిపారు. రిక్రూట్ అయిన మొదటి బ్యాచ్ నవంబర్ 21 నాటికి శిక్షణ కార్యక్రమంలో చేరుతుందని త్రిపాఠి తెలిపారు. ఈ పథకం కింద పురుషులు, మహిళలు ఇద్దరినీ రిక్రూట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం కింద రిక్రూట్‌మెంట్‌ను చేర్చుకునే ఎయిర్ ఫోర్స్ ప్లాన్ గురించి వివరాలను తెలియజేస్తూ.. జూన్ 24న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మొదటి దశ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ పరీక్ష ప్రక్రియ జూలై 24న ప్రారంభమవుతుందని ఎయిర్ మార్షల్ ఎస్‌కే ఝా తెలిపారు. "డిసెంబరు 30 నాటికి మొదటి బ్యాచ్ రిక్రూట్‌లకు శిక్షణను ప్రారంభించాలని మేము ప్లాన్ చేస్తున్నాము" అని ఎయిర్ మార్షల్ ఝా చెప్పారు.
ఈ పథకం కింద సైనికులను చేర్చుకోవడానికి ఆర్మీ ప్రణాళికను ప్రకటిస్తూ.. లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొనప్ప మాట్లాడారు. సైన్యం సోమవారం ముసాయిదా నోటిఫికేషన్‌తో వస్తుందని, జూలై 1 నుంచి ఫోర్స్‌లోని వివిధ రిక్రూట్‌మెంట్ యూనిట్ల ద్వారా తదుపరి నోటిఫికేషన్‌లు జారీ చేయబడతాయి. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్‌లలో భారతదేశ వ్యాప్తంగా అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్‌మెంట్ ర్యాలీలు జరుగుతాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications