ఢిల్లీ సరిహద్దుల నుండి రైతులను బలవంతంగా తరలిస్తే జరిగేదిదే ..రాకేష్ టికాయత్ సంచలన వార్నింగ్ !!
దేశ రాజధాని ఢిల్లీలో అన్నదాతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. అన్నదాతల ఆందోళన దాదాపు సంవత్సర కాలం పూర్తి కావస్తుంది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చెయ్యని ఆందోళన లేదు. సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం మేరకు వ్యవసాయాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ ఢిల్లీ సరిహద్దుల్లో నినదిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నా కేంద్రం తీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉంది.

తిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో బారికేడ్ లను తొలగించిన పోలీసులు
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత సంవత్సరం నవంబర్ 26వ తేదీ నుండి రైతులు ఆందోళన బాట పట్టారు. అప్పటి నుండి విభిన్న రీతులలో రైతుల ఆందోళన కొనసాగుతుంది. ఎంతో మంది రైతులు ఈ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా రైతులు ఆందోళన చేస్తున్న ఢిల్లీ హర్యానా సరిహద్దులో తిక్రీ, ఢిల్లీ ఉత్తర ప్రదేశ్ సరిహద్దు ఘాజీపూర్ ప్రాంతాలలో పోలీసులు బారికేడ్లను తొలగించారు. రైతులు ఆందోళన చేయడానికి ఏర్పాటు చేసుకున్న ఫెన్సింగ్ లను తొలగించారు. రైతులు అక్కడ నుండి ఖాళీ చెయ్యాలని, ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించవద్దని కోరుతున్నారు. సరిహద్దు మీదుగా ఢిల్లీ లోకి రైతులు ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

సరిహద్దుల మూసివేతపై సుప్రీం ఆగ్రహం .. తాజా పోలీసుల చర్యలతో రైతుల అనుమానం
ఇటీవల సుప్రీంకోర్టు రైతుల ఆందోళన పై సాగించిన విచారణలో ఆందోళన చేసే హక్కు రైతులకు ఉందని కానీ రహదారులను నిరవధికంగా అడ్డుకోవడం సమంజసం కాదని పేర్కొంది. దీనికి సంయుక్త కిసాన్ మోర్చా తాము రోడ్లను అడ్డుకోవడం లేదని, పోలీసులే రహదారులను దిగ్బంధించారు అని స్పష్టం చేసింది.
ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్ల దిగ్బంధం దానికి పోలీసులే బాధ్యులని రైతు సంఘాలు తెలిపిన కొద్దిరోజుల తర్వాత పోలీసులు బారికేడ్లను తొలగించడం, రైతుల ఆందోళనలు అడ్డుకోవాలని ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే తరహాలో సింఘూ బోర్డర్ లో బారికేడ్ లను తొలగించనున్నట్టు సమాచారం.

ఢిల్లీ సరిహద్దుల నుండి రైతుల బలవంతపు తరలింపు యత్నం .. రాకేష్ టికాయత్ సంచలన ప్రకటన
ఇదిలా ఉంటే ఢిల్లీ సరిహద్దుల నుంచి నిరసనకారులను బలవంతంగా తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయత్ శనివారం నాడు హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనను అడ్డుకుంటే వినూత్న నిరసనలు దిగుతామని వెల్లడించారు. భారతీయ కిసాన్ యూనియన్ (BKU) చీఫ్ రాకేష్ టికాయత్ మాట్లాడుతూ రైతులు దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలను ధాన్యం మార్కెట్‌లుగా మారుస్తామని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ధాన్యం మార్కెట్ లుగా మారుస్తామని ట్వీట్
రైతులను బలవంతంగా సరిహద్దుల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ధాన్యం మార్కెట్ లుగా మారుస్తారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్ మరియు తిక్రీ సరిహద్దుల నుండి సిమెంట్ దిమ్మెలు మరియు బారికేడ్లను తొలగించిన రెండు రోజుల తర్వాత రైతుల ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని రాకేష్ టికాయత్ తాజా ప్రకటన చేశారు.
నవంబర్ 26, 2020 నుండి కేంద్రం యొక్క మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ వేలాది మంది రైతులు మూడు సరిహద్దుల పాయింట్లు తిక్రీ, సింగు మరియు ఘాజీపూర్ వద్ద నిరసన తెలుపుతూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలు తమ ప్రయోజనాలకు విరుద్ధమని ఆందోళన చేస్తున్న రైతులు పేర్కొంటుండగా, కేంద్రం మాత్రం ఈ చట్టాలు రైతుకు అనుకూలమని చెబుతోంది. మూడు వ్యవసాయ చట్టాలు ఉపసంహరణ చేసేది లేదని కేంద్రం భీష్మించుకు కూర్చుంది.












Click it and Unblock the Notifications